కాంగ్రెస్ పిలుస్తోంది.. జగన్..?

కాంగ్రెస్..జాతీయ పార్టీ. జగన్ కి తల్లి లాంటి పార్టీ. ఆ మాటకు వస్తే ఏపీలో ఉన్న కీలకమైన నాయకులందరికీ కాంగ్రెస్ తో సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్, చంద్రబాబు, [more]

Update: 2020-09-05 15:30 GMT

కాంగ్రెస్..జాతీయ పార్టీ. జగన్ కి తల్లి లాంటి పార్టీ. ఆ మాటకు వస్తే ఏపీలో ఉన్న కీలకమైన నాయకులందరికీ కాంగ్రెస్ తో సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్, చంద్రబాబు, జగన్ రాజకీయం మొదలైంది కూడా కాంగ్రెస్ నుంచి. ఇక అందరి కంటే జగన్ కి కాంగ్రెస్ తో ఎక్కువ బంధం ఉంది. కారణం ఏంటి అంటే ఆయన తండ్రి వైఎస్సార్ మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు పీసీసీ చీఫ్ గా, రెండు సార్లు సీఎం గా అవకాశం పొందారు. తండ్రి అంత స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేయబట్టే జగన్ కి కూడా జనంలో ఆ పేరు వచ్చింది. ఆ పెట్టుబడే జగన్ రాజకీయ జీవితానికి ఇంధనం అయింది. మొత్తానికి కాంగ్రెస్ జగన్ కి చేసిన అన్యాయం పక్కన పెడితే జగన్ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ కొంత భాగం ఉందన్నది ఒప్పుకుని తీరాలి.

స్వయంకృతమేనా ?

వైఎస్సార్ చనిపోయాక సోనియాగాంధీ చెప్పుడు మాటలు విని యువనేత జగన్ ని దూరం చేసుకుంది. ఆయన వేరే పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయారు. అంతటితో ఊరుకుంటే ఫరవాలేదు కానీ సీబీఐ విచారణ పేరిట కేసులు బనాయించి జగన్ ని జైలు పాలు చేయడం మాత్రం ఎవరూ క్షమించలేని విషయం. ఈ కారణంగానే జగన్ కాంగ్రెస్ అంటే ఆమడదూరం జరుగుతున్నారు. పైగా జాతీయ స్థాయిలో తన పార్టీ సిధ్ధాంతాలకు ఏ మాత్రం పొసగని బీజేపీతో కలసి ప్రయాణం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేజేతులా చేసుకున్న ప్రారబ్ధంగానే చూడాలి. ఇక జగన్ ని ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా కూడా తట్టుకుని నిలబడ్డారు. తాను కోరుకున్న సీఎం కుర్చీ సంపాదించారు. ఇక జగన్ కి ఎదురులేదన్న స్థితిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ లేనంత దయనీయ స్థితిలో ఇపుడు ఉంది.

కలుపుకోవాలట…

సోనియాగాంధీకి ఓ మంచి సలహా కొత్త మిత్రుడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇచ్చారు. ఆ సలహా వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అసలు సాధ్యమయ్యేలా లేదు. దేశంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ మళ్ళీ దగ్గరకు తీయాలంట. వారిని కలుపుకుని ముందుకు సాగాలట. అపుడే కాంగ్రెస్ కి ఉజ్యల భవిష్యత్తు ఉంటుందిట. అంతే కాదు, కేంద్రంలోని బీజేపీని ఢీ కొట్టి అధికారంలోకి కూడా వస్తుందిట. అలా జగన్, మమతా బెనర్జీ వంటి వారిని కాంగ్రెస్ వైపుగా ఆకర్షించాలన్నది ఈ విలువైన సూచన.

రాజీ పడుతారా….?

కాంగ్రెస్ కి జగన్ అవసరం ఉంది కానీ జగన్ కి కాంగ్రెస్ అవసరం ఇపుడు లేదు. నిజం చెప్పాలంటే నాలుగున్నరేళ్ళ పాటు యూపీయే సర్కార్ అధికారంలో ఉన్నపుడే జగన్ రాజీపడలేదు, ఇక ఎపుడు అధికారంలోకి వస్తుందో అసలు రాదో కూడా తెలియని కాంగ్రెస్ తో జగన్ ఎందుకు రాజీపడాలి. తన అవమానాలు భరించి మరీ సోనియమ్మ, రాహుల్ గాంధీ భజన ఎందుకు చేయాలి. అలా చేసి ఏపీలో కాంగ్రెస్ ని బలోపేతం చేసి తన ఓటు బ్యాంక్ కి చిల్లు ఎందుకు పెట్టుకోవాలి. ఇది ఎవరైనా చేస్తారా. జగన్ లాంటి వారి నుంచి ఇది ఊహించగలరా.

ముగిసిన అధ్యాయమే….

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇపుడు చీలికలు పేలికలుగా ఉంది. సోనియా రాహుల్ శకం దాదాపుగా ముగిసేలా సీన్ ఉంది. రేపటి రోజున దేశంలో బీజేపీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు సమాఖ్యగా ముందుకు వస్తే జగన్ మరింత ఎత్తున జాతీయ రాజకీయాల్లో నిలుస్తారు. అందువల్ల జగన్ కాంగ్రెస్ పిలిచినా అ వైపుగా వెళ్ళరు, చూడరు, అది ముగిసిన అధ్యాయంగానే చూడాలి. అయితే కాంగ్రెస్ జగన్ బంధం అంటారా, ఒకనాడి వైఎస్సార్ ని ఆదరించిన కాంగ్రెసే జగన్ ని దారుణంగా అవమానించింది కాబట్టి చెల్లుకు చెల్లూ అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి తన కాళ్ళ దగ్గరకు కాంగ్రెస్ పెద్దలు రాకపోయినా వచ్చినంత పని చేయించుకున జగన్ ఈ పదేళ్ళ పోరులో అసలైన విజేతగా నిలిచార‌నే చెప్పాలిగా.

Tags:    

Similar News