పిడకల వేట..?

కరోనాప్రయాణంలో రాజకీయ పిడకల వేట జోరుగా సాగుతోంది. మన నాయకులు మహా ముదుర్లు. వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోరు.అందుకే కరోనా ప్టాట్ ఫారంపై పొలిటికల్ వార్ షురు [more]

Update: 2021-04-24 08:00 GMT

కరోనాప్రయాణంలో రాజకీయ పిడకల వేట జోరుగా సాగుతోంది. మన నాయకులు మహా ముదుర్లు. వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోరు.అందుకే కరోనా ప్టాట్ ఫారంపై పొలిటికల్ వార్ షురు చేస్తున్నారు. జాతి మొత్తం ఒకే బాటన నడవాల్సిన ఉపద్రవం కొనసాగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో, ఎంతమంది చనిపోనున్నారో తెలియనిస్థితి. కంటికి కనిపించని శత్రువుతో సాగుతున్న యుద్ధం. ఈ స్థితిలో రాజకీయ లాభనష్టాలను పక్కనపెట్టి ముందుగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాలి. అధికార పార్టీ, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ప్రజలకు వైద్యం సక్రమంగా అందేలా చూడాలి. కానీ మనదేశంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు, నిందలకే సమయం సరిపోతోంది. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. వాక్సిన్ ఉత్పత్తుల కంపెనీలు సైతం తమకు నచ్చిన రేట్లు పెట్టుకుంటామని ప్రకటించినా ఏం చేయలేని నిస్పహాయత కొనసాగుతోంది. ప్రభుత్వ వైపల్యాలను ఆసరాగా చేసుకుంటూ పైకి ఎగబాకాలనుకుంటున్న నాయకుల విడ్దూరమైన ప్రవర్తన వింత గొలుపుతోంది. పెద్ద నాయకులను చూసి యువనాయకులూ అదే బాట పడుతున్నారు.

యువతతో కనెక్ట్ కావడమంటే ఇదేనేమో…

ప్రజల్లో తన పలుకుబడి, సమర్థత ఏమిటో ఇంతవరకూ నిరూపించుకోలేకపోయిన యువనేత , తెలుగుదేశం పార్టీ వారసుడు లోకేశ్. ఎన్నికలు, ఇతర అంశాల్లో పార్టీ పరంగా తాను ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పర్వాలేదు. లాభపడితే పార్టీ ప్రయోజనం పొందుతుంది. నష్టపోతే పార్టీకే చేటు వస్తుంది. కానీ విద్యార్థుల పరీక్షల వంటి సున్నిత అంశాలనూ రాజకీయ మయం చేయాలని చూడటం అపరిపక్వతకు నిదర్శనం. పది, ఇంటర్మీడియట్ పరీక్షలను లక్షలమంది రాయాల్సి ఉన్న మాట నిజం. కొన్ని రాష్ట్రాలు ఈ పరీక్షలను రద్దు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై తాను ఉద్యమం చేస్తానంటూ లోకేశ్ ప్రకటించడం రాజకీయ అవకాశవాదమనే చెప్పాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సహా కలిపి 80 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి పరీక్షలు రద్దు చేయాల్సిందేననేది ఆయన డిమాండ్. మరి తిరుపతి ఉప ఎన్నికలో 20 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి ఎన్నికను బహిష్కరించేందుకు తెలుగుదేశం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది. లోకేశ్, చంద్రబాబు ఊరూరా తిరిగి మరీ జనంలోకి వెళ్లారు కదా. పరీక్షల విషయంలో విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలతో చర్చించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. తల్లిదండ్రులు, విద్యార్థుల తాత్కాలిక మూడ్ ను ఎన్ క్యాష్ చేసుకుందామనే రాజకీయ డిమాండ్లు ఎటువంటి ఫలితం ఇవ్వవు. జాతీయంగా ఉన్నత విద్యాసంస్థల్లో మన విద్యార్థులకు లభించే అవకాశాలు, గ్రేడ్లు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లోకేశ్ యువతతో కనెక్ట్ కావాలని పార్టీలో డిమాండ్ వినవస్తోంది. అందుకు పరీక్షల ఎగవేత డిమాండ్ ను దగ్గరి దారిగా ఎంచుకున్నారేమో అనిపిస్తోంది.

