స్టే తాత్కాలిక ఉపశమనమేనా? అంతా రెడీ అయిందా?

రాజధానుల అంశానికి స్టేటస్ కో ఇస్తూ న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. ప్రభుత్వ వాదనను వినిపించేందుకు , అదే సమయంలో గవర్నర్ ఆమోదించిన చట్టాల రాజ్యాంగ బద్ధతను [more]

Update: 2020-08-05 15:30 GMT

రాజధానుల అంశానికి స్టేటస్ కో ఇస్తూ న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. ప్రభుత్వ వాదనను వినిపించేందుకు , అదే సమయంలో గవర్నర్ ఆమోదించిన చట్టాల రాజ్యాంగ బద్ధతను సమీక్షించేందుకు న్యాయ సందర్భం వచ్చింది. ఇది దీర్ఘకాలం పట్టే ప్రక్రియగానే చెప్పుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వం తనవంతు ఏర్పాట్లకు సిద్ధం అవుతోంది. ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని పెద్దగా ఆశలు లేవు. కొంత జాప్యం చోటు చేసుకోవచ్చునేమో కానీ ముందుకే వెళ్లేందుకు ముహూర్తాలు సైతం పెట్టుకుంటోంది. ఈ తతంగం కంటే ప్రధానంగా ఆసక్తి వ్యక్తమవుతున్న అంశం రాజధానుల చుట్టూ అలుముకున్న రాజకీయం. 48 గంటలలో శాసనసభను రద్దు చేయాలని చంద్రబాబు డెడ్ లైన్ విధించారు. ఆ తర్వాత ఏం చేయబోతున్నారో ఆయన స్పష్టతనివ్వలేదు. అసెంబ్లీ రద్దు, శాసనసభ్యుల రాజీనామా డిమాండ్ పై అధికారపార్టీ ఇప్పటికే విరుచుకుపడింది. ప్రతి సవాల్ విసిరింది. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ రెండు పార్టీలూ రాజకీయమే చేస్తున్న నేపథ్యంలో అసలు సమస్య తెరమరుగున పడిపోతుందని తటస్థులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానులకు చట్టబద్ధత కల్పించిన తర్వాత వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది.

డిఫెన్స్ లో టీడీపీ…

చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్ వికటించి ఆ పార్టీ మెడకే చుట్టుకుంటుందేమోనని పార్టీ వర్గాలు భయపడుతున్నాయి. ప్రజాతీర్పు కోరదామంటూ వైసీపీకి చంద్రబాబు సవాల్ విసిరారు. నిజంగా ప్రజల్లో సెంటిమెంటు ఉంటే దానిని నిరూపించి చూపాలంటూ వైసీపీ నాయకులు ప్రతిసవాల్ విసురుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రసమితి చిన్న పార్టీగా ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసం రాజీనామాల అస్త్రాన్ని పలు సందర్భాల్లో ప్రయోగించింది. అధికారపార్టీని, ఇతర రాజకీయ పక్షాలను అదుపు చేసేందుకు, ప్రజల్లో భావోద్వేగాన్ని నిలిపి ఉంచేందుకు రాజీనామాల సెంటిమెంటును చక్కగా ఉపయోగించుకునేది. రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఏక రాజధానిపై సెంటిమెంటు ఉంటే తెలుగుదేశం దానిని నిరూపించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ తరహాలోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రివర్స్ చాలెంజ్ విసురుతున్నారు. టీడీపీ తమ స్థానాల్లో తిరిగి గెలిచి వస్తే మాత్రమే టీడీపీ వాదనకు మద్దతు లభిస్తుందని వైసీపీ చెబుతోంది.

కేసీఆర్ తరహాలో…..

ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంతంగా రాజీనామా చేయడమంటే ఆత్మహత్యాసదృశమని తెలుగుదేశానికి తెలుసు. ప్రజాతీర్పులో అధికార వైసీపీ ముందు నిలవలేకపోతే టీడీపీ మరింతగా బలహీన పడుతుంది. అందులోనూ చంద్రబాబు నాయుడు కేసీఆర్ తరహాలో రిస్క్ తీసుకునే రాజకీయ వేత్త కాదు. మొత్తమ్మీద ముందు నుయ్యి వెనక గొయ్యిగా కనిపిస్తోంది టీడీపీ పరిస్థితి. ప్రజల నుంచి ఉద్యమం, స్పందన రాకుండా కేవలం రాజకీయ డిమాండ్ కే రాజధాని పరిమితమైతే ప్రయోజనం పెద్దగా ఉండదు. ప్రస్తుతం వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి స్వతహాగా కదలిక లేకపోవడంతోనే రాజకీయ పార్టీలు చల్లబడిపోతున్నాయి.

