గంట..గంటకూ…టెన్షన్..!!

పతనం తప్పేట్లు లేదు…. భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్ కల చెదిరిపోయేటట్లే కనపడుతోంది. కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ కు దినదినగండమే అని చెప్పక [more]

Update: 2019-01-16 16:30 GMT

పతనం తప్పేట్లు లేదు…. భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్ కల చెదిరిపోయేటట్లే కనపడుతోంది. కర్ణాటక లో సంకీర్ణ సర్కార్ కు దినదినగండమే అని చెప్పక తప్పదు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమేనని చెప్పాలి. కాంగ్రెస్ సభ్యులు కూడా తమతో టచ్ లో ఉన్నారని చెబుతూ బీజేపీ నేతలు సిద్ధరామయ్య, కుమారస్వామిలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.

ఢిల్లీలో ఉండే….

ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప అక్కడి నుంచే పావులు కదుపుతున్నారు. హర్యానాలో ఒక రిసార్ట్ లో బీజేపీ తన శాసనసభ్యులతో క్యాంపు నిర్వహిస్తోంది. మొత్తం 104 మంది బీజేపీ శాసనసభ్యులు ఈ క్యాంప్ కు హాజరయినట్లు బీజేపీ వర్గాల వెల్లడించాయి. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికలకు ముందే సంకీర్ణ సర్కార్ ను గద్దె దించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గత వారం రోజులుగా మంతనాలు కొనసాగిస్తోంది.

అప్రమత్తమైన కాంగ్రెస్…..

కాంగ్రెస్ మాత్రం ఇవన్నీ బీజేపీ తాటాకు చప్పుళ్లేనని తొలుత భావించింది. అధికారంలో ఉన్న పార్టీని ఎవరూ వీడిపోరని విశ్వాసంలో ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థులు సంకీర్ణ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన ప్రారంభమయింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి పరమేశ్వరలు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు.

ఏం జరుగుతుందో చెప్పలేం….

మరికొద్ది గంటల్లోనే సంకీర్ణ సర్కార్ కు మూడిందన్న సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్ నాగేశ్ లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ గవర్నర్ కు లేఖ రాయడం తొలి విజయంగా యడ్యూరప్ప భావిస్తున్నారు. తమకు మద్దతిచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా యడ్యూరప్ప కలిసి అభినందనలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసే బాధ్యతను కొందరు మంత్రులకు అప్పగించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News