“విజయ” నగరం రహస్యమిదేనట

ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడి పోతోంది. ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాలు కూడా హాట్ స్పాట్ లుగా మారాయి. రోజుకు పదుల సంఖ్యంలో కరోనా పాజిటివ్ [more]

Update: 2020-04-20 09:30 GMT

ప్రపంచమంతా కరోనా వైరస్ తో అల్లాడి పోతోంది. ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాలు కూడా హాట్ స్పాట్ లుగా మారాయి. రోజుకు పదుల సంఖ్యంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కానీ విజయనగరం జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా. ఈ జిల్లా విశాఖపట్నంకు ఆనుకునే ఉంటుంది. కానీ దాదాపు ఇరవై రోజుల నుంచి కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

విశాఖకు దగ్గరలోనే….

దీనికి ప్రధాన కారణం విజయనగరం జిల్లా అధికారులేనని చెప్పక తప్పదు. పొరుగునే ఉన్న విశాఖపట్నం జిల్లాలో ఇరవై కేసులు నమోదయ్యాయి. విదేశాలు, మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉంది. ఇక విజయనగరం జిల్లా నుంచి ప్రతిరోజూ వేలాది మంది విశాఖకు వెళ్లి వస్తుంటారు. ఈనేపథ్యంలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం వెనక పకడ్బందీ చర్యలే అంటున్నారు.

విదేశాల నుంచి వచ్చి…..

విజయనగరం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కూడా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే కరోనా పై కేంద్ర ప్రభుత్వం స్పందించిన వెంటనే జిల్లా యంత్రంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని వెంటనే గుర్తించి వారిని క్వారంటయిన్ కు తరలించడంతో కాంటాక్టు కేసుల నుంచి తప్పించగలిగారు.

వచ్చిన వారిని వెంటనే గుర్తించి….

మరోవైపు అదృష్టం కొద్దీ విదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారికి ఎవ్వరికీ కరోనా పాజిటివ్ గా రాలేదు. 919 మంది విదేశాలు, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు చేశారు. దీంతో పాటు దాదాపు ఏడు లక్షల ఇళ్లలో సర్వే చేసి వివరాలు సేకరించి పెట్టుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు జరిపారు. ఇక విశాఖలో కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఎవరినీ రానివ్వకుండా నిషేధం విధించారు. జిల్లా నుంచి ఎవరినీ బయటకు పంపడం లేదు. మొత్తం జిల్లా సరిహద్దుల్లో మొత్తం 40 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లాల సరిహద్దులను కూడా మూసివేశారు. అందువల్లనే విజయనగరం జిల్లాలో కరోనా కేసు ఒక్కటీ నమోదు కాలేదన్నది అధికారుల మాట. మొత్తంమీద ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఆ జిల్లా అధికారులకు అందరం హాట్సాఫ్ చెప్పాల్సిందే.

Tags:    

Similar News