కాంగ్రెస్ అంటరానిదిగా మారిపోయిందా?

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆపసోపాలు పడుతుంది. ప్రాంతీయ పార్టీల వెనక తోకలాగా కాంగ్రెస్ మారిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి [more]

Update: 2020-12-05 17:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆపసోపాలు పడుతుంది. ప్రాంతీయ పార్టీల వెనక తోకలాగా కాంగ్రెస్ మారిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి ధీటుగా కూటమి ఏర్పాటు ఈసారి సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సాధారణ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికల నాటికి బీజేపీ మరింత పుంజుకునే అవకాశముంది. దీంతో పాటు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు కూడా కాంగ్రెస్ కు కఠిన పరీక్ష కానున్నాయి.

అన్ని పార్టీలూ…..

నిజానికి ఎన్డీఏ కూటమిలో కూడా ఏ పార్టీలు లేవు. ప్రస్తుతం జేడీయూ వంటి పార్టీలే ఉన్నాయి. శివసేన వంటి పార్టీలు కూడా ఎన్డీఏనుంచి తప్పుకున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో అన్ని పార్టీలూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉండేవి. కాంగ్రెస్ తో వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీలు వంటివి కలసి నడిచేవి. అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

వివిధ రాష్ట్రాల్లో…

పశ్చిమ బెంగాల్, అస్సోం, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో తప్పించి మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో నడిచి వెళ్లాల్సిందే. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు కూడా రెండేళ్లలో జరుగుతున్నాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పింది. బీఎస్పీ కూడా ఒంటరిగా బరిలోకి దిగుతానని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు ఏ పార్టీ సుముఖత వ్యక్తం చేయదు.

నాయకత్వం బలహీనంగా….

మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం బలహీనంగా ఉండటం కూడా కూటమి ఏర్పాటు ఈసారి కష్టమేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా వేదికను ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం ఉండదన్న పెదవి విరుపులు విన్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కలుపుకోవాలని ప్రయత్నించినా కూటమి సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటి అత్యధిక స్థానాలను సాధించగలిగితేనే ప్రాంతీయ పార్టీలు హస్తం వైపు చూస్తాయి. లేకుంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ దిక్కు చూడనే చూడవు.

Tags:    

Similar News