దాడి మాస్టార్ కి చెక్ పెట్టేశారా… ?

వైసీపీలో ఒక వెలుగు వెలుగుదామని వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు జగన్ మరో మారు చెక్ పెట్టేసారు. ఇది 2014 కాదు మాస్టారూ అంటూ గట్టిగానే [more]

Update: 2021-08-02 06:30 GMT

వైసీపీలో ఒక వెలుగు వెలుగుదామని వచ్చిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు జగన్ మరో మారు చెక్ పెట్టేసారు. ఇది 2014 కాదు మాస్టారూ అంటూ గట్టిగానే చెప్పారు. 2014 ఎన్నికల ముందు పార్టీలో దాడి, ఆయన కుమారుడు రత్నాకర్ చరితే వెంటనే విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన జగన్ వారికి సముచిత న్యాయమే చేశారు. అయితే ఓడిపోయిన వెంటనే జగన్ మీద నానా రకాలైన విమర్శలు చేస్తూ దాడి వీరభద్రరావు బయటకు వచ్చారు. ఇక అన్ని పార్టీలు తిరిగి 2019 ఎన్నికల ముందు వైసీపీలో ఆయన చేరారు. కానీ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఇపుడు చూస్తే అతి పెద్ద నామినేటెడ్ జాతరలో కూడా ఒక్క పదవిని కూడా విదల్చలేరు.

అంతన్నారు కానీ…?

ఎంచుకోవాలే కానీ మాస్టార్ ఫ్యామిలీకే అగ్రతాంబూలం అంటూ వార్తలు వచ్చాయి. విశాఖ డీసీసీబీ చైర్మన్ పదవి అన్నారు. రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ అన్నారు. ఇపుడు ఏదీ కాకుండా చేశారని దాడి వీరభద్రరావు వర్గం మండుతోంది. నిజానికి దాడి కుమారుడికి గ్రంధాలయ చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకున్నా ఆయన ఎందుకో అది వద్దనుకుని వేరే పదవి కావలాని కోరారని టాక్ అయితే ఉంది. దాంతో ఇచ్చిన పదవిని కూడా వెనక్కు లాగేసుకున్నారని చెబుతున్నారు. జగన్ దగ్గర బేరాలు అసలు కుదరవ‌ని ఈ ఎపిసోడ్ చెబుతోంది అంటున్నారు.

అదే కారణమా..?

దాడి వీరభద్రరావు పాత రోజుల్లో రాజకీయాల్లో హీరో. కానీ ప్రస్తుతం జిల్లాను శాసిస్తోంది రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఆయనతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేయడంతో దాడి ఫ్యామిలీ వెనకబడింది అంటున్నారు. అంతే కాదు, జిల్లాలోనూ పార్టీలోనూ పొలిటికల్ గా తామే ఎక్కువ అన్న భావనతో వారు ఉండడం వల్లనే రాజకీయంగా చెడ్డారని కూడా చెబుతున్నారు. దాడి వీరభద్రరావు వరకూ చూస్తే సీనియర్ నేతగా ఉన్నారు. మరి కుమారుడు రత్నాకర్ అయినా విజయసాయిరెడ్డితో సన్నిహితంగా ఉండాల్సింది అన్న మాటా ఉంది. మొత్తానికి ఈక్వేషన్లు ఏమి పనిచేశాయో ఏమో కానీ దాడి కుటుంబాన్ని పక్కన పెట్టేశారు అంటున్నారు.

అయ్యే పనేనా ..?

నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ఊడ్చి మరీ ఇచ్చేశారు. ఇపుడు ఇవ్వడానికి కూడా ఏమీ లేవు. అయితే దాడి ఫ్యామిలీ ఎంతో ఊహించుకుని పెద్ద పదవులను డిమాండ్ చేయడం వల్లనే హై కమాండ్ ఇవ్వలేకపోతోంది అంటున్నారు. రత్నాకర్ ని అంతకు ముందు సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమిస్తే ఆయన కాదన్నారు. ఇక లేటేస్ట్ గా గ్రంధాలయ చైర్మన్ పదవి వద్దన్నారు. మరి ఆయనకు కావాల్సింది ఏంటి అంటే ఇంకా పెద్ద పదవులుట. మరి ఆ పదవులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే జగన్ ఇస్తున్నారు. అందుకే దాడి వీరభద్రరావు డిమాండ్లు పట్టించుకోలేదు అంటున్నారు. ఇపుడు ఎమ్మెల్సీ పదవులు ఉన్నా కూడా ఇస్తే గిస్తే మరో కీలక నేత వంశీకే తప్ప దాడి ఫ్యామిలీకి ఇచ్చేది ఉండదని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. మరో మూడేళ్ల పాటు ఇలాగే దాడి ఫ్యామిలీ గడపాల్సి ఉంటుంది మరి. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా టికెట్ రాకపోతే టీడీపీలోకి తిరిగి జంప్ చేయాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News