తమిళనాడుకు తగులుకుంది.. వదిలించుకునేదెలా?

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులో కరోనా కల్లోలం రేగింది. ఇందుకు ప్రధాన కారణంగా ఢిల్లీలో జరిగిన జమాత్ కు [more]

Update: 2020-04-05 18:29 GMT

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులో కరోనా కల్లోలం రేగింది. ఇందుకు ప్రధాన కారణంగా ఢిల్లీలో జరిగిన జమాత్ కు వెళ్లి వచ్చిన వారు అధికంగా ఉండటమే. మొన్నటి వరకూ తమిళనాడులో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు లేకపోవడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి ఊపిరి పీల్చుకున్నారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలుపర్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

ఒక్కరోజులోనే….

అయితే ఒక్కరోజులోనే 110 కేసులు పెరిగిపోవడంతో పళనిస్వామిలోనూ కలవరం ప్రారంభమయింది. అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తమిళనాడు నుంచి దాదాపు పదిహేను వందల మంది వరకూ ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లినట్లు తమిళనాడు ప్రభుత్వం గుర్తించింది. వీరంతా వివిధ తేదీల్లో రైళ్ల ద్వారా ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం వీరి ఆచూకీని కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.

రోజురోజుకూ కేసుల సంఖ్య…

ఇప్పటికే తమిళనాడులో 400కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన పదిహేను వందల మంది మొత్తం రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిలో ఇప్పటి వరకూ 500 మందినిి మాత్రమే గుర్తించారు. మరో వెయ్యి మంది వరకూ తమిళనాడు ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. వీరిని గుర్తించడంలో ఆలస్యమయ్యే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన తమిళనాడులో వ్యక్తమవుతోంది. అందుకే ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

వారి జాడ తెలియక….

ఒక్కరోజు ఆలస్యమయినా వారు కాంటాక్ట్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన ప్రభుత్వంలోనూ కన్పిస్తుంది. కొందరు రైల్వే అధికారులకు చిరునామాలు తప్పుుగా ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారింది. మరికొందరు రిజర్వేషన్లు లేకుండానే రైళ్లలో రావడం వల్ల కూడా గుర్తించలేకపోతున్నారు. దీంతో స్థానిక మత పెద్దలతో సమావేశమై ఢిల్లీ వెళ్లిన వారి వివరాలను తెలపాలని అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద తమిళనాడులో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇప్పటి వరకూ తమిళనాడులో కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు.

Tags:    

Similar News