విశాఖకూ న్యాయం కావాలి ?

విశాఖవాసుల నినాదం ఇది. విశాఖను అంతా కలసి తీసికట్టుగా చేసి పారేస్తూంటే దశాబ్దాలుగా జరిగిన జరుగుతున్న వివక్ష నుంచి పుట్టుకువచ్చిన ఆవేశం ఇది. విశాఖ నిజానికి 11 [more]

Update: 2020-09-09 15:30 GMT

విశాఖవాసుల నినాదం ఇది. విశాఖను అంతా కలసి తీసికట్టుగా చేసి పారేస్తూంటే దశాబ్దాలుగా జరిగిన జరుగుతున్న వివక్ష నుంచి పుట్టుకువచ్చిన ఆవేశం ఇది. విశాఖ నిజానికి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాల్సింది. ఆ దిశగా ఆనాడు అంటే 1953 నవంబర్లో జరిగిన కర్నూలు శాసనసభలో తీర్మానం కూడా నెగ్గింది. విశాఖను ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా చేయాలంటూ నాడు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన రొక్కం లక్ష్మీనరసింహం దొర పెట్టిన ప్రైవేట్ తీర్మానానికి సభ రెండు ఓట్ల మెజారిటీతో ఆమోదముద్ర వేసింది. నాడు సీఎం ప్రకాశం పంతులు కూడా విశాఖ రాజధానికి సుముఖం అని తరువాత చర్యలు నిరూపించాయి. 1954 మే నెలలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభా సమావేశాలు ప్రకాశం ఆధ్వర్యాన నెలరోజుల పాటు ఆంధ్రా యూనివర్శిటీలో జరిగాయి.

అలా దెబ్బే ….

అయితే అప్పట్లో విశాలాంధ్ర నినాదం కూడా మరో వైపు గట్టిగా ఉంది. నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఉమ్మడి ఏపీగా చేయాలని జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయంగానూ గట్టి ప్రయత్నాలు జరిగాయి. అవి ఫలించకపోతే మాత్రం విశాఖే మన రాజధాని అని నాటి ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధులు గట్టిగా డిసైడ్ అయిపోయారు. నాడు కర్నూలు కంటే కూడా విశాఖ ఎంతో అభివృధ్ధి చెందిందని, రాజధానిగా బాగుటుందని సీమ, కోస్తా సహా అంతా అంగీకరించిన విషయం ఈ సందర్భంగా పస్థావనార్హం. అయితే ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఏర్పాటు కావడంతో హైదరాబాద్ వంటి రాజధాని దొరకడంతో కష్టాలు తీరాయని అంతా అనుకున్నారు. అలా విశాఖకు తొలిసారి రాజధాని హోదా తప్పిన సంగతి చరిత్ర చెబుతోంది.

కోరినా కూడా….

ఇక ఉమ్మడి ఏపీ మళ్ళీ రెండు ముక్కలు అయింది. అంటే 1953 నాటి ఆంధ్రప్రదేశ్ అలాగే విడిపోయిందన్నమాట. నిజానికి అరవయ్యేళ తరువాత విశాఖ హైదరాబాద్ తో దీటుగా నిలిచిన మెగా సిటీ అయింది. విభజనవాదులు కూడా మీకు విశాఖ రాజధానిగా బాగుంటుందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరో వైపు విశాఖను రాజధాని చేయాలని నాడు ఉద్యమాలు జరిగాయి. సంతకాల సేకరణ కూడా చేశారు. కానీ నాటి టీడీపీ సర్కార్ వీటిని పక్కన పెట్టి అమరావతిని రాజధానిగా ప్రకటించింది. విశాఖను ఆర్ధిక రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అయిదేళ్ళలో విశాఖలో కొత్తగా వచ్చిందేదీ లేకపోగా మరింతగా వెనకబడిపోయింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి విజయవాడ‌ మెట్రో రైల్ ని ముందుకు తెచ్చారు. కేంద్రం ప్రకటించిన అనేక ప్రాజెక్టులు కూడా విశాఖను దాటి వెళ్ళిపోయాయి. అలాగే విశాఖలో రైల్వేజోన్ రానీయకుండా అడ్డుకున్నారు. చివరకు బీజేపీ సర్కార్ వాల్తేర్ డివిజన్ని ముక్కలు చేసి జోన్ ఇచ్చామనిపించింది. ఇక విశాఖ ప్రగతి కోసం చంద్రబాబు తీసుకున్న చర్యలు లేవన్నది విదితమే.

న్యాయ పోరాటమా…?

విశాఖను పాలనారాజధానిగా చేయాలని జగన్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ మేరకు చట్టం కూడా చేసింది. అయితే విశాఖ రాజధానికి పనికిరాదంటూ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలు స్థానికులకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. అంతే కాదు, విశాఖలో ఏ అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ రెబెల్ ఎంపీ రామక్రిష్ణంరాజు లాంటి వారు కేంద్ర మంత్రులను కలసి ఫిర్యాదు చేయడం పైనా జనం మండిపోతున్నారు. విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ కడతామని ప్రభుత్వం ప్రకటిస్తే దాని మీద కూడా కోర్టుకు వెళ్తున్న ఉత్తరాంధ్ర వ్యతిరేకులకు తాము కూడా అదే కోర్టు మెట్లు ఎక్కి గుణపాఠం చెబుతామని ప్రజాసంఘాలు అంటున్నాయి. విశాఖ అభివృద్ధి కోసం న్యాయ పోరాటానికి తామూ సిధ్ధమని ప్రకటిస్తున్నారు. మూడు రాజధానులు ఏపీకి ఉండాలని తాము కోరుకుంటే అమరావతి ఏకైక రాజధాని అంటూ విఫలమైన హైదరాబాద్ మోడల్ ని తెర మీదకు తెస్తున్న వారి మీద సగటు జనం మండిపోతున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా విశాఖ బాధలను తాము కూడా కోర్టుకు చెప్పుకుంటామని ప్రజా సంఘాల నేతలు, మేధావులు అంటున్నారు. మొత్తానికి విశాఖవాసులకు రాజధాని అవసరం లేదని చెబుతున్న వారికి దిమ్మతిరిగేలా ప్రతి చర్యకు ఈ ప్రాంతీయులు దిగుతామనడం కీలక పరిణామమే.

Tags:    

Similar News