ఎమోషనల్ డైలాగులు.. ఏ ఒక్కటీ పనికిరాలేదే?

కరోనా వైరస్ భారత్ లో ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. భారీ డైలాగులు చెప్పిన కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు మళ్లీ ఎమోషనల్ డైలాగ్ లు చెబుతున్నారు. [more]

Update: 2020-05-27 18:29 GMT

కరోనా వైరస్ భారత్ లో ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. భారీ డైలాగులు చెప్పిన కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఇప్పుడు మళ్లీ ఎమోషనల్ డైలాగ్ లు చెబుతున్నారు. తొలినాళ్లలో కరోనా వైరస్ ను నియంత్రించడానికి లాక్ డౌన్ ను విధించామని గొప్పగా చెప్పుకున్నారు. కరోనా చైన్ ను బ్రేక్ చేయాలంటే లాక్ డౌన్ తప్పని సరి అని ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చెప్పారు. ప్రజలు సహకరించాని కోరారు. మందులేని కరోనాకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భారీ డైలాగులు వల్లించారు.

నాలుగు విడతల లాక్ డౌన్ వల్ల…..

కానీ నాలుగు విడతల లాక్ డౌన్ లతో సాధించేదేమీ లేదని తేలిపోయింది. చైనాను మించి ఇప్పుడు భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లక్షా నలభై వేలకు చేరువలో భారత్ లో ఉన్నాయి. మొదటి రెండు విడతల లాక్ డౌన్ ను కొంత కఠినంగా విధించారు. మూడు, నాలుగో విడత లాక్ డౌన్ లు మాత్రం పూర్తిగా ఫెయిలయ్యాయంటున్నారు నిపుణులు. ఎగ్జిట్ ప్లాన్ తెలియకనే కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు మినహాయింపులు ఇచ్చారని నిపుణులు సయితం చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాల వత్తిడికి…

నెల రోజులు రెండు విడతల లాక్ డౌన్ కొనసాగించే సరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. తొలుత కరోనాపై విజయం సాధించి తీరుతామని మోదీ భారీ డైలాగులు చెప్పారు. ప్రజల సహకారం ఉంటే కరోనాను దేశం నుంచి తరిమికొట్టగలమని బీరాలకు పోయారు. ప్రజలు ఇందుకు సహకరించారు కూడా. వేదాలను, శ్లోకాలను కూడా మోదీ వల్లించారు. కానీ ఫలితం ఏమాత్రం కన్పించలేదు.

కేసుల సంఖ్య మరింతగా….

మూడు, నాల్గో విడత లాక్ డౌన్ నుంచి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని విపక్ష నేత సోనియా గాంధీ సయితం ప్రశ్నించారు. ఎలాంటి ప్లాన్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందంటున్నారు. మరోవైపు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న కారణంగానే లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చారు. మరి రెండునెలల లాక్ డౌన్ వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? అని పరిశీలిస్తే.. కరోనా అంకెలు చూస్తే లేదనే చెప్పాల్సి ఉంటుంది. కరోనా ఇప్పట్లో భారత్ ను వదలిపెట్టేలా లేదన్నది వాస్తవం. మరి భారీ డైలాగులు, ఈవెంట్లకు కరోనా పారిపోలేదన్న విషాయన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవడం మేలు.

Tags:    

Similar News