లాలూచీ లేకుంటేనే... లాల్ సలాం

Update: 2018-04-18 15:30 GMT

గందరగోళం నుంచి కాసింత స్పష్టత కావాలి. అప్పుడే కామ్రేడ్లు చెప్పే సిద్ధాంతానికి విలువ వస్తుంది. దేశవ్యాప్తంగా వామపక్షభావజాలం బలహీనపడుతున్న పరిస్థితుల్లో హైదరాబాదులో ఈనెల 18 నుంచి 22 వరకూ సాగుతున్న అఖిలభారత మహాసభలు సీపీఎం కు ఏరకమైన దిశానిర్దేశం చేస్తాయన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రతిమూడేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ పార్టీ కాంగ్రెసు అత్యున్నత విధాననిర్ణాయక సమావేశం. మూడేళ్లకాలానికి పార్టీ దశ దిశ ఏమిటో తేల్చి చెబుతుంది. దేశ రాజకీయాలకే కాదు, సీపీఎంకు కూడా ఇది కీలక సమయం సైద్దాంతిక, భావజాల,వర్గ వైరుద్ధ్యాలతో పార్టీ ప్రాభవం క్రమేపీ క్షీణిస్తోంది. కొత్త తరాలను ఆకర్షించలేకపోతోంది. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న త్రిపుర వంటి రాష్ట్రంలోనూ ఓటమి తర్వాత విధానాలను పునస్పమీక్షించుకోవాల్సిన తరుణం. పార్టీ అనుసరించదలచిన రాజకీయ పంథా , 2019 ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, సామాజిక ఉద్యమాలపై కార్యాచరణ ఖరారు కాబోతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెసు, బీజేపీలకు దూరంగా ఉండాలనే విషయంలో స్పష్టత కనబరుస్తున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుసరించే పంథా విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది. మూడోఫ్రంట్ ప్రయోగాలతో విసిగిపోయామని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు అవకాశాలను అన్వేషిస్తూ ఉండటం ద్వంద్వ వైఖరికి దర్పణం పడుతోంది. అధికారం చేజిక్కించుకునే పార్టీలతో అడ్డగోలు ఒప్పందాలకు అడ్డదారి వెదుకుతున్నారనే అనుమానాలను రేకెత్తిస్తోంది. సీపీఎం అఖిలభారత సభలు దీనిపై ఒక నిర్దిష్ట విధానం ప్రకటించకపోతే క్యాడర్ స్థైర్యం కూడా దిగజారిపోయే ప్రమాదం ఉంది.

బూడిదలో పోసిన పన్నీరు...

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాజన పాదయాత్రను నిర్వహించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. టీమాస్, బీఎల్ఎఫ్ వంటి ప్రయోగాలతో దళిత, బహుజన సమాజాన్ని అధికార పక్షానికి వ్యతిరేకంగా సంఘటిత పరచాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయాధికారం బహుజన సమాజానిదే అంటూ నినాదం కూడా ఎత్తుకున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేంత శక్తి సామర్ధ్యాలు సీపీఎం నేత్రుత్వంలోని బీఎల్ఎఫ్ కు లేవు. ఒకవేళ నిజంగా అధికార పార్టీని ఓడించాలంటే కాంగ్రెసు నాయకత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడితే తప్ప బలమైన పోటీ ఇవ్వలేరనేది రాజకీయ వర్గాల అంచనా. సీపీఎం నేతృత్వంలోని బీఎల్ఎఫ్ తో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక మినహా ఒరిగేదేమీ ఉండదంటున్నారు. కాంగ్రెసు పార్టీ మాత్రం తమతో చేతులు కలపమని అన్ని పార్టీలనూ ఆహ్వానిస్తోంది. సీపీఐ కూడా వారితో కలిసి నడిచేందుకు సిద్దమవుతోంది. సీపీఎం మాత్రం ఒంటెత్తు పోకడతో విపక్షాల ఐక్యతకు గండి కొడుతోందని విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల సీపీఎం నాయకులను కలిసిన కేసీఆర్ వామపక్షాలు బలంగా ఉండాలని ఆకాంక్షించడంలోనే అసలు కిటుకు దాగి ఉంది. సీపీఎం ఎంతగా బలపడితే అంతగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే భావన ఆయనలో ఉంది. దీనిని గ్రహించని వామపక్ష నాయకులు తాజాగా చేస్తున్న ప్రకటనలు కొత్త సందేహాలకు దారి తీస్తున్నాయి. కేసీఆర్ పట్ల తమకేమీ వ్యతిరేక భావనలు లేవంటూ భవిష్యత్తులో కలిసిపనిచేసే అవకాశాలున్నాయనే సంకేతాలిచ్చేశారు. దీంతో మహాజన పాదయాత్ర, బహుజన ఫ్రంట్ నిర్మాణం వంటివన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందమయ్యాయి.

