మతవిశ్వాసాలా..!? రాజకీయాలా..?

మతమా.. రాజకీయమా.. జీవనోపాధా.. జీవితమా..? ఈ నాలుగు అంశాల్లో ఏది ప్రధానమైనది. అంతర్జాతీయంగా వైరల్ డిసీజ్ వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో ఏది అవసరం.. ప్రజల దృష్టి, ప్రభుత్వాల [more]

Update: 2021-07-22 09:30 GMT

మతమా.. రాజకీయమా.. జీవనోపాధా.. జీవితమా..? ఈ నాలుగు అంశాల్లో ఏది ప్రధానమైనది. అంతర్జాతీయంగా వైరల్ డిసీజ్ వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో ఏది అవసరం.. ప్రజల దృష్టి, ప్రభుత్వాల ఆలోచన తీరు ఎలా ఉండాలి.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి.. బతకాలంటే డబ్బు అందరికీ అవసరమే.. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఐతే మనిషి ప్రాణాలకు మించినదా అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. కానీ ప్రభుత్వాలకు మాత్రం ఈ లాజిక్ పెద్దగా పట్టడం లేదు.. కుంభమేళా, కన్వర్ యాత్ర, బక్రీద్, బోనాలు, గణేష్ ఉత్సవాల విషయంలో ప్రభుత్వాలు కేవలం రాజకీయ ప్రయోజనాలనే చూస్తుండటం అందుకు అద్ధం పడుతోంది. ఆర్టికల్ 21 అందరికీ జీవించే ప్రాథమిక హక్కును కల్పించింది. దానిని కాపాడాల్సిన బాధ్యత అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ ప్రస్తుతం పాలకులంతా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారపీఠం ఎక్కడం అనే ఎజెండాతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఎవరూ కాదనలేని, ఖండించలేని సత్యం. కుంభమేళ అనంతర పరిణామాలు మనందరికీ తెలిసినవే. రెండోదశలో కరోనా రక్కసి విజృంభణ మొత్తం దేశాన్ని అతలాకుతలం చేసింది. అప్పటి వరకు కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన దేశం ఒక్కసారిగా అందరి విమర్శలు ఎదుర్కొంది. వ్యాక్సిన్ కనిపెట్టడంలో ముందున్న దేశం, వ్యాక్సినేషన్ విషయంలో వెనుకబడిపోయింది.

కోర్టు మొట్టికాయలు వేసినా….?

సెకండ్ వేవ్‌ తగ్గుముఖం పట్టింది.. థర్డ్ వేవ్ భయం పొంచి ఉంది.. ఈ సమయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మాత్రం తమ ధోరణి మార్చుకోవడం లేదు.. ఉత్తరభారతాన ప్రతీ శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర పేరుతో హిందువులు గంగానది నీటిని కావడితో తీసుకెళ్లి శివుడికి అభిషేకం చేస్తుంటారు. ప్రజాక్షేమమే తమకు ముఖ్యమని భావించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రను రద్దుచేసింది. కానీ ఉత్తరప్రదేశ్‌ సర్కార్ మాత్రం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచనతో యాత్ర కొనసాగించేందుకు మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని నిర్ణయం మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అని ప్రశ్నించడంతో యూపీ సర్కార్‌కు తన నిర్ణయం మార్చుకోక తప్పలేదు.. ఇదిలా ఉంటే కేరళలో బక్రీద్ సందర్భంగా వ్యాపారాలకు నాలుగు రోజుల పాటు ఆంక్షలను సడలించింది రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపైన కూడా విమర్శలు వెల్లువెత్తాయి.. ఆ రాష్ట్రంలో ఇప్పటికే టెస్ట్ పాజిటివిటీ రేటు 11 శాతంగా ఉంది. జనం ఒక్కసారిగా మళ్లీ రోడ్లమీదకు వస్తే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. ఐనా కేరళ ప్రభుత్వం మాత్రం విచిత్రమైన వాదనను ముందేసుకుంది. ఒక డోసు వాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే షాపులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ముందు తన వాదన వినిపించింది. సాధ్యాసాధ్యాలపై మాత్రం ఎలాంటి ప్రణాళిక లేకుండానే రంగంలోకి దిగింది. ప్రస్తుతం తెలంగాణలో బోనాల ఉత్సవాలు కూడా ఆ కోవలోకే వస్తాయి.. రాబోయే గణేష్ ఉత్సవాల సంగతి సరేసరి.

మళ్లీ 40 శాతం పెరిగిన కొత్త కేసులు…

ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ అని విడివిడిగా చెప్పుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది.. తాజాగా కేసుల సంఖ్య మళ్లీ 40 శాతం పెరిగినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.. థర్డ్ వేవ్ పొంచి ఉన్నదనే మెడికల్ అసోసియేషన్ అలారమ్ నిజమే అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్లా 12 లక్షల మంది కరోనాబారిన పడితే 4 లక్షలా 14 వేల మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. దేశవ్యాప్తంగా ఇంకా 4,07,170 మంది కరోనాతో బాధపడుతున్నారు. రికవరీ రేటు 97 శాతం ఉన్నా కరోనాకు బ్రేక్ పడకపోవడం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. అదేవిధంగా మరణాల విషయంలోనూ మహారాష్ట్ర ముందుండగా తరువాత కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి.

రాష్ట్రం కేసులు రికవరీ మరణాలు

మహారాష్ట్ర 62.2 లక్షలు 59.9 లక్షలు 1.27 లక్షలు
కేరళ 31.7 లక్షలు 30.3 లక్షలు 15,408
కర్ణాటక 28.9 లక్షలు 28.2 లక్షలు 36,197
తమిళనాడు 25.4 లక్షలు 24.8 లక్షలు 33,752
ఢిల్లీ 14.4 లక్షలు 14.1 లక్షలు 25,030

 

జాతీయస్థాయిలో విధాన నిర్ణయం అవసరం..

మూడోదశ ముప్పు పొంచి ఉందని అంతా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొత్తుకుంటున్నా, సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతున్నా ప్రభుత్వాల తీరులో మార్పు లేదు.. మతపరమైన విశ్వాసాలు సున్నితమైనవి కావడంతో వాటి జోలికి వెళ్లే సాహసం రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి.. జీవితాల కన్నా జీవనోపాధి ముఖ్యం కాదు.. ప్రాణం కన్నా మతం గొప్పది కాదని గుర్తించాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రం జాతీయస్థాయిలో మతపరమైన విశ్వాసాలకు సంబంధించి అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

Nag Raju Miryala, senior journalist

Tags:    

Similar News