జగన్ ను ఇబ్బంది పెట్టాలనేనా?

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కార్యక్రమానికి సంబంధించిన ఫైలును కేంద్రం క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కింద‌ట జ‌మ్ము క‌శ్మీర్ వంటి కీల‌క రాష్ట్రాన్ని [more]

Update: 2019-08-15 12:30 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కార్యక్రమానికి సంబంధించిన ఫైలును కేంద్రం క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కింద‌ట జ‌మ్ము క‌శ్మీర్ వంటి కీల‌క రాష్ట్రాన్ని విడ‌గొట్టడం, ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డం వంటి సాహ‌సోపేత నిర్ణయాలు తీసుకుని మంచి జోష్‌పై ఉన్న కేంద్రంలోని బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై దృష్టి పెట్టిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. నిజానికి ఈ పున‌ర్విభ‌జ‌నను సాధ్యమైనంత త్వర‌గా పూర్తి చేయాల‌ని గతంలో ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణ‌లోని కేసీఆర్ ప్రభుత్వం కూడా కేంద్రంపై చాలా సార్లు ఒత్తిడి తెచ్చాయి.

తమకు సానుకూలంగా ఉండేలా….

ముఖ్యంగా ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు ఇది జ‌రిగి ఉంటే.. త‌మ‌కు లాభిస్తుంద‌ని, ఇత‌ర పార్టీల నుంచి త‌మ పార్టీల్లోకి వ‌చ్చిన వారికి సీట్లు స‌ర్దు బాటు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వీరు భావించారు. అయితే, అప్పట్లో ఈ విష‌యంపై సాచివేత ధోర‌ణిని అవ‌లంబించిన మోడీ, అమిత్ షాలు.. ఇప్పుడు మాత్రం తీవ్రంగా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ద‌క్షిణాదిలో పార్టీని విస్తరించాల‌ని భావిస్తున్న బీజేపీ త‌న‌కు అనుకూలంగా లేదా త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌కు అనుకూలంగాచ‌క్రం తిప్పాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న విష‌యాన్ని చూస్తే.. కేంద్రానికి పూర్తి అధికారాలు ఉన్నప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లోని పాల‌క పార్టీల అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ముందుకు సాగాలి.

అక్కడ బలపడేందుకు….

అయితే, ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం టీడీపీతో అంత‌ర్గతంగా జ‌రుగుతున్న మైత్రిని బీజేపీ ఉప‌యోగించుకుంటోంద‌ని, లేదు… బీజేపీతో అంట‌కాగాల‌ని భావిస్తున్న టీడీపీ దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తోంద‌ని అధికార పార్టీ వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ జ‌గ‌జ్జేయ విజ‌యాన్ని కైవ‌సం చేసుకుంది. టీడీపీ కంచుకోట‌ల‌ను కూడా బ‌ద్దలు కొట్టుకుని త‌న పునాదులు ప‌టిష్టం చేసుకుంది. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టడం ద్వారా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ను విడ‌గొట్టడం ద్వారా వైసీపీ కూసాలు క‌దిలించాల‌ని త‌ద్వారా మీరో మేమో ఎవ‌రో ఒక‌రు బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని బాబుకు మిత్రులుగా ఉన్న కొంద‌రు కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న వారుచెబుతున్నట్టు తెలుస్తోంది.

టీడీపీకి సహకరిస్తుందా…?

దీనిపై వైసీపీ శ్రేణులు కొంత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో బీజేపీ ఏం చేస్తుందో.. ఏపీలో ఏం జ‌రుగుతుందో చూడాలి. గ‌తంలో 2009లోనూ వైఎస్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ జ‌రిగిన‌ప్పుడు టీడీపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను విడ‌గొట్టి పార్టీని బ‌ల‌హీన ప‌రిచిన విష‌యం ఇప్పుడు ప్రస్థావ‌నార్హం. మ‌రి ఇదే జ‌రిగితే.. జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారు ? చ‌ంద్రబాబుకు ఈ ప‌రిణామం నిజంగానే క‌లిసి వ‌స్తుందా ? బీజేపీ త‌న వ్యూహంతో ఇక్కడ బ‌ల‌ప‌డుతుందా ? అనే విష‌యాలు ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News