రాజు – పేద తేడాల్లేవ్…?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ రాజు పేద తేడాల్లేవు. అందరికీ కరోనా తన దెబ్బ చవి చూపిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని [more]

Update: 2021-04-20 15:30 GMT

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ రాజు పేద తేడాల్లేవు. అందరికీ కరోనా తన దెబ్బ చవి చూపిస్తోంది. అంతర్జాతీయ సమాజాన్ని కుదిపేసిన కరోనా మొదటి వేవ్ భారత దేశంలోనూ అనేక మంది ప్రముఖులను బలి తీసుకుంది. రెండో వేవ్ లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రాణాంతకంగా లేదని మొదట్లో భావించారు. కానీ క్రమేపీ తీవ్రత పెరుగుతోంది. రాజకీయ ప్రముఖులపైనా విరుచుకుపడుతోంది. సాధారణంగా కేసీఆర్ జనజీవనానికి దూరంగానే ఉంటారు. ఫామ్ హౌస్ నుంచి లేదా క్యాంప్ కార్యాలయం నుంచే సమీక్షలు నిర్వహిస్తుంటారు. నిరంతరం సమీక్షలు ఉండవు. అవసరమైన సందర్బాల్లో అత్యవసరమైన విషయాల్లో మాత్రమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటారు. సాధారణ పరిపాలన వ్యవహారాలను ఆయన నిరంతరం మోనిటర్ చేసేదేమీ ఉండదు. అయినా కేసీఆర్ కు కరోనా సోకడం అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కమ్ముకుని వస్తోందనే విషయం అర్థమవుతోంది. సాధారణ ప్రజలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

అలవిగాని నిర్లక్ష్యం..

ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ అలవిగాని నిర్లక్ష్యం కనిపిస్తోంది. తొలి విడత కరోనా నెమ్మదించిన తర్వాత విశృంఖలమైన స్వేచ్ఛ లభించినట్లు ప్రజలు భావించారు. రాజకీయ పార్టీలు, నేతలు సైతం పూర్తి ఉదాసీనత కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా జాగ్రత్తలను విస్మరించారు. ప్రచారం నుంచి ఓటింగ్ వరకూ యథేచ్ఛగా ప్రవర్తించారు. నిజానికి పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఈ స్తాయిలో ఉండకూడదు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో జనసమ్మర్థత కారణంగా వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంటుంది. ఏదో రూపంలో వ్యాపించి,ప్రజలను కబళిస్తుంది. కానీ 65 శాతం జనాభా గ్రామ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కంటే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం స్వయంకృతాపరాధమనే చెప్పాలి. కొన్ని చోట్ల ప్రజలు యంత్రాంగంపై తిరగబడుతున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ పౌరుల్లో లోపించిన క్రమశిక్షణకు అద్దం పడుతున్నాయి. తమ ప్రాణాలకు తామే బాధ్యులం కదా అన్నట్లుగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారే రోగ వాహకులుగా మారుతున్నారు. ప్రాణాలకు మించిన విలువైన అవసరం ఏమీ లేదు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే కరోనా మరింతగా విజృంబించే అవకాశం కనిపిస్తోంది.

ఒక్కోరాష్ట్రం ఒక్కో తీరు..

తొలి విడత కరోనా విషయంలో చాలా వరకూ కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించాయి. లాక్ డౌన్ మొదలు, రవాణా వ్యవస్థ పునరుద్ధరణ వరకూ ఒక పద్దతి అమలైంది. కానీ ఇప్పుడు రాష్ట్రాలు తమ ప్రత్యేక విదానాలను అమలు చేస్తున్నాయి. దీనిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ఉత్తమమనే వాదన ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా వ్యవహరించలేకపోతున్నాయి. కాబట్టి కేంద్రమే విదివిధానాలను కఠినంగా అమలు చేయాలనేది మరొక వాదన. నిర్ణయం ఏకాభిప్రాయం తో తీసుకుంటున్నారా? రాష్ట్రాలు స్వయం ఆదేశాలు జారీ చేస్తున్నాయా? అన్నది పక్కన పెడదాం. కరోనా కట్టడిలోనూ రాజకీయాలు చోటు చేసుకోవడం చర్చకు తావిస్తోంది. అన్నీ తానే చేస్తున్నాను అన్నట్లుగా చాటుకోవాలని కేంద్రం చూస్తోంది. కేంద్రాన్ని తప్పుపట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశాల్లోనూ రాజకీయాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. కొన్ని చోట్ల ప్రాణావసరమైన మందులు బీజేపీ కార్యాలయాల్లో నిల్వ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. వాటిని తమకు నచ్చిన ఆసుపత్రులకు, రోగులకు ఇస్తున్నారనేది ప్రచారం. ఇది బీజేపీకి చెడ్డ పేరు తెచ్చే వ్యవహారమే. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉండే సున్నితమైన వ్యత్యాసాన్ని గుర్తించ నిరాకరించడం రాజ్యాంగ విరుద్దం.

న్యాయస్థానాలూ…

కరోనా విషయంలో ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు కృషి చేయాలి. ఉపాధికి భంగం రాకుండా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలి. అదే సమయంలో ఒకవేళ ప్రభుత్వాల చర్యల ద్వారా ప్రజల ఆహారభద్రతకు, వృత్తికి భంగం వాటిల్లితే పరిహారం చెల్లింపు బాధ్యతను గుర్తు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయకపోయినా వారికి వేతనాలు చెల్లిస్తున్నారు. అసంఘటిత రంగంలోని కోట్ల మంది పరిస్థితి ఏమిటి? వారికి ఏరకంగా ప్రభుత్వాలు చేయూతనివ్వాలనే అంశంపై న్యాయస్థానాల సూచనలు అవసరం. ముఖ్యంగా ప్రజారోగ్యాన్ని కార్పొరేట్ , ప్రయివేటు ఆసుపత్రులు నగదుగా మార్చుకుంటున్నాయి. చట్టాలు,నియమాలు ఉన్నప్పటికీ ప్రభుత్వంలోని పెద్దలు కార్పొరేట్ ఆసుపత్రుల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారు. వీటిపై కొరడా ఝళిపించాల్సిన బాధ్యతను న్యాయస్థానాలే తీసుకోవాలి. సాధారణమైన సమ్మెలు, సినిమా టిక్కెట్ల రేట్ల వంటి విషయాల్లో న్యాయస్థానాలు రోజులతరబడి తమ సమయాన్ని వెచ్చిస్తున్న ఉదంతాలు చూస్తున్నాం. కీలకమైన ప్రజారోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు నిఘా ఉందనే బావనను ఆసుపత్రులకు కల్పించాలి. ప్రయివేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న ఫీజుల విషయమై న్యాయస్థానాలు ప్రభుత్వం నుంచి నివేదికలు తెప్పించుకోవాలి. అవసరమైతే సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ లతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించి ఆసుపత్రుల్లో ఫీజులను నియంత్రించాలి. ఇప్పుడు అంతకుమించిన అత్యవసర బాధ్యతలేమీ ప్రభుత్వానికి లేవు. ఈ దిశలో న్యాయస్థానాలు స్పందించాలి. ప్రాణాలతో పాటు ఆర్థిక దోపిడీ నుంచి పౌరులను కాపాడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News