వీళ్లకు ఆ ఛాయిస్ ఉంటుందా..?

తెలంగాణ కాంగ్రెస్ లో హేమాహేమీల్లాంటి నాయకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి. పలువురు సీనియర్ నాయకులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పలువురు నాయకులు మొదటిసారి [more]

Update: 2019-01-03 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో హేమాహేమీల్లాంటి నాయకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి. పలువురు సీనియర్ నాయకులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పలువురు నాయకులు మొదటిసారి ఓటమిని చవిచూడగా కొందరైతే రెండో, మూడో విజయాన్ని కూడా మూటగట్టుకున్నారు. అయితే, ఇలా ఓడిపోయిన వారిలో చాలా మంది రానున్న లోక్ సభ ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఈ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే, ఎమ్మెల్యేగానే ఓడిపోయిన వ్యక్తులకు లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని పలువురు నేతలకు లోక్ సభ టిక్కెట్లు ఇస్తామనే హామీ అధిష్ఠానం ఇచ్చింది. దీంతో ఇప్పుడు తమకు కాకుండా మళ్లీ ఓడిపోయిన నాయకులకు ఎక్కడ టిక్కెట్లు ఇస్తారోనని వారు టెన్షన్ పడుతున్నారు.

నలుగురు నేతల భవిత ఎంటో

ఎంపీగా పోటీ చేయాల్సిన పలువురు నేతలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందనో మరో కారణమో కానీ అసెంబ్లీ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో ఎంపీలుగా ఉండి 2014లోనూ ఎంపీలుగా పోటీచేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి, సురేష్ షేట్కర్ నారాయణఖేడ్ నుంచి పోటీ చేశారు. వీరిద్దరు భారీ తేడాతో ఓడిపోయారు. ఇక కేంద్రమంత్రిగా పనిచేసిన బలరాంనాయక్ కూడా మహబూబాబాద్ నుంచి పోటీచేసి గట్టి పోటీ ఇచ్చినా ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యానారయణ కూడా కంటోన్మెంట్ లో భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయన వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో ఓడిపోయారు. అంటే 2014 నుంచి వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. దీంతో వీరికి రానున్న లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఓడిన వారు ఆరు నెలల్లోనే ఎంపీలుగా గెలుస్తారా అనేది పలువురు కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

తాజా మాజీల ఆశలు…

ఇక, మాజీ మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ నల్గొండ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్నారు. అయితే, అక్కడ సూర్యాపేట అసెంబ్లీ టిక్కెట్ ఆశించిన భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ టిక్కెట్ ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. దీంతో ఓడిపోయిన నేతలు తన టిక్కెట్ ఎసరు పెడతారేమోనని ఆయన టెన్షన్ పడుతున్నారు. ఇక మహబూబ్ నగర్ ఎంపీ టిక్కెట్ ను అసెంబ్లీకి ఓడిపోయిన డీకే అరుణ, రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే, అక్కడ మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కాదని వీరిద్దరిలో ఎవరికైనా టిక్కెట్ దక్కే అవకాశం తక్కువే. అయితే, అసెంబ్లీకి ఓడిపోయిన వారికి పార్లమెంటు టిక్కెట్లు ఇవ్వడం సరికాదనే వాదన పలువురు వినిపిస్తున్నారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ హవా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఉండే అవకాశం ఉంది. దీంతో అసలు ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి పార్లమెంటుకు పోటీ చేసేందుకు అసలు పోటీ ఉంటుందా లేదా పార్టీనే అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందా అనే అంచనాలూ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎన్నిసార్లు ఓడినా సరే మళ్లీ వీరికే టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది.

Tags:    

Similar News