వారే కోవర్టులుగా మారారా…?

రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వం మాత్రం శాశ్వతం. అక్కడ జరిగే కార్యక్రమాలు శాశ్వతం. ఎందుకంటే ప్రజలకు ఎక్కడా కొరతా [more]

Update: 2019-08-30 06:30 GMT

రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వం మాత్రం శాశ్వతం. అక్కడ జరిగే కార్యక్రమాలు శాశ్వతం. ఎందుకంటే ప్రజలకు ఎక్కడా కొరతా లేకుండా జరగాలంటే ప్రభుత్వాలు నిరంతరంగా పనిచేయాలి. మరి ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వాల పాటు నిరంతరంగా సాగే వాళ్ళు కూడా ఉంటారు. వారే ప్రభుత్వ ఉద్యోగులు. వారు ఏ ప్రభుత్వం మారినా తమ ఉద్యోగాలు మాత్రం చేసుకుంటూ పోతారు. అయితే ఉద్యోగులు కూడా మనుషులే. వారికి రాగద్వేహాలు ఉంటాయి. ఒక పార్టీ పట్ల మమకారం, మరో పార్టీ పట్ల వెటకారం ఉండడం ఖాయం. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మేము వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని బయటకు చెప్పినా కొన్ని కీలకమైన శాఖల్లో ఉన్న వారు తలచుకుంటే సర్కార్ కి చెడ్డ పేరు ఇట్టే తేగలరు.

పసుపు పార్టీ ఫ్యాన్స్ ఉన్నారా..?

ఎందుకంటే వారే ప్రభుత్వాన్ని నడపాలి కాబట్టి. వారే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు కాబట్టి. ఇక వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది. ఈ తక్కువ టైంలో చాలా మంచి పనులే చేసింది. అంతే కాదు హామీల అమలుకు కూడా సిధ్ధపడుతోంది. వరసగా అన్నింటికీ డేట్లు పెట్టుకుంటూ కచ్చితమైన పద్ధతిలో ముందుకు సాగుతోంది. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి జనాలకు చేరడంలేదు. పది పనుల్లో ఎక్కడో ఒక చోట తప్పు కనిపిస్తే అది బాగా వెళ్తోంది. ఆ విధంగా జగన్ సర్కార్ కి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యంగా ఇసుక వ్యవహారం జగన్ సర్కార్ పరువు పూర్తిగా తీసేసింది. ఇసుక విషయంలో వైసీపీ సర్కార్ పాత పధ్ధతిలో యధావిధిగా ఇసుక అందించండి అని ప్రభుత్వం చెబుతూంటే ప్రభుత్వ అధికారులు కొందరు మాత్రం వైసీపీ సర్కార్ కి చెడ్డపేరు తెచ్చేలా ఇసుక రీచులను మూసేసి ఇక సిండికేట్ గా ఏర్పడి ప్రజలకు ఇసుక అందించండంలో ప్రభుత్వం విఫలం అయినట్లుగా చూపించడంలో సక్సెస్ అయ్యారని ప్రచారంలో ఉంది. దీని మీద ఇటీవల సమీక్ష జరిపిన సీఎం జగన్ ఏకంగా హాట్ కామెంట్స్ చేశారు. కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎవరైనా తీసుకువస్తే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కోతల రాయుళ్ళు ఎవరో…?

ఇక గ్రామాల్లో కరెంట్ కోతలు కూడా కావాలని చేసినవిగా చెబుతున్నారు. కోతలు పెడితే జనాల్లో వ్యతిరేకత వస్తుందని ఈ ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సూత్రధారిగా మొన్నటి వరకూ జెన్ కోలో ఉంటూ కోట్లు సంపాదించిన ఘనుడొకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడుగా వైసీపీ సర్కార్ అనుమానిస్తోందట. పక్కా ప్లాన్ ప్రకారం తన మనుషులతో ఇలాంటి కోతల కార్యక్రమం నిర్వహిచడం వల్ల ప్రజల్లో అసహనం ఏర్పడి కొత్త సర్కార్ మీద వెంటనే కొంత వ్యతిరేకత రావడానికి కారణమైంది. ఇపుడు దాన్ని గుర్తించి వైసీపీ సర్కార్ సర్దుబాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గోలగా మారిన అన్యమత ప్రచారం …

వీటితో పాటు అతి ముఖ్యమైనది హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం. తిరుమల టికెట్ మీద జెరూసలెం యాత్ర గురించి ముద్రించినవి పంచడం జరిగింది. సరిగ్గా జగన్ జెరూసలెం టూర్ నుంచి వచ్చిన తరువాతనే ఇలా జరగ‌డం అంటే అంత నమ్మదగిన విధంగా ప్లాన్ చేశారని కూడా అర్ధమవుతోందంటున్నారు. ఈ టికెట్ల ముద్రణ టీడీపీ సర్కార్ హయాంలో జరిగింది. ఇక చూసుకుంటే ఇప్పటికీ ఆర్టీసీ చైర్మన్ గా వర్ల రామయ్య కొనసాగడం బట్టి చూసినా వైసీపీ సర్కార్ మీద బురద జల్లడంలో రాజకీయ పాత్ర ఏదో ఉందని వైసీపీ సర్కార్ పెద్దలు అనుమానిస్తున్నారు. చిత్రమేంటంటే ఇప్పటికీ ఆ టికెట్ల ముద్రణ కాంట్రాక్టును రద్దు చేయకపోవడం. మరి ప్రభుత్వం మారినా మూడు నెలలుగా టీడీపీ నేత వర్ల రామయ్య కొనసాగడం ఒక వింత అయితే ఆయన నైతిక విలువల గురించి ప్రతీ రోజూ చెబుతూండడం మరీ విడ్డూరం. ఏది ఏమైనా కొత్తగా ఏపీలో ఏర్పడిన వైసీపీ సర్కార్ ని తన అనుభవంతో టీడీపీ గింగిరాలు తిప్పి మూడు చెరువుల నీరు తాగిస్తోంది. ఎంత రాజకీయం అనుకున్నా తిప్పికొట్టలేని స్థితిలో వైసీపీ ఉండడమే జనంలో వ్యతిరేకత పెరగడానికి మరో కారణం.

Tags:    

Similar News