మాస్టార్ వాలంటరీ రిటైర్మెంట్ ?

ఆయన హిందీ మాస్టార్ గా పూర్వాశ్రమంలో జనానికి పరిచయం. ఇక తెలుగుదేశంలోకి ఎన్టీఆర్ పిలుపుతో వచ్చాక రాజకీయ మాస్టర్ అయిపోయారు. ఆయనే విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ [more]

Update: 2020-12-28 08:00 GMT

ఆయన హిందీ మాస్టార్ గా పూర్వాశ్రమంలో జనానికి పరిచయం. ఇక తెలుగుదేశంలోకి ఎన్టీఆర్ పిలుపుతో వచ్చాక రాజకీయ మాస్టర్ అయిపోయారు. ఆయనే విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన టీడీపీ వైసీపీ, మధ్యలో మళ్ళీ విరామం మళ్ళీ వైసీపీ ఇలా తన నాలుగు దశాబ్దాల రాజకీయాన్ని కొనసాగించారు. గత ఏడాది ఎన్నికలకు ముందు హైదరాబాద్ వెళ్ళి లోటస్ పాండ్ లో జగన్ చేతుల మీదుగా కొడుకుతో కలసి కండువా కప్పించుకున్నారు. ఆ తరువాత అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ మీద ఆశపడినా జగన్ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక చూద్దామని హామీ ఇచ్చారు.

చురుకు తగ్గిందా…?

తొలి ఏడాది జగన్ ని వెనకేసుకువచ్చి వరసగా విశాఖలో మీడియా సమావేశాలు పెట్టి తెగ మాట్లాడిన దాడి వీరభద్రరావు కరోనా తరువాత ఫుల్ సైలెంట్ అయ్యారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నోరు విప్పితే ఒట్టు అన్నట్లుగా ఉంటున్నారు. తనకూ, కుమారుడిని హామీ ఇచ్చిన జగన్ దానిని తీర్చలేదన్న అసంతృప్తి దాడి వీరభద్రరావులో ఉందని అంటున్నారు. తాము పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తే కనీస గుర్తింపు లేదన్నది మాస్టార్ ఆవేదన. దాంతో దాడి వీరభద్రరావు కావాలనే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి సైడ్ అయ్యారని అంటున్నారు.

ఇక నో పాలిటిక్స్ …..

ప్రస్తుతానికి చూస్తే దాడి వీరభద్రరావు నో పాలిటిక్స్ అన్నట్లుగా ఉన్నారు. తన కుమారుడు, రాజకీయ వారసుడు దాడి రత్నాకర్ ని మాత్రం పార్టీలో తిరగమంటూ ఒక సలహా ఇచ్చేసి తాను తప్పుకున్నారు. ఒక విధంగా చూస్తే మాస్టర్ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారా అన్న చర్చ కూడా వైసీపీలో సాగుతోంది. విశాఖ రూరల్ జిల్లా కేంద్రమైన అనకాపల్లి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఆరేళ్ళ పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన దాడి వీరభద్రరావు శాసనమండలిలో విపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. కానీ 2013 తరువాత రాజకీయం ఆయనకు అనుకూలం కాలేదు అంటున్నారు.

అదొక్కటే ఆశ …..

తన కుమారుడు రత్నాకర్ కి 2024లో అనకాపల్లి టికెట్ ఇవ్వాలన్నది దాడి వీరభద్రరావు డిమాండ్ గా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ గాజువాక ప్రాంతానికి చెందిన వారు. ఆయన నాన్ లోకల్ అంటూ వైసీపీలో ఇప్పటికే పొగ పెట్టిస్తున్నారు. మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిన ఓడిస్తామని కూడా చెప్పిస్తున్నారు. దాంతో ఇక తన కుమారుడికి టికెట్ కచ్చితంగా వస్తుందని నమ్మకంతో ఉన్నారుట. లేకపోతే ఆనాటి పరిస్థితుల బట్టి మాతృ సంస్థ టీడీపీలోకి మళ్ళీ జంప్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి డెబ్బయ్యేళ్ళు దాటిన దాడి వీరభద్రరావుకి పొలిటికల్ రిటైర్మెంట్ ఇచ్చిన ఘనత మాత్రం జగన్ దే అని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News