నిఘా వ్యవస్థ నిద్రపోయింది..అదే అంటుకుంది

భారత్ నిన్న మొన్నటివరకు కరోనా వైరస్ కట్టడిలో అద్భుతంగా పనిచేస్తుందన్న ప్రశంసలు ప్రపంచం నుంచి అందుకుంది. ఈ ప్రశంసలు ఇంకా మరిచిపోకుండానే ఢిల్లీ మర్కజ్ మతప్రార్ధనలు దేశవ్యాప్తంగా [more]

Update: 2020-04-01 08:00 GMT

భారత్ నిన్న మొన్నటివరకు కరోనా వైరస్ కట్టడిలో అద్భుతంగా పనిచేస్తుందన్న ప్రశంసలు ప్రపంచం నుంచి అందుకుంది. ఈ ప్రశంసలు ఇంకా మరిచిపోకుండానే ఢిల్లీ మర్కజ్ మతప్రార్ధనలు దేశవ్యాప్తంగా సంచలనమే అయ్యింది. తెలంగాణాలో మృతి చెందిన ఆరు కరోనా పాజిటివ్ కేసు బాధితులు అంతా ఢిల్లీ వెళ్ళివచ్చినవారే కావడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి లింక్ లన్ని మర్కజ్ ప్రార్థనలకు హాజరయినవారివైపే వేలెత్తి చూపుతూ ఉండటంతో ఇంతటి ఉపద్రవానికి కారణం ఎవరు తప్పు ఎవరిది అనే చర్చ తీవ్రస్థాయిలో సాగుతుంది. సోషల్ మీడియా అయితే హోరెత్తిపోతుంది. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టిన దాంట్లో సూత్రధారులు ఎవరు ? అంటూ కడిగేస్తున్నారు నెటిజెన్లు.

ప్రపంచం వణుకుతుంటే …

చైనా వుహాన్ లో వైరస్ బయటపడ్డాక నెమ్మది నెమ్మదిగా ప్రపంచాన్ని అల్లుకుంటూ పోయింది. జనవరి చివరి వారం నుంచి అనేక దేశాల్లో క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ ప్రమాద ఘంటికలు ఫిబ్రవరి చివరి నాటికి మరింత తీవ్రం అయ్యాయి. మార్చి రెండోవారం నాటికే సామాజిక దూరం పాటించాలని గుంపులు గా తిరగడం, సభలు సమావేశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు మొదలు పెట్టాయి. ఇలాంటి దశలో తమ సమావేశాలను వాయిదా వేసుకోవాలిసిన నిజాముద్దీన్ లోని మర్కజ్ నిర్వాహకులు ఎలాంటి బెరుకు లేకుండా తమ సమావేశాలను కొనసాగించారు. దీనికి దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలనుంచి మతప్రచారకులు విచ్చేశారు. అదీ కూడా కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి వీరంతా రావడం బాధ్యత లేకుండా ఈ సదస్సు నిరాటకంగా చేపట్టడం విమర్శలకు దారి తీసింది.

నిఘా లేని వ్యవస్థ …

వేలమందితో నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చి 1 నుంచి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించే వరకు నడవడం అదీ కేంద్ర నిఘా వ్యవస్థ కానీ ఢిల్లీ ప్రభుత్వ నిఘా నుంచి కూడా తప్పించుకుని కూడా సాగడం పై విమర్శలు ఆరోపణలు ఆగడం లేదు. కరోనా బాధిత దేశాలనుంచి వచ్చే వారిని క్వారంటైన్ కి తరలించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వ నిఘా వ్యవస్ధ నిద్రావస్థలో ఉండటమే దేశవాసుల్లో ఆగ్రహం కలిగిస్తుంది. కొంత కాలం క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీ వచ్చిన సందర్భంలో అక్కడ భారీ ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్న తరువాత నిఘా వ్యవస్థ తీరు మారుతుందనే అంతా అనుకున్నారు.

అన్నింటా విఫలమే….

కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో పటిష్ట భద్రత దేశ రాజధానిలో ఉంటుందనే భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కొద్ది రోజులకే ఇంటెలిజెన్స్ వైఫల్యం బయటపడింది. పైగా మర్కజ్ జరిగిన ప్రాంతం పక్కనే నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఉండటం ఈ వివాదంలో కొసమెరుపు. ఇలా తిలా పాపం తలా పిడికెడు అన్న రీతిలో అన్ని వ్యవస్థలు మర్కజ్ లోని ప్రార్థనలను అడ్డుకోవడంలో విఫలం అయ్యాయి. ఇలా తిలా పాపం తలాపిడికెడు అన్నచందంగా పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ లోని మర్కజ్ నిర్వాహకులు, అక్కడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం దక్షిణాది రాష్ట్రాల్లో మరణ మృదంగానికి కారణంగా మారింది. ఈ వైఫల్యం ఇప్పుడు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న దేశ వైద్య విభాగానికి శాపం అయ్యింది.

Tags:    

Similar News