జగన్ ను ఓడించడమే ధ్యేయంగా..!

130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా అంటే ఉంది అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీ ఏపీలో కోలుకోలేని దెబ్బతిన్నది. [more]

Update: 2019-01-29 02:30 GMT

130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా అంటే ఉంది అన్నట్లుగా తయారైంది. రాష్ట్ర విభజనతో ఆ పార్టీ ఏపీలో కోలుకోలేని దెబ్బతిన్నది. అయితే, అంతకుముందు ఆ పార్టీకి జగన్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి జగన్ పార్టీకి దూరమైనప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నామమాత్రమైంది. ఇక, విభజన దెబ్బకు ఏకంగా గల్లంతైంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని ఆ పార్టీ ఈసారి మరోసారి అదృష్టం పరీక్షించుకుంటోంది. అయితే, ఈ ఎన్నికల్లో తాము గెలవడం కంటే ప్రత్యర్థి ఓడటమే టార్గెట్ గా పెట్టుకున్నారట కొందరు కాంగ్రెస్ నాయకులు. అయితే, ఇక్కడ ప్రత్యర్థి అంటే మూడున్నర దశాబ్దాలుగా ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కాదు. తమను ఆంధ్రప్రదేశ్ లో మొదటి దెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డినే కాంగ్రెస్ ప్రత్యర్థిగా భావిస్తోంది. టీడీపీతో కాంగ్రెస్ కు అవగాహన కుదరడంతో ఏపీ కాంగ్రెస్ లోని కొందరు నేతలు ‘టార్గెట్ జగన్’ అంటున్నారు. అందులో భాగంగానే పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సహా తులసి రెడ్డి వంటి కొందరు నేతలు ఛాన్స్ దొరికితే చాటు జగన్ పై ఒంటికాలితో లేస్తున్నారు.

జగన్ ఓడితే మనం గెలిచినట్లే…

ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ… రాజశేఖర్ రెడ్డి వేరు.. జగన్ వేరు.. జగన్ మన ప్రత్యర్థి అంటూ స్పష్టంగా తేల్చిచెప్పారు. అయినా, జగన్ ను పెద్దగా టార్గెట్ చేయని ఆ పార్టీ నేతలు ఇప్పుడు టీడీపీతో అవగాహన కుదిరాక మాత్రం పూర్తిస్థాయిలో జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. జగన్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలనే అక్షరం కూడా పొల్లుపోకుండా కాంగ్రెస్ నేతల నోళ్లలో నుంచి వస్తున్నాయి. ఇక, వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అయితే జగన్ ను పూర్తిగా రాజకీయ శత్రువుగా భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పదే పదే వైసీపీని బ్రోకర్ పార్టీగా పేర్కొంటున్నారు. మరికొందరు కాంగ్రెస్ నేతలదీ ఇదే శైలి. ముఖ్యంగా జగన్ టీడీపీతో కుమ్మక్కయ్యారని, అందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారనే వాదన వినిపిస్తున్నారు. అయితే, యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడినప్పుడు జగన్ జైలులో ఉండి కూడా ఆయనకే మద్దతు ఇచ్చారనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచిపోయారు.

కాంగ్రెస్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

ఇక, ఎన్నికల్లో జగన్ ఓటమి దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందుకోసం అన్ని స్థానాల్లో పోటీ చేసి సాధ్యమైన్ని ఓట్లు చీల్చడం ద్వారా జగన్ విజయావకాశాలను దెబ్బతీయాలని స్కెచ్ వేస్తున్నారట. జగన్ ఓటుబ్యాంకు పూర్తిగా కాంగ్రెస్ దే అని తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థులు బాగా ప్రచారం చేయడం ద్వారా జగన్ కు ఎక్కువగా పడే.. రెడ్డి, దళిత, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను చీల్చాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని పదే పదే ఆరోపణలు వెనుక కూడా వ్యూహం ఇదేనట. జగన్ ఓడిపోతే కాంగ్రెస్ ఎలాగూ గెలవకున్నా.. తమ స్నేహితుడు చంద్రబాబు గెలుస్తాడనేది కాంగ్రెస్ కోరిక. ఆయన ఎలాగూ కేంద్రంలో కాంగ్రెస్ కే మద్దతు ఇస్తారు కాబట్టి రాష్ట్రంలో పోయినా కేంద్రంలో మేలు జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కోరిక కూడా పెద్దగా నెరవేరే అవకాశం లేదంటున్నారు. ఓట్లు చీల్చగలిగే స్థాయిలో బలం ఉన్న నేతలు చాలావరకు ఇప్పటికే టీడీపీలోనో, వైసీపీలోనో లేదా జనసేన లోనో చేరిపోయారు. మరికొందరు కూడా చేరిపోతున్నారు. దీంతో గత ఎన్నికల కంటే కూడా ఆ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. మరి, ఈ పరిస్థితుల్లో జగన్ ను ఓడించాలని కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. అయితే, తమ జగన్ ను టార్గెట్ చేయడం నచ్చని కొంతమంది నేతలు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు.

Tags:    

Similar News