ఫ్రాన్స్ పట్టుకుంటుందా..?

భారత వైమానిక రక్షణలో కీలకంగా మారిన రఫేల్ యుద్ద విమానాల కొనుగోలులో అవినీతిపై మరోసారి తేనెతుట్ట కదులుతోంది. రాజకీయ డిమాండ్లు మిన్ను ముడుతున్నాయి. ఈ విమానాల సాంకేతిక [more]

Update: 2021-07-04 16:30 GMT

భారత వైమానిక రక్షణలో కీలకంగా మారిన రఫేల్ యుద్ద విమానాల కొనుగోలులో అవినీతిపై మరోసారి తేనెతుట్ట కదులుతోంది. రాజకీయ డిమాండ్లు మిన్ను ముడుతున్నాయి. ఈ విమానాల సాంకేతిక సామర్ధ్యం, రక్షణ పటుత్వం పై ఎటువంటి అనుమానాలు, సందేహాలు లేకపోయినప్పటికీ ముడుపులు ముట్టాయనే అంశమే రగడకు కారణమవుతోంది. మొదట్నుంచీ ఈ ఆరోపణలున్నాయి. కానీ ఈమధ్యనే ఫ్రాన్స్ ప్రభుత్వం సైతం ఈ విషయంపై దృష్టి పెట్డడంతో మళ్లీ గొడవ మొదలైంది. అక్కడ న్యాయ విచారణకు ఆదేశించారు. పర్యవసానంగా భారత రాజకీయ నాయకత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెసు పార్టీ సంయుక్త పార్లమెంటరీ బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఫ్రాన్స్ లోని అవినీతి నిరోధక శాఖ విమానాల సరఫరా దారు దసాల్ట్ ఏవియేషన్ కు సంబంధించి ఆడిట్ చేస్తున్న సందర్భంగా తీగ దొరికింది. బారత్ లో దళారీ కంపెనీకి భారీ నజరానా ముట్టినట్లు అంచనాకు వచ్చింది. డెఫ్ సిస్ అనే కంపెనీకి భారత్ లో నమూనాల తయారీకి 11 లక్షల యూరోలు చెల్లించినట్లు తేలింది. నమూనాలు లేవు. దానికి సంబంధించిన ఆధారాలు సైతం లేవు. దీంతో ఇది కేవలం ముడుపు చెల్లించడానికి ఎంచుకున్న రహస్య మార్గంగా ఫ్రాన్స్ ఒక నిర్ధారణకు వచ్చింది. దీనిపైనే తాజా దర్యాప్తు మొదలైంది. మన దేశంలో ఎంత పెద్ద అవినీతి చోటు చేసుకున్నా, దున్నపోతుపై వాన మాదిరే. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇతర దేశం దర్యాప్తు ప్రారంభించడమంటే సీరియస్ అంశమే. ఇది దేశ ప్రతిష్ట కే కాకుండా నాయకత్వానికే మచ్చ తెచ్చే అవకాశం కూడా ఉంటుంది.

హుష్ … కాకి…

మనదేశంలో కుంభకోణాలపై విచారణ అంటే పెద్ద ఫార్సు. ఎంత పెద్ద స్కాం చోటు చేసుకున్నా ఏలిన వారి ఆలోచనలకు అనుగుణంగా విచారణలు సాగుతుంటాయి. ఏళ్లు పూళ్లూ పడుతుంటాయి. ప్రజల దృష్టిలో పాతబడ్డాక విచారణలు మూతపడిపోతుంటాయి. ఎవరికీ శిక్ష పడదు. అసలు కుంభకోణంలో నిజానిజాల నిగ్గూ తేలదు. ఇది భారత వ్యవస్థలోని ప్రధాన లోపం. రఫేల్ యుద్ద విమానాల కొనుగోలుపై చాలా కాలంగా రచ్చ సాగుతోంది. 2019 ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలు దీనిని ఎన్నికల అంశంగా మార్చాలని చూశాయి. న్యాయస్థానాల్లోనూ కేసులు వేశాయి. కానీ కోర్టుల వద్ద ఆధారాలు సమర్పించలేకపోవడం, పైపెచ్చు ప్రభుత్వం ఇది రక్షణకు సంబంధించిన వ్యవహారంగా , కాగ్ సైతం క్లీన్ చిట్ ఇచ్చినట్లు అఫిడవిట్ ఇవ్వడంతో కేసులు వీగిపోయాయి. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అంతా సాఫీగా ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. రఫేల్ యుద్ద విమానాల కొనుగోలులో అక్రమాలు , అవినీతి పై నిగ్గు తేల్చేందుకు న్యాయ విచారణకు ఆదేశించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఇదొక అసాధారణ పరిస్థితి. భారత ప్రభుత్వంతో ముడిపడిన ఒప్పందంపై ప్రాన్స్ ఈ చర్య తీసుకుందంటే ఆరోపణల్లో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్లేననేది దౌత్య వర్గాల అంచనా. ఈ క్లిష్ట సమస్య నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందనేది పక్కన పెడితే ప్రతిపక్షాల రాజకీయ దాడిని తట్టుకోవడమే కష్టం.

