వద్దు…బాబూ…రావద్దు.. మా ఇంటికి

క్యాడర్ కి లీడర్ కి మధ్య ఉన్న బంధం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల బంధం కన్నా ఎక్కువే. వారిని చూసుకునే పార్టీలను ఎదిరిస్తారు, [more]

Update: 2020-04-05 12:30 GMT

క్యాడర్ కి లీడర్ కి మధ్య ఉన్న బంధం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల బంధం కన్నా ఎక్కువే. వారిని చూసుకునే పార్టీలను ఎదిరిస్తారు, వారిని అడ్డంపెట్టుకునే రాయబారాలు నడుపుతారు, భారీ జంపింగులు చేస్తారు. మా వెనకాల అసలైన బలం కార్యకర్తలేనని గొప్పగా చెప్పుకుంటారు. ఇక రాజకీయ నాయకుడుకి ఒక మైకూ నాలుగు బుర్రలు లేకపోతే అసలు తోచదు. గెలిచినా ఓడినా కూడా తాను దంచే లెక్చర్లు కిక్కురుమన‌కుండా వినేందుకు జనం కావాలి. అలా వచ్చిన కార్యకర్తలకు పనులు చేయడం పక్కన పెడితే తన గురించి గొప్పలు, అప్పోజిషన్ లీడర్ మీద తిట్లూ అందుకోకపోతే ఆయన పొలిటీషియనే కాదు.

బాబ్బాబూ అంటున్నారే….

ఇంట్లో వారినైనా పక్కన పెడతారు కానీ కార్యకర్తల దర్శనం లేకపోతే ఆ నాయకుడి బాధ వర్ణనాతీతం. అలాంటి కార్యకర్తలను వద్దు బాబూ రావద్దు మా ఇంటికి ఈ వేళ అనేస్తున్నారు బడా లీడర్ల నుంచి చోటా లీడర్ల వరకూ ఇదే గోల. మీకు పుణ్యం ఉంటుంది బాబ్బాబూ మా మానాన ఓ పదిరోజులు వదిలేయండ్ ప్లీజ్ అంటూ ఏకంగా పత్రికా ప్రకటనలే చేస్తున్నారు. ఎందుకిలా అంటే ఇదంతా కరోనా భయంతోనేనట. ఎక్కడ ఏ కార్యకర్తను అంటుకుంటే ముట్టుకుంటే కరోనా సోకుతుందో, మరే పెద్ద మనిషి పనులు కావాలంటూ వచ్చి జబ్బుని అంటించిపోతాడోనని నేతాశ్రీలు హడలి చస్తున్నారు. అందుకే పార్టీ ఆఫీసులు కూడా మూసేసి మరీ దండం పెట్టేస్తున్నారు.

ఏకంగావాసమే…

ఉత్తరాంధ్రా రాజకీయ దిగ్గజాలు ధర్మాన ప్రసాదరావు, కిల్లి కృపారాణి, తమ్మినేని సీతారాం వంటి వారు ఈ విధంగా భారీ స్టేట్మెంట్లు ఇచ్చి మరీ ఈ నెల 31 వరకూ తమ వద్దకు రావద్దు, వచ్చినా తాము కలిసేది లేదంటూ పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు వీరి బాటలోనే పచ్చ పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. ఏ రాజకీయమూ వద్దు, ఎంచక్క ఇంట్లో కూర్చోండి, కరోనా గొడవ తగ్గాక మళ్ళీ కలుద్దామంటూ ఓ పెద్ద నమస్కారం పెట్టేసి తమకు తాముగా ఏకాంతవాసాన్ని విధించుకుంటున్నారు.

విడదీసి మరీ…..

నిజంగా ఇది చిత్రమే. తిరిగే కాలూ తిట్టే నోరు ఎక్కడా ఆగవు అంటారు. మరి ఆ విధంగా అన్నీ మూసుకుని కూర్చోవడం అంటే యమ గండమే. కానీ అక్కడ ఉన్నది కరోనా. అందుకే ఈ అతి జాగ్రత్తలట. మొత్తానికి కరోనా మామూలిది కాదుగా. లీడర్ని, క్యాడర్నీ విడదీసి మరి హడలెత్తించేస్తోందిగా. ఏది ఏమైనా ఇలా కూడా కరోనాని అరికట్టే విషయంలో మన నాయకులు జనాలకు అవగాహన కలిగిస్తున్నారు. జన‌సమూహాల్లోకి వెళ్ళవద్దని తాము పాటిస్తూ క్యాడర్ కి కూడా హితబోధ చేస్తున్నారు. అందుకు మెచ్చుకోవాల్సిందే.

Tags:    

Similar News