జనసేనకు జై కొట్టడమేనా...

ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో కలిసి నడవక తప్పదనే అంచనాకు సీపీఎం వచ్చేసింది. తమను ఉపయోగించుకుని ఇతర పార్టీలు లబ్ధి పొందుతున్నాయి. తమకేమీ ఉపయోగముండటం లేదనే ఉద్దేశంతోనే ధర్డ్ ఫ్రంట్ ప్రయోగాలకు స్వస్తి చెప్పిన సీపీఎం తాజా వైఖరి చర్చనీయమవుతోంది. ముందుగా నిర్ణయించుకున్న పంథాకు ఇది భిన్నమైనదనే ఆరోపణలు వినవస్తున్నాయి. తెలంగాణలో అధికారపార్టీపై వ్యతిరేక భావం వ్యక్తం చేయని పార్టీ, ఏపీలో కొత్త పార్టీతో జట్టుకడుతోంది. ఈరెండు నిర్ణయాల ద్వారా ఎవరో ఒకరితో జట్టుకట్టడమే తమ లక్ష్యమన్నట్లుగా సీపీఎం వ్యవహారశైలి మారిందంటున్నారు. జనసేనకు జై కొట్టే విషయంలో కొంత సంయమనం పాటించి ఉంటే పార్టీని తటస్థ శక్తిగా చూసి ఉండేవారు. ఇది పార్టీ క్రెడిబిలిటీ పెంచుతుంది. కానీ సీట్ల యావలో సీపీఐతో పోటాపోటీగా జనసేన పొత్తుకు సై అంటోంది. దీంతో గతంలోని పొరపాట్లే మళ్లీ పునరావృతం చేస్తున్నట్లు స్పష్టమైపోతోంది.

అవసరం చాలా ఉంది...

నిజానికి వామపక్షాల అవసరం దేశానికి చాలా ఉంది. అడ్డగోలు సంస్కరణలతో దేశాన్ని అడ్డదిడ్డంగా పరుగులు తీయిస్తున్న ప్రభుత్వాలు ఎప్పుడో ఒకప్పుడు బోర్లాపడతాయి అటువంటి స్థితి ఏర్పడకుండా చెక్ పాయింటుగా సీపీఎం, సీపీఐలు కీలక భూమిక పోషిస్తుంటాయి. కానీ తమ బలం క్షీణించడంతో ప్రజాస్వామికంగా చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలువరించగల సామర్ధ్యాన్ని వామపక్షాలు కోల్పోయాయి. ధనిక, పేద అంతరం బాగా పెరిగింది. బ్యాంకులు ఇతర సర్కారీ సంస్థలను అధికారికంగానే దోచేస్తున్నారు పెట్టుబడిదారులు, ప్రయివేటుపారిశ్రామిక వేత్తలు. నిలదీసే స్వరమే నిండైన సమాధానం. ఒకవైపు ఆధునికత పరుగులు తీస్తుంటే.. మతతత్వ భావనలు, చాందసత్వం పెచ్చరిల్లుతున్నాయి. అటువంటి అంశాలపై అలుపెరుగని పోరాటం చేసే శక్తులు వామపక్షాలు మాత్రమే. ఓట్ల రూపంలో ఆదరణ లభించకపోయినా శ్రామిక బడుగు బలహీన వర్గాల పేరు చెబితే కమ్యూనిస్టులే గుర్తుకొస్తారు. కొందరు వ్యక్తులు స్వార్థ ప్రయోజనాలకు పార్టీని అక్కడక్కడా తప్పుదారి పట్టించిన ఉదంతాలున్నాయి. వారిపై చర్యలు తీసుకున్న దృష్టాంతాలూ ఉన్నాయి. అదే కమ్యూనిస్టుల ప్రత్యేకత. దీనిని నిలబెట్టుకుంటూ ఆచరణాత్మక ప్రత్యామ్నాయ విధానాలను ప్రతిపాదించగలిగితే జాతీయ సమావేశాలు సార్థకమవుతాయి. లేకపోతే మూడేళ్లముచ్చటగానే మిగిలిపోతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News