జగన్ మీద కుట్ర జరుగుతోందా?

వైసీపీ సర్కార్ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏపీని ఓ విధంగా ఊడ్చేసిందనే చెప్పాలి. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు అంటే మాటలా. దేశంలో అతి [more]

Update: 2019-11-20 08:00 GMT

వైసీపీ సర్కార్ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏపీని ఓ విధంగా ఊడ్చేసిందనే చెప్పాలి. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు అంటే మాటలా. దేశంలో అతి తక్కువమంది సాధించిన రేర్ ఫీట్ ఇది. ఈ రకమైన అద్భుత విజయానికి జాతి మొత్తం ఏపీ వైపు ఆసక్తిగా చూసింది. జగన్ గెలిచిన తరువాత మొదటి సారిగా ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధాని మోడీ ఆయన్ని హత్తుకుని చూపిన అభిమానం ఎవరూ మరచిపోరు. అయితే రాజకీయాలు ఒక్కలా ఎపుడూ ఉండవు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి ఏపీలోని వైసీపీకి మధ్యన ఏవో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. జగన్ జైలుకు వెళ్తాడని, ఏపీలో పాలన చేతులు మారుతుందని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఒక్కటే న్యూస్ వైరల్ అవుతోంది. ఎవరు పోస్టింగులు పెడుతున్నారో తెలియదు కానీ జగన్ మీద ఇపుడు నెగిటివిటీ పెంచేందుకు ఒక పధకం ప్రకారం కధ సాగుతోందని తెలుస్తోంది.

కుట్ర చేస్తున్నారన్న మంత్రి…..

ఏపీలో ఆరు నెలలుగా వైసీపీ చక్కని పాలన అందిస్తుంటే తెలుగుదేశం పార్టీ సహించలేకపోతోందని విశాఖకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ మీద పధకం ప్రకారం జరుగుతున్న ఈ దాడిని తాము గమనిస్తున్నామంటూ అవంతి చేసిన హాట్ కామెంట్స్ అంతటా చర్చనీయాంశమయ్యాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ , వైసీపీల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని అవంతి అంటున్నారు. వైసీపీ, బీజేపీల మధ్య సఖ్యత చెడితే మధ్యలో తాను దూరాలని చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారని కూడా అవంతి ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న కుట్రలను తాము తిప్పికొడతామని కూడా ఆయన గట్టిగా చెబుతున్నారు. ఒకనాడు మోడీని నానామాటలు అన్న చంద్రబాబు ఇపుడు పొగడడం దేనికి సంకేతం అని అవంతి ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియానికి, మతానికి మధ్య సంబంధం ఏంటిఅని కూడా అవంతి నిగ్గదీస్తున్నారు.

తాడా.. పామేనా…?

రాజకీయాల్లో ఉన్న వారికి అనుమానాలు, అభద్రతాభావాలు ఎక్కువ. తాడుని చూసి పాము అనుకుంటారు. అయితే దాన్ని ముందు జాగ్రత్త అని కవర్ చేసుకుంటారు. అయితే టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా వైసీపీలో ఇపుడు అభద్రతాభావం మొదలైందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఇది టీడీపీ మైండ్ గేమ్ లో భాగమా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే బంపర్ మెజారిటీతో గెలిచిన ఏపీ సర్కార్ ని అస్థిర పరచే సాహసం ఎవరూ చేయబోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే అది బూమరాంగ్ అవుతుందని, చెబుతూ గతంలో ఎన్టీయార్ ని పదవీచ్యుతి చేసిన సంఘటనలు కూడా గుర్తు చేస్తున్నారు. అయితే విపక్షం అన్న తరువాత ఏమైనా అంటుంది. ఏమైనా చెబుతుంది. ప్రభుత్వంలో ఉన్న వారు సర్దుకోవాల్సివుంటుంది. కుట్రలు చేయడం అంటే చిన్న మాట కాదు, ఇపుడు ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రజాస్వామ్యం కూడా బాగా వికసిస్తోంది. అందువల్ల చీకటి రాజకీయాలు చేయించాలనుకున్న, చేయాలనుకున్నా కూడా కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంత్రి అవంతి మాటలు మాత్రం రాజకీయాల్లో ఒక చర్చకు అవకాశం కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News