కోలుకోవాలంటే…”కోత”లు కోయడం మానుకోవాల్సిందే

కరోనా దెబ్బతో కేంద్రం, రాష్ట్రం అన్న సరిహద్దులు చెరిగిపోయాయి. దేశమంతా ఒకే మాట, ఒకే బాటగా మాట్లాడుతున్నాయి. దాదాపు ప్రభుత్వాలన్నీ ఐక్యతాగానాన్ని ఆలాపిస్తున్నాయి. విధానపరమైన విభేదాలు, సిద్దాంతపరమైన [more]

Update: 2020-04-10 16:30 GMT

కరోనా దెబ్బతో కేంద్రం, రాష్ట్రం అన్న సరిహద్దులు చెరిగిపోయాయి. దేశమంతా ఒకే మాట, ఒకే బాటగా మాట్లాడుతున్నాయి. దాదాపు ప్రభుత్వాలన్నీ ఐక్యతాగానాన్ని ఆలాపిస్తున్నాయి. విధానపరమైన విభేదాలు, సిద్దాంతపరమైన వ్యత్యాసాలు పక్కనపెట్టేశారు. భిన్నంగా మాట్లాడటానికి వేర్వేరు పార్టీల నాయకులు ఇష్టపడటం లేదు. తాము జాతీయ స్రవంతికి దూరమవుతామేమోననే భయమే ఇందుకు కారణం. సాధారణంగా ఇతర దేశాలతో యుద్ద సందర్బాల్లో కనిపించేంతటి ఐకమత్యం ప్రతిచోటా తారసిల్లుతోంది. ప్రజలు సైతం తామెన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ బయటపెట్టేందుకు సాహసించడం లేదు. కష్టాలను భరిస్తున్నారు. 130 కోట్ల మంది ప్రజలు నాయకులు చెప్పినమాటను వింటున్నారు. ప్రశ్నించడం లేదు. ఇప్పుడు దేశంలో ప్రతిపక్షం అన్నమాట లేదు. ఉన్నది ఒకటే ఒక పక్షం. విపత్తుల సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామమే. అయితే అడిగేవారు లేకపోయినా అందరి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అన్ని రంగాలను, వర్గాలను తిరిగి కోలుకొనే విధంగా పునరుద్దీపన చేయాల్సిన కర్తవ్యమూ సర్కారుదే.

కంపెనీలు దివాలా…

సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల్లో 70శాతం పైచిలుకు దివాలా తీశాయి. అసలే పారిశ్రామిక మందగమనం, కొనుగోళ్లు తగ్గిపోవడంతో గడచిన ఏడాదికాలంగా చిన్న చితకా కంపెనీలు నష్టాల బాటలోనే ఏదోరకంగా నెట్టుకుని వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం పనులే నిలిచిపోవడంతో చేసిన అప్పులు, వడ్డీలు, జీతాల భారం కంపెనీలకు గుదిబండగా మారింది. ఎవరినీ ఉద్యోగాలనుంచి తీయవద్దు, జీతాల్లో కోత విధించవద్దు అని ప్రధాని చెప్పారు. సూక్తిగా వినేందుకు బాగానే ఉన్నప్పటికీ అది ఆచరణలో అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక అంచనా ప్రకారం 60 శాతం పైచిలుకు చిన్న , మధ్యతరహా కంపెనీలు జీతాల చెల్లింపునే పూర్తి చేయలేదని సమాచారం. ఈ సందర్భంగా భారత పరిశ్రమల సమాఖ్య చేసిన విలువైన సూచనను పరిగణనలోకి తీసుకోవడం ఎంతైనా ప్రయోజనదాయకం. జీతాల నిమిత్తం కంపెనీలకు రుణాలు ఇప్పించడం , జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న చిన్న సంస్థలను గుర్తించి వారి జీతాలను భరించడం, వందలోపు ఉద్యోగులు కలిగిన కంపెనీలకు రుణ వితరణ, కార్మిక బీమా కింద వచ్చేవారికి ఈ ఎస్ ఐ నుంచి జీతాల చెల్లింపు వంటి వాటిని కేంద్రం చేపట్టాలనే సూచనలు వెలువడుతున్నాయి. ఇందుకు అవసరమైన నిధులు వివిధ రూపాల్లో కేంద్రం వద్ద ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో వెంటనే సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి అమలు చేస్తే మాత్రమే లాక్ డౌన్ అనంతరం కొంతమేరకు పరిస్థితులు చక్కబడతాయి.

