మోదీ మళ్లీ మొదలు పెడతారా?

2020…యావత్ ప్రపంచానికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇందుకు కరోనా కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద దేశం నుంచి పెద్ద దేశం వరకూ ఏదీ దీని ప్రభావం తప్పించుకోలేకపోయింది. [more]

Update: 2021-02-02 16:30 GMT

2020…యావత్ ప్రపంచానికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇందుకు కరోనా కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేద దేశం నుంచి పెద్ద దేశం వరకూ ఏదీ దీని ప్రభావం తప్పించుకోలేకపోయింది. అగ్రరాజ్యమైన అమెరికా వణికిపోయింది. సంపన్నతకు, నాగరికతకు ప్రతిననిధులుగా చెప్పుకునే ఐరోపా దేశాలూ అనుక్షణం ఆందోళన చెందాయి. ఇప్పటికీ ఐరోపా దేశాలు భయం నీడనే బతుకుతున్నాయి. మహమ్మారి ప్రభావ భారత్ పైనా బలంగా ఉంది. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకూ దీని ప్రభావాన్ని చవిచూశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతిని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

పర్యటనల్లో ముందు…..

కరోనా ప్రభావం ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలపైనా పడటం ఆసక్తికరం. ప్రధానిగా ఆయన తరచూ విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. సగటున ఏడాదికి దాదాపు 40 రోజులు మోదీ విదేశాల్లోనే ఉంటారు. ప్రపంచంలోనే కీలకమైన దేశాధినేత హోదాలో పర్యటనలు చేయడంలో తప్పేమీ లేదు. ఆయా దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం పర్యటనలు తప్పనిసరి. అయితే మోదీ విదేశీ పర్యటనలపై విమర్శలు కూడా లేకపోలేదు. విదేశాంగ మంత్రి కన్నా ఆయనే ఎక్కువసార్లు విదేశీ పర్యటనలు చేశారన్న విమర్శ బలంగా ఉంది.

విదేశాంగ మంత్రి కన్నా…

తొలి దఫా (2014-19) పదవీ కాలంలోనాటి విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ కన్నా మోదీనే అధికసార్లు విదేశాలు సందర్శించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. గత ఆరేళ్లలో మోదీ దాదాపు 226 రోజులు విదేశాల్లోనే గడిపారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం మోదీ విదేశీ పర్యటనలపైనా పడింది. 2020లో ఆయన ఒక్క విదేశీయాత్రా చేయకపోవడం గమనార్హం. అన్ని అంతర్జాతీయ సమావేశాలకూ వర్చువల్ విధానంలోనే హాజరయ్యారు. శిఖరాగ్ర సమావేశాల్లోనూ ఆన్ లైన్ లోనే ప్రసంగించారు. వివిధ దేశాల అధినేతలతో మాట్లడటానికి కూడా ఈ విధానాన్నే ఎంచుకోవడం గమనార్హం. 2020 మార్చి 17న మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు రంగం సిద్ధమైంది. బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ జయంతికి హాజరు కావాల్సి ఉంది. అప్పటికే కరోనా వ్యాప్తిపై వార్తలు రావడంతో బంగ్లా పర్యటన రద్దయింది. 2019 నవంబరు 13-15ల్లో బ్రెజిల్లో బ్రిక్స్ (బి ఆర్ ఐ సీ ఎస్- బ్రెజిల్, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా) కూటమి సమావేశాలకు వెళ్లడమే ఆయన ఆఖరి విదేశీ పర్యటన. ఆ తరవాతా ఏ ఒక్క దేశాన్నీ సందర్శించకపోవడం గమనించదగ్గ విషయం.

మొత్తం 59 సార్లు….

మోదీ 2014 మే నెలలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 59సార్లు విదేశాలను సందర్శించారు. పొరుగున ఉన్న భూటాన్ తో ఆయన తొలి విదేశీ పర్యటన మొదలైంది. ఆ తరవాత పర్యటనల వేగాన్ని పెంచారు. భారత్ పొరుగునున్న అన్ని దక్షిణాసియా దేశాలనూ సందర్శించారు. ఆఖరుకు పాకిస్థాన్ లోనూ పర్యటించారు. 80ల్లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ తరవాత ఏ భారత ప్రధానీ పాక్ ను సందర్శించకపోవడం ఇక్కడ గమనార్హం. మొత్తం 106 దేశాలను సందర్శించారు. ఈ పర్యటనలకు దాదాపు రూ.2,256 కోట్లు ఖర్చయినట్లు అంచనా. గత ప్రధానులు వాజపేయి, మన్మోహన్ ల కన్నా మోదీనే అత్యధికంగా విదేశాలను సందర్శించడం విశేషం. 1999 నుంచి 2004 వరకు వాజపేయి 19సార్లు విదేశలకు వెళ్లారు. 31 దేశాలను చుట్టివచ్చారు. 2004 మే నుంచి 2014 మే వరకు ప్రధానిగా చక్రం తిప్పిన మన్మోహన్ సింగ్ 73 సార్లు విదేశాలకు వెళ్లివచ్చారు. మొదటి అయిదేళ్లలో 35 సార్లు, రెండో దఫా పదవీకాలంలో 38 సార్లు మన్మోహన్ విదేశాల్లో విహరించారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో 2021లో మోదీ మళ్లీ విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News