‘‘పవర్’’ ఫ్రస్టేషన్ లో…?

విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయం ఇపుడు ఎలా ఉందంటే అధికార పార్టీలో ఏ అధికారం లేని సాధారణ నేత మాదిరిగా [more]

Update: 2019-10-12 05:00 GMT

విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయం ఇపుడు ఎలా ఉందంటే అధికార పార్టీలో ఏ అధికారం లేని సాధారణ నేత మాదిరిగా ఉందని అంటున్నారు. ఎన్టీయార్, చంద్రబాబుల క్యాబినెట్లో అనేక శాఖలతో మంత్రి పదవులు ఘనంగా నిర్వహించిన దాడి వీరభద్రరావు రాజకీయ చరమాంకంలో తన కుమారుడిని సరైన పదవిలో చూడాలనుకున్నారు. కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలని దాడి వీరభద్రరావు తపన. చట్టసభల్లో తన వారసుడు ఉండాలని కలలు కన్న ఈ వృధ్ధ నాయకునికి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడంలేదంటున్నారు. దానికి కారణం దాడి వీరభద్రరావు వేసిన కొన్ని రాంగ్ స్టెప్పులేనని అంటున్నారు.

అటూ ఇటూ తిరిగినా….

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు నిజానికి తెలుగుదేశంలో పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గం మనిషిగా ఉండేవారు. అందుకే ఆయన ఆగస్ట్ ఎపిసోడ్ లో పార్టీ చీలిన సమయంలో అన్న గారి వెంటే ఉన్నారు. తరువాత లక్ష్మీ పార్వతితో కుదరక మళ్ళీ చంద్రబాబుని ఆశ్రయించారు. మొత్తానికి చంద్రబాబు ఆనాటి రాజకీయ అవసరాలకు తగినట్లుగా దాడి వీరభద్రరావుని చేరదీసినా కూడా మొదటి నుంచి తన వర్గంలో ఉన్న అయ్యన్నపాత్రుడి మాటకే ఎక్కువ విలువ ఇచ్చేవారు. అయితే లోకల్ బాడీ ఎన్నిక‌ల ద్వారా ఎమ్మెల్సీ అయిన దాడిని తప్పనిసరి పరిస్థితుల్లో శాస‌నమండలిలో ప్రతిపక్షనేతగా బాబు నియమించారు. అయితే ఆ పదవీకాలం ముగిసిన తరువాత మరోమారు ఎమ్మెల్సీ ఇమ్మని దాడి వీరభద్రరావు కోరినా బాబు ససేమిరా అనడంతో ఆ పార్టీ నుంచి దాడి తప్పుకున్నారు. తరువాత 2014 ఎన్నికలు ముందు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరి తన కుమారుడు దాడి రత్నాకర్ ని విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలు అయిన తరువాత వైసీపీకి రాం రాం అనేశారు. మళ్ళీ ఇపుడు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పటికే టీడీపీ, జనసేనా అంటూ ఊగిసలాడిన దాడి గాలి వైసీపీ వైపు ఉందని అందులో చేరారని అంటారు. ఇక జగన్ టికెట్ ఇవ్వకుండా పార్టీలో తాను బాగా చూసుకుంటానని మాత్రమే హామీ మాత్రం ఇచ్చారు.

లిస్ట్ పెద్దదే …

ఇక జగన్ సైతం తన వద్ద ఉన్న నామినేటెడ్ పదవులు పంపిణీ చేయడానికి చాంతాడంత పెద్ద లిస్ట్ ఉంది. అందులోనూ పార్టీ నమ్ముకుని మొదటి నుంచి ఉన్న వారు ఉన్నారు. చివరి నిముషంలో దాడి వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ చేరినా కూడా వారికి అవకాశాలు ఇవ్వడం కష్టంగా ఉందని అంటున్నారు. పైగా దాడి వీరభద్రరావు ఒకసారి పార్టీ నుంచి వెళ్ళి వచ్చినవారు దాంతో విశ్వ‌సనీయతను ఎంతవరకూ నిలబెట్టుకుంటారని కూడా హైకమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో దాడి వీరభద్రరావు రాజకీయంగా ఆగలేకపోతున్నారని అంటున్నారు. ఇక చూస్తే దాడి వీరభద్రరావుది ఇపుడు అవుట్ డేటెడ్ పాలిటిక్స్. ఆయన కుమారుడికి అనకాపల్లి అసెంబ్లీ సీట్లో పెద్దగా పట్టు లేదు. అక్కడ మొదటి నుంచి పార్టీ కోసం పని చేసి ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాధ్ ఉన్నాడు, జగన్ కి అతనంటే మంచి గురి ఉంది. దీంతో దాడి వీరభద్రరావు కుటుంబాన్ని పక్కన పెడుతున్నారని అంటున్నారు. మొత్తం మీద దాడి తొందరపాటు కప్పదాట్లు వల్లనే సీనియర్ అయి ఉండి, పార్టీ అధికారంలో ఉన్నా ఏ పదవి పొందలేకపోతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News