రఫేల్ రహస్యాలు…

నిజానికి రఫేల్ యుద్ద విమానాల డీల్ యూపీఏ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పైగా పూర్తయింది. ప్రాన్స్ కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ, దేశీయభాగస్వామిగా భారత ప్రభుత్వ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కలిసి ఈ విమానాలు తయారు కావాల్సి ఉంది. యూపీఏ ప్రభుత్వం దిగిపోవడంతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కాంట్రాక్టును కొనసాగిస్తూనే మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. విమానాల సంఖ్యను తగ్గించి మరింత ఆధునిక టెక్నాలజీని పెంచేందుకు ఒప్పందం చేసుకుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్థానంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ను పార్టనర్ గా చేర్చారు. దీనిపై విమర్శలు రావడంతో దసాల్ట్ కంపెనీయే రిలయన్స్ ను ఎంపిక చేసుకుందంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం భారత భాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వమే అనిల్ అంబానీకి భాగస్వామ్య హోదా కల్పించిందనుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ కాంట్రాక్టు పొందడానికి దసాల్ట్ కంపెనీ భారత్ లో మధ్య దళారులకు ముడుపులు ఇచ్చిందన్న అంశం ప్రస్తుతం కుదిపేస్తోంది. లెక్కకు అందని రీతిలో, డెఫ్ సిస్ అనే భారత కంపెనీకి చెల్లింపులు సాగాయి. దీని లోగుట్టు ప్రస్తుతం ప్రశ్నార్థకమవుతోంది.

దర్యాప్తుల దగా…

విచారణలు, దర్యాప్తుల అంకంలో ఎన్డీఏ, యూపీఏ అన్న తేడాలే లేవు. ఏ ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పటికీ దళారులు మాత్రం మారడం లేదు. వీవీఐపీలకు వినియోగించే అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం యూపీఏ హయాంలో చోటు చేసుకుంది. అప్పుడు ముడుపుల వ్యవహారంలో దళారులుగా వ్యహరించిన వారిని అరెస్టు చేశారు. విచారణ సాగింది. ఇప్పుడు రఫేల్ ముడుపుల విషయంలోనూ ఆ దళారులే ఉన్నట్లు వెల్లడి కావడం విశేషం. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. దళారులు మాత్రం వాళ్లే. అటు ఇటు సొమ్ముల మార్పిడిలోవారే మధ్యవర్తుల పాత్ర పోషిస్తున్నారు. వారి చాకచక్యాన్ని , చేతివాటాన్ని నాయకులు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. అవినీతి సంపదను చేతులు మార్చడంలో వారి వృత్తి నైపుణ్యాన్ని వాడుకుంటున్నారు. అందుకే నాయకులకు, దళారులకు శిక్షలు పడటం లేదు. అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. శిక్షలు వేయించడంపై శ్రద్ధ పెట్టడం లేదు. బోఫోర్స్ మొదలు ఇప్పటి వరకూ వెల్లడైన , సంచలనం కలిగించిన కేసుల్లో ఎవరికీ పెద్దగా శిక్షలు పడలేదు. యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్ వెల్త్ స్కాం, బొగ్గు కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం వంటివి చాలా బయటికి వచ్చాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. 59 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లకు సంబంధించిన రఫేల్ కథ కూడా అలాగే ముగిసిపోయేది. అయితే ఫ్రాన్స్ రంగంలోకి దిగడంతోనే వణుకు పుడుతోంది. ప్రతిపక్షం రాజకీయం మొదలు పెట్టింది. భారత ప్రతిష్ట అంతర్జాతీయంగా దెబ్బతింటోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News