నమ్మకం పూర్తిగా పోయినట్లేనా?

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయ‌కుల్లో దాడి వీర‌భ‌ద్రరావు కీల‌క నాయ‌కుడు. టీడీపీలో ఉన్నస‌మ‌యంలో ఆయ‌న ఓ వెలుగు వెలిగిన మాట వాస్తవం. అయితే, [more]

Update: 2020-05-23 12:30 GMT

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయ‌కుల్లో దాడి వీర‌భ‌ద్రరావు కీల‌క నాయ‌కుడు. టీడీపీలో ఉన్నస‌మ‌యంలో ఆయ‌న ఓ వెలుగు వెలిగిన మాట వాస్తవం. అయితే, అనూహ్యంగా ఆయ‌న 2014 కు ముందు చంద్రబాబు రెండుక‌ళ్ల సిద్ధాంతానికి (ఏపీ విభ‌జ‌న‌పై) విభేదిస్తూ.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వచ్చారు. అదే స‌మ‌యంలో దూకుడుపై ఉన్న వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న సీనియార్టీకి పెద్దపీట వేశారు. అన్నా అన్నా అంటూ.. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా మంచి గుర్తింపు ఇచ్చారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న కుమారుడు ర‌త్నాక‌ర్‌కు విశాఖ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చారు.

తిరిగి టీడీపీలో చేరి…

అయితే, ఆ ఎన్నిక‌ల్లో దాడి వీర‌భ‌ద్రరావు ఎలాంటి ప్రభావం చూపించ‌లేక పోయారు. ఏకంగా ఇక్కడ బీజేపీ విజ‌యం సాధించింది. ఇక‌, ఆ త‌ర్వాత దాడి అనూహ్యంగా 2016లో జ‌గ‌న్‌తో విభేదించారు. చంద్రబాబు పాల‌న‌ను మెచ్చుకుంటూ… జ‌గ‌న్‌ను తిట్టిపోస్తూ.. మ‌ళ్లీ టీడీపీ జెండా క‌ప్పుకొన్నారు. ఈ క్రమంలో టీడీపీలో ఏదైనా ప‌ద‌వి ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. దాడి వీర‌భ‌ద్రరావును పార్టీలోకి అయితే, తీసుకున్నారు కానీ.. బాబు మాత్రం ఎలాంటి గుర్తింపూ ఇవ్వలేదు. దీంతో మ‌ళ్లీ దాడి వీర‌భ‌ద్రరావు జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు ప్రయ‌త్నించార‌నే ప్రచారం కూడా సాగింది. జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను ఇంటికి పిలిచి మ‌రీ ఆయ‌న‌కు ఆతిథ్యం ఇచ్చారు.

ఎవరూ పట్టించుకోక పోవడంతో…

అయితే, ఏమైందో ఏమో దాడి వీర‌భ‌ద్రరావు మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు. కొన్నాళ్లకు మ‌ళ్లీ వైసీపీ పంచ‌న చేరిపోయారు. జ‌గ‌న్ కూడా వ్యూహాత్మకంగా ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకున్నారు. అయితే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌న‌కుమారుడు దాడి ర‌త్నాక‌ర్‌కు టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్‌ను కోరినా.. దీనిని తిర‌స్కరించారు. అన‌కాప‌ల్లి టికెట్‌ను గుడివాడ అమ‌ర్నాథ్‌కు ఇచ్చారు జ‌గ‌న్‌. పైగా పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో దాడికి ఇక మార్గం లేక పార్టీలోనే కొన‌సాగుతున్నారు. దాడి వీర‌భ‌ద్రరావు సుదీర్ఘంగా గెలిచిన అన‌కాప‌ల్లిలో ఆయ‌న వైభ‌వం అంతా గ‌త‌మే అన్నట్టుగా మారింది. దాడి ఫ్యామిలీని అటు జ‌గ‌న్ కాని.. ఇటు పార్టీ ఉత్తరాంధ్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయి రెడ్డి కాని ప‌ట్టించుకోవ‌డం లేదు.

అవుట్ డేటెడ్ నేతగా….

పైగా వైసీపీ నాయ‌కుడు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే అమ‌ర్నాథ్‌తో దాడి వీరభ‌ద్రరావు అడుగ‌డుగునా విభేదిస్తున్నారు. ఎమ్మెల్యే గుడివాడ‌పై స్థానిక ప‌త్రిక‌ల్లో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నార‌న్న చ‌ర్చలు సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేకు ఆయ‌న‌కు మ‌ధ్య తీవ్రస్థాయిలో విభేదాలు న‌డుస్తున్నాయి. పోనీ.. దాడి ఏమ‌న్నా.. ఇప్పుడు ప్రజ‌ల‌ను ప్రభావం చేసే స్తాయిలో ఉన్నారా అంటే అది కూడాలేదు. దాడి వీర‌భ‌ద్రరావు ఔట్ డేటెడ్ ‌నాయ‌కుడు. గుడివాడ‌ను ఓడించాల‌నేది వ్యూహం అయిన‌ప్పటికీ.. దాడి ఆ రేంజ్‌లో పాలిటిక్స్ చేయ‌లేక‌పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. పైగా అన‌కాప‌ల్లిలో స్థానిక సీట్లలో త‌న కుమారుడిని నిల‌బెట్టాల‌ని దాడి భావించారు.

స్థానికంగా చెక్….

కానీ, అమ‌ర్నాథ్ వ్యూహాత్మకంగా అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఐదు జీవీఎంసీ వార్డులు ఐదు మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ అయ్యేలా చ‌క్రం తిప్పారు. దీంతో ర‌త్నాక‌ర్ కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. పోనీ.. నేరుగా జ‌గ‌న్ ద‌గ్గర‌కే వెళ్లి ఏదైనా మొర‌పె ట్టుకుం దామ‌ని అనుకున్నా.. దాడి వీర‌భ‌ద్రరావు పై జ‌గ‌న్‌కు న‌మ్మకం లేదు. కుమారుడిపైనా అంతే.. ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇక‌, రాబోయే రోజుల్లో దాడి వీర‌భ‌ద్రరావు రాజ‌కీయాలు క‌నిపించ‌వేమో.. అనే ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ఇక్కడి ప‌రిశీల‌కులు చెప్పుకొంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News