అందరి దారీ అక్కడికేనా…?

కాంగ్రెస్ అగ్ర నేతలందరిదీ ఒకే దారి. అదే తీహార్ జైలు. తీహార్ జైలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వరసబెట్టి కాంగ్రెస్ నేతలు తీహార్ [more]

Update: 2019-09-21 17:30 GMT

కాంగ్రెస్ అగ్ర నేతలందరిదీ ఒకే దారి. అదే తీహార్ జైలు. తీహార్ జైలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వరసబెట్టి కాంగ్రెస్ నేతలు తీహార్ జైలు బాట పడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలయింది. తీహార్ జైలుకు ఒక విశిష్టత ఉంది. ఇక్కడ రాజకీయనేతలతో పాటు కరడు కట్టిన ఉగ్రవాదులు, హంతకులు, ఉద్యమకారులను కూడా ఇక్కడే ఉంచుతారు. ఢిల్లీ పట్టణానికి అతి సమీపంలో ఉన్న తీహార్ జైలు వద్దకు తమ నేతలను చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు బారులు తీరుతున్నాయి.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో…..

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు. ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వివిధ కేసులు నమోదు చేసింది. సీబీఐ కూడా విడిగా కేసు నమోదు చేసింది. ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించకపోవడంతో తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయన తన 74వ పుట్టినరోజును కూడా తీహార్ జైలులోనే చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు మాత్రం కోర్టు అనుమతిచ్చింది. చిదంబరం మనీ ల్యాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు.

ఆస్పత్రి నుంచి అక్కడికే…..

ఇక కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కూడా మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఈయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఆరోగ్య కారణాలతో ఆయన మొన్నటి వరకూ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే డీకే శివకుమార్ ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన కూడా తీహార్ జైలులోనే ఉన్నారు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో…..

అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ మేనల్లుడు రతుల్ పూరీ కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలి కాప్టర్ కేసులో ఈయనను ఈడీ అరెస్ట్ చేసింది. రతుల్ పూరీ గతంలో ఈడీ విచారణకు హాజరయినట్లే హాజరయి తప్పించుకుని వెళ్లిపోయారు. దీంతో ఆయనను ఇటీవల అరెస్ట్ చేశారు. తీహార్ జైలుకు తరలించారు. రతుల్ పూరీ అక్టోబరు 1వ తేదీ వరకూ తీహార్ జైలులోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇలా తీహార్ జైలు కాంగ్రెస్ పార్టీకి కేంద్రంగా మారిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News