థిక్కరించారో.. ఇక అంతే….!!

కోర్టు థిక్కరణ (contempt of court)… ఇటీవల కాలంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం. వినడానికి, చూడటానికి సాధారణంగా అనిపించినా దీని ప్రభావం, ప్రాధాన్యం చాలా ఎక్కువ. [more]

Update: 2019-02-24 18:29 GMT

కోర్టు థిక్కరణ (contempt of court)… ఇటీవల కాలంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం. వినడానికి, చూడటానికి సాధారణంగా అనిపించినా దీని ప్రభావం, ప్రాధాన్యం చాలా ఎక్కువ. న్యాయస్థానం ఉత్తర్వులను, ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించినా, అగౌరవ పర్చినా అది కోర్టు థిక్కరణ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానం తనంతట తాను (సుమోటో) గా చర్యలు తీసుకోవచ్చు. చట్ట ప్రకారం చర్యలు చేపట్టవచ్చు. 1971 నాటి కోర్టు థిక్కరణ చట్టం ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించింది. ఇటీవల సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేసిన మన్నెం నాగేశ్వరరావు, తాజాగా తెలంగాణ శాసనసభ న్యాయకార్యదర్శులు నరిసింహాచార్యులు, నిరంజనరావులు ఉద్దేశ్యపూర్వకంగా కోర్టు థిక్కరణకు పాల్పడ్డారంటూ న్యాయస్థానాలు వారిని శిక్షించాయి. జరిమానాలు విధించాయి. పూచీకత్తు అనంతరం విడుదల చేశాయి. కోర్టు థిక్కరణ చర్యలు న్యాయ ప్రతిష్టను పెంచగలవని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ విషయంలో…..

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య విభేదాల కారణంగా వారిని తొలిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అప్రధాన్య పోస్టులకు బదిలీ చేసింది. అలోక్ వర్మ స్థానంలో మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. తన తొలగింపుపై అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ సందర్భంగా న్యాయస్థానం తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు కొన్ని షరతులు విధించింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని, కీలకమైన ఉన్నతాధికారుల బదిలీలు చేయవద్దని స్పష్టంగా ఆదేశించింది. కానీ విధినిర్వహణలో నాగేశ్వరరావు ఒకింత క్రియాశీలకంగా వ్యవహరించారు. బీహార్ లోని వసతి గృహాల్లో బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎకే శర్మను తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు తొలగించారన్నది ఆయన ఎదుర్కొన్న ప్రధాన ఆరోపణ. తమ ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న అధికారి శర్మను బదిలీ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించారన్నది ఆయన ఎదుర్కొన్న అభియోగం. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం నాగేశ్వరరావుతో పాటు సీబీఐ కేసును వాదిస్తున్న బాసూరాంలకు కఠిన శిక్ష విధించింది. లక్ష జరిమానాతో పాటు రోజంతా న్యాయస్థానంలో ఒక మూలన కూర్చోమని ఆదేశించింది. సీబీఐ ఉన్నతాధికారులు శిక్ష, జరిమానాలను ఎదుర్కొనడం ఆ సంస్థ చరిత్రలో ఇదే ప్రధమం. జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నాగేశ్వరరావు మూలాలు ఏపీకి చెందినవి. కానీ ఆయన అనంతరకాలంలో తెలంగాణలోని వరంగల్ సమీపంలో స్థిరపడ్డారు. ధర్మాసనంలోని జస్టిస్ లావు నాగేశ్వరరావు గుంటూరు జిల్లా పెదనందిపాడు ప్రాంతానికి చెందిన వారు.

ఎవరూ అతీతులు కారు…..

కోర్టు థిక్కరణ కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1994లో నాటి మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కు సైతం సర్వోన్నత న్యాయస్థానం నాలుగు రోజుల శిక్ష విధించింది. బాబ్రీమసీదు కేసులో ఆకయన తన ఉత్తర్వులను ఉల్లంఘించింనందుకు శిక్ష విధించారు. 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు సుప్రీంకోర్టు కోర్టు థిక్కరణ నోటీసులు జారీ చేసింది. సౌమ్య అనే బాలికపై అత్యాచార, హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు సరిగా వ్యవహరించలేదన్నది జస్టిస్ కట్జూ అభియోగం. ఈ విషయంలో జస్టిస్ కట్జూ చివరికి క్షమాపణలు చెప్పడంతో ఆయనపై చర్యలను న్యాయస్థానం నిలిపివేసింది. 2017లో కోల్ కత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సహచర న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలకు గాను సుప్రీంకోర్టు కఠిన చర్యలు చేపట్టింది. ఆయనకు ఆరునెలల జైలు శిక్ష విధించింది. పదవీ విరమణ అనంతరం ఆయనపై చర్యలు చేపట్టారు. తాజాగా తెలంగాణ శాసనసభ,న్యాయ కార్యదర్శులు నరసింహాచార్యులు,నిరంజనరావులపై కూడా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివనాగేశ్వరరావు కోర్టు థిక్కరణ చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ, ఆలంపూర్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సస్పెన్షన్ వ్యవహారంలో తమ ఉత్తర్వులను నాటి స్పీకర్ మధుసూదనాచారి పట్టించుకోలేదన్నది హైకోర్టు అభిప్రాయం. ఈ విషయంలో స్పీకర్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నరసింహాచార్యులు, నిరంజనరావులను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపర్చాలని నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. ఆ మేరకు వారిద్దరినీ హైకోర్టు లో హాజరుపర్చారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. గతంలో ఈ ఉత్తర్వులను అమలు చేయని నల్గొండ, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీలను, డీజీపీని, నాటి స్పీకర్ మధుసూదనాచారిలపై సైతం కోర్టు థిక్కరణ ఉత్తర్వులు చేపట్టారు. అయితే ఈ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణ జరగనుంది. న్యాయస్థానం ఉత్తర్వుల అమలులో అలక్ష్యం, అశ్రద్ధ ఎంతమాత్రం తగదని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. శాసన,న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల్లో న్యాయశాఖ ప్రాధాన్యం అనన్యం. దీనిని తాజాగా అంచనా వేస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News