ఆటలాడుకోవద్దు.. దెబ్బకొడుతుంది

దేశంలో కరోనా వైరస్ అంటే ప్రభుత్వాలకే కాదు ప్రజలకూ భయంపోయింది. ప్రభుత్వాలు తమ ఆదాయం దెబ్బతింటుందని అన్ లాక్ చేస్తే ప్రజలు తమ ఉపాధి అవకాశాల కోసం [more]

Update: 2020-09-28 18:29 GMT

దేశంలో కరోనా వైరస్ అంటే ప్రభుత్వాలకే కాదు ప్రజలకూ భయంపోయింది. ప్రభుత్వాలు తమ ఆదాయం దెబ్బతింటుందని అన్ లాక్ చేస్తే ప్రజలు తమ ఉపాధి అవకాశాల కోసం కరోనాను లెక్క చేయడం లేదు. ఉపాధి కోసమయితే సరే. కరోనా అంటే పూర్తిగా భయంపోయిందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కరోనా తమను ఏం చేస్తుందన్న భయం లేకపోవడమే. విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్ లను ధరించడం లేదు.

సాధారణ వాతావరణం…..

మొత్తం మీద దేశంలో సాధారణ వాతావరణం ఏర్పడిందన్నది నిపుణులు అభిప్రాయం. ఇది ప్రమాదకరమని వారు సూచిస్తున్నారు. సామాజికవ్యాప్తికి కారణం అవుతుందని, రెండోదశకు వెళ్లినా ఆశ్చర్యం లేదన్నది వివిధ అధ్యయన సంస్థలు చెబుతున్న మాట. భారత్ లో 130 కోట్ల మందికిపైగానే ప్రజలు ఉన్నారు. ఇంతటి పెద్ద దేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదు. ప్రజల నుంచి సహకారం లేనిదే తామేమీ చేయలేమని ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి.

9 నెలలు దాటుతున్నా…..

కరోనా వైరస్ తొలి కేసు భారత్ లోకి ప్రవేశించి 9 నెలలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిబంధలన్నీ తొలగించి రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేసింది. లాక్ డౌన్ సమయంలో కరోనా అంటే ప్రజలు భయపడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు అన్ని రకాలుగా ఆలోచించేవారు. అవసరమైతే తప్ప బయటకు రాలేదు. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా బయటకు వస్తున్నారు. శానిటైజర్స్ వినియోగం కూడా తగ్గిందని వాటి అమ్మకాలు చెబుతున్నాయి. దీనికి కారణం మరణాల రేటు తగ్గుతుండటం, రికవరీ రేటు పెరుగుతుండటమే కారణమని చెప్పక తప్పదు.

రికవరీ రేటు ఊరటనిచ్చినా…..

భారత్ లో ప్రస్తుతం రోజువారీ నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉన్నాయి. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు రేటు, రికవరీ శాతంలో మాత్రం కొంత ఊరటనిచ్చే దశలోనే ఉన్నాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరణాల రేటును 1శాతానికి తగ్గించాలన్న ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో కొంత ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ కంట్రోలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అతి ధీమాతో కరోనాతో ఆటలాడుకోవద్దని, అతి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News