సమీక్షకు చిక్కకుండా…

న్యాయ సమీక్ష ద్వారా ఈ చట్టాల నిగ్గు తేలుతుందనే ఆశాభావాన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతోనే వ్యవహరించబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందనే బలమైన వాదననే నేతలు వినిపిస్తున్నారు. సాంకేతికంగా ఇదే విషయాన్ని హైకోర్టులోనూ ప్రభుత్వం చెప్పబోతోంది. పరిపాలన వికేంద్రీకరణ కు మరో రెండు కేంద్రాలు విధానపరమైన నిర్ణయంగా చెప్పాలనుకుంటోంది ప్రభుత్వం. రాజ్యాంగ విరుద్దమైతే తప్ప ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు. రైతులతో కుదిరిన ఒప్పందంలో సైతం రాజధాని అనేది ఒక ఒడంబడిక. తాము ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ అమలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇస్తుంది. అందువల్ల ఈ వాదనతో విభేదించడం అంత సులభం కాదు. కానీ వాస్తవిక కార్యాచరణలో సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్ భవన్ విశాఖ కు తరలిపోతే అదే రాజధాని అవుతుంది. అమరావతి లాంఛనప్రాయమైన అవశేషంగా మిగిలిపోతుంది.

పోరు చంద్రబాబు తోనే…

నిజానికి అమరావతి రైతులతో వైసీపీ సర్కార్ కు ఎటువంటి పేచీ లేదు. చంద్రబాబు నాయుడు తో వైసీపీ కి నెలకొన్న తీవ్ర విభేదాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పాలి. ముఖ్యంగా రాజధాని తరలింపు అంశం తెరపైకి వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతులు సైతం ప్రభుత్వంతో సంప్రతింపులకు మొగ్గు చూపలేదు. టీడీపీని, ప్రతిపక్షాలను విశ్వసించడం వల్ల వైసీపీ బిగుసుకుపోయింది. ఇప్పటికీ సైబరాబాద్ పేరు చెబితే చాలు క్రెడిట్ తన కాతాలో వేసుకుంటుంటారు చంద్రబాబు. అమరావతి విషయంలోనూ అదే జరుగుతుందని వైసీపీ భావన. దాంతో చంద్రబాబు నాయుడితో నెలకొన్న రాజకీయ పోరు అమరావతికి మంగళం పాడేందుకు దోహదం చేసిందనేది పరిశీలకుల అంచనా. ఏదేమైనప్పటికీ గతంలో ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలు అధికార,ప్రతిపక్షాల మధ్య రాజీలేని ధోరణికి దారి తీశాయి.

దీర్ఘకాలిక ఆలోచన……

కేంద్రంతో, బీజేపీతో సత్సంబంధాలనూ చంద్రబాబు నాయుడు చెడగొట్టుకున్నారు. అమరావతి శంకుస్థాపన సమయంలో రాష్ట్ర విభజనకు కారణమైన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ను పిలిచారు. కేసీఆర్ ను చంద్రబాబు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. కానీ తనతో సమ ఉజ్జీగా ప్రజాక్షేత్రంలో పోటీపడి ఓట్లు, సీట్ల విషయంలో దీటుగా నిలిచిన రాష్ట్ర ప్రతిపక్ష నేతను శంకుస్థాపన వేదికపై పక్కనే కూర్చోబెట్టుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీకే అధికారం శాశ్వతంగా ఉంటుందనే భావనతో దీర్ఘకాలిక ఆలోచన చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అమరావతి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని అందరిలోనూ కలిగించలేకపోయారు. అందుకే తొలి నుంచి వైసీపీ అమరావతిపై గుర్రుగానే ఉంది. ఇదంతా చంద్రబాబు నాయుడి స్వయంకృతాపరాధం. ఫలితంగా ప్రస్తుతం టీడీపీ నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటోంది. అటు కేంద్రాన్ని సంప్రతించే దారులు మూసుకుపోయాయి. ఇటు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయించే సత్తా కూడా సన్నగిల్లింది. దీంతో వైసీపీకి రాజకీయంగా ఎదురులేని వాతావరణం నెలకొంది. తాజాగా రాజీనామాల సవాల్ విషయంలోనూ టీడీపీ ప్రతికూలతనే ఎదుర్కొంటోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News