జీవితాలు ఛిద్రం…

అన్నిరంగాలు చిద్రమయ్యాయి. ముఖ్యంగా కూలీలు, భవననిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారి జీవన స్థితిగతులు తలకిందులయ్యాయి. వీరిని ఆదుకునేందుకు అవసరమైన పథకాలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఉపాధి హామీ నిధుల వంటివి వేల కోట్ల రూపాయల్లో ఉన్నాయి. భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మిక సంక్షేమ నిధులూ ఉన్నాయి. పీఎఫ్ కాతాల్లో ఎవరూ క్లెయిం చేయని సొమ్ములూ ఉన్నాయి. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల వరకూ ఆయా పద్దుల్లోని మొత్తం ఉండవచ్చని అంచనా. దీనిని పూర్తిగా వినియోగిస్తే కోట్లాది ప్రజలకు ప్రయోజనం సమకూరుతుంది. నిబంధనలు పక్కనపెట్టి అసాధారణ రీతిలో తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి నిధులను మళ్లించాలి. అప్పుడు మాత్రమే కాసింత ఉపశమనం దొరుకుతుంది. ఒక అంతర్జాతీయ కార్మిక అధ్యయన సంస్థ వేసిన అంచనా ప్రకారం భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది కి కరోనా తర్వాత ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. వారి మీద ఆధారపడినవారిని పరిగణనలోకి తీసుకుంటే అది 40 కోట్లకు చేరుతుంది. అంటే దేశ జనాభాలో మూడో వంతు మందికి జీవన భృతి కరవు అవుతుంది. దీని నుంచి బయటపడటం అంత సులభం కాదు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ ప్రణాళికతో రంగంలోకి దిగాల్సిందే.

ఆదర్శం కాదా..?

కొనుగోళ్లు, వస్తు వినిమయం సక్రమంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ కుదురుకుంటుంది. ప్రజల చేతిలో డబ్బు ఉంటేనే వస్తువులు కొంటారు. అందుకే ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రజల చేతిలోకి సొమ్ములు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చెల్లించాల్సిన రుణాలు వాయిదా వేయడం, కొత్త రుణాలు అందుబాటులోకి తీసుకురావడం, కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పించడం వంటివన్నీ అందులో భాగాలే. ప్రభుత్వ పన్నులను సైతం అవసరమైతే కుదించుకోవాలి. ద్రవ్య చెలామణిని పెంచాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకే జీతాల కోత విధిస్తున్నాయి. ప్రభుత్వరంగ, స్థానిక సంస్థలు అన్నిరకాల బకాయిల వసూలుకు ప్రజలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇంటికే పరిమితమై రోజువారీ ఆదాయం కరవైన వారు ఈ పన్నులను ఎలా చెల్లిస్తారనేది ప్రశ్న. ఒకవేళ రుణమో, పణమో చేసి చెల్లిస్తే వారి చేతులు ఖాళీ అయిపోతాయి.

అగమ్య గోచరం…

లాక్ డౌన్ ఎప్పటికి ఎత్తివేస్తారో తెలియదు. ప్రయివేటు కంపెనీలకు సుద్దులు చెప్పడం కంటే ప్రభుత్వాలుతాము ఆచరించి చూపించడం తక్షణ అవసరం. విద్యుత్తు, నీరు, ఇంటి పన్ను వంటి బకాయిలను వాయిదా వేయడం ద్వారా ఎంతో కొంత మొత్తం ప్రజల చేతిలో ఉంటుంది. లాక్ డౌన్ ఎత్తివేసే సమయానికి ప్రజల చేతిలో నిధులు ఉంటేనే వ్యవస్థ కు మంచిది. లేకపోతే దుకాణాల్లో సరుకులు ఉన్నా కొనే నాథుడు ఉండడు. మొత్తం వ్యవస్థ సజావుగా పట్టాలపైకి ఎక్కడానికి చాలా కాలమే పట్టవచ్చు. ఈలోపు ప్రజల్లో తీవ్ర నిరాశా నిస్ప్రుహలు కమ్ముకోకుండా ఉండాలంటే ప్రభుత్వం భరోసా ఇవ్వగలగాలి. బియ్యం పంపిణీ, కుటుంబానికి వెయ్యి రూపాయల సాయం వంటి చిన్నాచితక ప్రయోజనాలు ఏమూలకూ రావు. ప్రజల జీవన ప్రమాణాలు ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయాయి. ప్రభుత్వాలు ఇంకా దానిని గుర్తించడం లేదు. అందువల్ల వాస్తవిక థృక్పథంతో ప్రత్యామ్నాయ చర్యలతో ప్రజలలో వ్యయ సామర్థ్యం పెంచాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News