గురువుగారి గోల…

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు లోకేశ్ కు గైడింగ్ ప్రిన్పిపాల్ రేవంత్ రెడ్డి. దూకుడు కలిగిన నేత. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లిపోవడంతో కాంగ్రెసులో ప్రవేశించి కీలకమైన స్థానానికి ఎదిగారు. మరింత ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే కింద నుంచి కాళ్లు పట్టుకుని లాగేస్తున్నారు సీనియర్ నాయకులు. అయినప్పటికీ అధికారపార్టీపై విమర్శలు, ఆరోపణల విషయంలో మాత్రం రేవంత్ ను కొట్టేవారే లేరు. హుందాతనం, స్థాయి భేదం మరిచి విమర్శలు గుప్పించడం లో అందె వేసిన చెయ్యి. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ లో కలవాలి. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై నుంచి దూకాలి అంటూ చేసిన దుందుడుకు వ్యాఖ్యలు రేవంత్ అసహనాన్నే బయటపెట్టాయి. విమర్శ తీవ్రత వ్యక్తిగతంగా మారితే అసలు విషయం పక్కదారి పడుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఉదాసీనత, వైఫల్యాలను ఎత్తి చూపాలి. తప్పు పట్టాలి. అంతే తప్ప నాయకులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంటూ అనుచితంగా దూషించడం వల్ల ప్రచారమే తప్ప ఫలితం శూన్యం.

అగ్రనేతలూ అంతే…

కొందరు అగ్రనాయకులు సైతం రాజకీయ ప్రచారానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ వాక్సిన్లు అవసరం ఎక్కువగా ఉంది? ఎక్కడ ఆక్సిజన్ అవసరాలు పెరిగాయి? అనే కోణంలో ప్లాన్ చేసుకోవాలి. దేశం మొత్తాన్ని ఒక యూనిట్ గా భావించాలి. అంతే తప్ప కొందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రం , తమ అవసరాలు అనే కోణంలో మందులు, వాక్సిన్లు, ఆక్సిజన్ అవసరానికి మించి నిల్వ చేసేయాలనే తాపత్రయాన్ని కనబరుస్తున్నారు. ఇది మిగిలిన ప్రాంతాల ప్రజలలో నిజమైన అవసరమున్న రోగులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కొందరు కోటేశ్వరులు తమకు రోగం రాకున్నా ప్రయివేటు ఆసుపత్రుల్లో పడకలను రిజర్వ్ చేసుకుని ఉంచుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది మరింత దారుణం. అందులోనూ రాజకీయ నాయకుల సిఫార్సులతో చాలా చోట్ల ప్రయివేటు ఆసుపత్రుల పడకలు బ్లాక్ అయిపోతున్నాయి. తమలో తాము విమర్శించుకోవడం మానేసి నాయకులు ఆసుపత్రుల్లో అందుతున్న సౌకర్యాలపై నిఘా పెడితే మంచిది. రాజకీయ నాయకులు అంటే అధికారులకు, ఆసుపత్రుల నిర్వాహకులకు ఎంతో కొంత భయం, భక్తి ఉంటాయి. పడకలను బ్లాక్ చేయడం, మందుల కృత్రిమ కొరత సృష్టించడాన్ని ప్రతిపక్స నాయకులు వెలికి తీస్తే ప్రభుత్వ పెద్దలకు భయం పుడుతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రదానితో సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం వివాదాస్పదమైంది. అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఒక ప్రచార అంశంగా వాడుకోవాలని చూశారు కేజ్రీవాల్. కరోనా వంటి విపత్కర సమయంలోనూ రాజకీయ ఉద్దేశాలు నాయకుల ధోరణిలో తొంగి చూస్తున్నాయి. రెండో విడత కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టేవరకైనా తమ పొలిటికల్ హంగ్రీని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News