మళ్లీ సంక్షోభం తప్పేట్లు లేదే?

యడ్యూరప్ప సర్కార్ కు మళ్లీ సంక్షోభం తప్పదా? యడ్యూరప్ప వ్యవహారశైలి కొందరు ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. ప్రధానంగా యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పాలనలో జోక్యంపై ఎమ్మెల్యేలు అభ్యంతరం [more]

Update: 2020-03-16 18:29 GMT

యడ్యూరప్ప సర్కార్ కు మళ్లీ సంక్షోభం తప్పదా? యడ్యూరప్ప వ్యవహారశైలి కొందరు ఎమ్మెల్యేలకు నచ్చడం లేదు. ప్రధానంగా యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పాలనలో జోక్యంపై ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఆరు నెలలు అయింది. ఉప ఎన్నికల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇప్పించుకుని గెలిపించుకుని తన ప్రభుత్వాన్ని సుస్థిర పర్చుకున్నారు.

సుస్థిరంగా ఉందంటుకుంటున్న…..

అయితే ప్రభుత్వం సుస్థిరంగా అయిన తర్వాత యడ్యూరప్ప వైఖరి మారిందంటున్నారు. యడ్యూరప్ప ఉప ఎన్నికలు అయిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఒకసారి చేశారు. అనర్హత వేటు పడి తిరిగి గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే మంత్రిపదవులు అధిక సంఖ్యలో దక్కాయి. ఈ విషయాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రధానంగా యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ను ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు.

ఇరవై మంది వరకూ……

దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని యడ్యూరప్ప ముందే బాహాటంగా చెబుతున్నారు. ప్రధానంగా కోస్తా కర్ణాటక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గాలకు చెందిన నిధుల విడుదలలోనూ సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నేతలకు ఎక్కువగా ఇస్తున్నారన్నారు. ఇందుకు సిద్ధరామయ్య నియోజకవర్గానికి 600 కోట్లు విడుదల చేసినందుకు వారు అభ్యంతరం తెలుపుతున్నారు.

చాపకింద నీరులా…..

బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తి ఒకరకంగా చాప కింద నీరులా ప్రవహిస్తుందంటున్నారు. యడ్యూరప్ప ను ముఖ్యమంత్రిగా మార్చాలన్న వత్తిడి కూడా త్వరలోనే ప్రారంభమవుతుందంటున్నారు. ప్రధానంగా రాఘవేంద్రను పాలనకు దూరంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యడ్యూరప్ప కూడా ఇదే చివరి అవకాశం అని భావించి మూడేళ్లు సజావుగా పాలన సాగించాలనుకుంటున్నారని, అందుకే సొంత పార్టీ నేతలకన్నా ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద యడ్యూరప్పకు ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు ఏదీ లేకున్నా ప్రమాదం మాత్రం పొంచి ఉందనే చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News