సెకండ్ వేవ్ గట్టిగానే కొడుతుందా?

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. చలికాలం, పండుగ సీజన్ లు కావడంతో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. అనేక [more]

Update: 2020-11-28 18:29 GMT

కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయినట్లే కన్పిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. చలికాలం, పండుగ సీజన్ లు కావడంతో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆలోచనలు ప్రారంభమయ్యాయి. కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లోని కొన్ని పట్టణాల్లో ఇప్పటికే కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కేసులు పెరుగుతుంటూ పోతే లాక్ డౌన్ తప్పదంటున్నారు.

గాలికి వదిలేసి…..

అనుకున్నట్లుగానే జరుగుతుంది. చలికాలంలో వైరస్ విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరించారు. అయితే హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రజలు కూడా కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే భారత్ లో కరోనా కేసులు కోటి దాటిపోయాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య భారత్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

అనేక రాష్ట్రాల్లో….

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఢిల్లీలో అయితే కేసుల సంఖ్య రోజుకు ఐదువేలకు పైగానే నమోదవుతున్నాయి. ఒక దశలో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో లాక్ డౌన్ ను విధించాలనుకున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే మరికొంత కాలం వెయిట్ చేయాలని నిర్ణయించారు. మాస్క్ లేకుంటే ఐదు వేల రూపాయల జరిమానాను ఢిల్లీ ప్రభుత్వం విధించడం కరోనా తీవ్రతకు అద్దంపడుతుంది.

ప్రస్తుతానికి రాత్రివేళ కర్ఫ్యూ……

హర్యానాలో రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి దీంతో ఈ నెలాఖరువరకూ అక్కడ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక మధ్యప్రదేశ్ లో భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రాట్లామ్, విదిశ జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లోనూ సూరత్, అహ్మదాబాద్, రాజ్ కోట్, వడోదరా, అహ్మదాబాద్ పట్టణాల్లో రాత్రివేళ కర్ఫ్యూ విధించారు. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News