చివరికి ప్రజలదే తప్పని తేల్చారుగా

కరోనా వైరస్ అన్నది మహమ్మారి. ఈ సంగతి అందరికీ తెలుసు. పైగా గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో చైనాను వణికించి జనవరి వరకూ ఆ ఉధృతి [more]

Update: 2020-04-08 00:30 GMT

కరోనా వైరస్ అన్నది మహమ్మారి. ఈ సంగతి అందరికీ తెలుసు. పైగా గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో చైనాను వణికించి జనవరి వరకూ ఆ ఉధృతి కొనసాగించి వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. అటువంటి కరోనా వైరస్ విషయంలో మన పాలకులు మొదట్లో కొంత లైట్ తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లే ఇళ్ళకు పంపించివేశారు. పైగా వారి వద్ద సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకున్నామని, హోం క్వారంటైన్ లో ఉంటామని మాట ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ మాటలు నమ్మినవారే ఇక్కడ మోసపోయారనుకోవాలి. లేక దీని కారణంగా జనాలు మోసపోయారనుకోవాలి.

కట్టుదిట్టమేదీ…?

కరోనా వైరస్ ఓ వైపు జోరుగా దూసుకువస్తున్న వేళ మరో వైపు కట్టడికి తగిన చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వాలు మొదట్లో త‌డబడ్డాయి. ఈ విషయంలో తెలంగాణా సర్కార్ కొంత వేగంగా స్పందించిందనే అనుకోవాలి. ఆ తరువాత కొన్ని రోజులకు ఏపీ సర్కార్ అదే తీరుగా సీరియస్ నెస్ ని అర్ధం చేసుకుని యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈ లోగా జరగాల్సింది అక్కడా ఇక్కడా కూడా జరిగిపిపోయింది. కరోనా వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ తగిన మందు అనుకున్నారు. కానీ సొంత గడ్డ మీదనే ఢిల్లీ వేదికగా జరిగిన ప్రార్ధనల నుంచే సరికొత్త ఇబ్బందులు వస్తాయని ఊహించలేకపోయారు. ఇక్కడ కూడా పాలకుల నిర్లక్ష్యం, శాంతి భద్రతల విషయంలో ఏమరుపాటు, ఇంటలిజెన్స్ వైఫల్యాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.

నింద వారిదా…?

ఇదిలా ఉండగా తాజాగా ఏపీకి చెందిన వైద్య మంత్రి ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ మీద తాము అన్ని రకాలైన చర్యలూ చేపడుతున్నామని, ఇక జనాలదే బాధ్యతని అనేశారు. తాము ఎంత చేసినా జనాల సహకారం లేకపోతే కరోనా కట్టడి సాధ్యం కాదని దాదాపుగా చేతులెత్తేసేలా మాట్లాడేశారు. నిజమే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ప్రజలు సహకరించాలి. కానీ ప్రభుత్వాలు ముందు చూపు కొరవడి అందరినీ జనజీవన స్ర‌వంతిలో కలిపేసిన తరువాతనే కదా వైరస్ మరింత తీవ్రమైందన్నది మేధావుల మాటగా ఉంది. ఇక కొత్తగా ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఎక్కడికక్కడ చెక్ చేసి క్వారంటైన్ కి తామే తరలించాల్సిన బాధ్యత గల పాలకులు ఇళ్ళకు పంపించడం వల్లనే ముప్పు పెద్దది కూడా అయిందని విమర్శలు ఉన్నాయి.

భయమే నిజమా…?

భారత్ లాంటి పేద దేశాలు, జనాభా పరంగా పెద్ద దేశాలూ కరోనా వంటి మహమ్మారి కార్చిచ్చులా వ్యాపిస్తే తట్టుకోవడం కష్టమేనని ప్రపంచ దేశాల నిపుణులు అనుకుంటూ వచ్చారు. ఇక దేశంలోని మేధావి వర్గాలు, చదువరులూ, నిపుణులూ ఇదే భయాన్ని వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఇపుడు అదే నిజం అయినట్లుగా ఉంది అంటున్నారు. మనకున్న అనేక రకాల సెంటిమెంట్లు, వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసే పాలకుల రాజకీయాలు, మరో వైపు అవగాహనా లేమి, స్వార్ధ చింతన అన్నీ కలసి ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమని చెప్పుకోవాలి. అంతే తప్ప కేవలం ప్రజలదే తప్పు అని నింద వేయడం తగదన్న మాట అన్ని వైపుల నుంచి గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News