మళ్లీ అధికారంలోకి రావాలని..?

దేశంలో లోక్ సభ స్థానాల సంఖ్య పెరగబోతోందని కాంగ్రెసు పార్టీ కస్సుబుస్సులాడుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య పెరగాలని ఎప్పటి నుంచో డిమాండ్ [more]

Update: 2021-07-28 15:30 GMT

దేశంలో లోక్ సభ స్థానాల సంఖ్య పెరగబోతోందని కాంగ్రెసు పార్టీ కస్సుబుస్సులాడుతోంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ సంఖ్య పెరగాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఏడో దశకం నుంచి 543 వద్దనే స్థానాలకు పరిమితులు విధించారు. జనాభా చూస్తే అప్పటికి రెట్టింపయ్యింది. సగటున పాతికలక్షల మంది జనసంఖ్యకు ఒక లోక్ సభ సభ్యుడు ప్రాతనిధ్యం వహిస్తున్నాడు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ సంఖ్య. మనదేశంలో నాలుగోవంతు జనాభా ఉన్న అమెరికాలో మనతో సమానంగా కేంద్ర చట్టసభల సభ్యులున్నారు. మరి మనమెందుకు పెంచుకోవడం లేదనే ప్రశ్నకు చాలాకాలంగా ఒకే ఒక వాదన వినవస్తోంది. విభిన్న ప్రాంతాలు, రాష్ట్రాలు ఉన్న దేశం కావడంతో సభ్యుల సంఖ్య పెంచడంలో ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా గందరగోళానికి దారితీస్తుంది. జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం తగ్గడానికి ఒప్పుకోవు. మరోవైపు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీగా లబ్ది పొందే అవకాశాలున్నాయి. అందుకే ఏకాభిప్రాయం కష్టం. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని చాలాకాలంగా పెండింగులో పెడుతూ వస్తోంది. తాజాగా దీనికొక ముగింపు పలకాలని బీజేపీ బావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దక్షిణాదికి ఇబ్బందే…

2008లో దేశంలో లోక్ సభ స్థానాల పునర్విభజన చోటు చేసుకుంది. రాష్ట్రాల వారీ సభ్యుల సంఖ్యను కుదించకుండా ప్రాంతాలవారీ సర్దుబాట్టు చేశారు. లోక్ సభలో రాష్ట్రాలవారీ ప్రాతినిధ్యంలో తేడా లేకుండా ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లోక్ సభ స్థానాలను పునర్విభజన చేశారు. ఆంధ్రప్రాంతంలో అప్పటికి 28 స్థానాలు, తెలంగాణలో 14 స్థానాలు ఉండేవి. జనాభా ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రపాంతంలో మూడు స్థానాలు తగ్గించి తెలంగాణలో మూడు స్థానాలు పెంచారు. మొత్తమ్మీద అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాతినిధ్యంలో తేడా లేకుండా విభజన చేశారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ అదే పద్దతి పాటించారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని యూనిట్ గా చేసుకుని పునర్విభజన చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల వారీగా విడిగా పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేస్తే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు కొంత మేరకు నష్టపోయే అవకాశాలున్నాయి. కేంద్ర చట్టసభలో తమ ప్రాతినిధ్యం కుదించుకుపోతుంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలలో సీట్లు తగ్గే అవకాశాలున్నాయి.

కమలం కొలనులో….

వాస్తవానికి సభ్యుల సంఖ్య పెంచాలనే విషయంలో కాంగ్రెసు పార్టీ గతంలో ప్రయత్నాలు చేసింది. కానీ ఫలించలేదు. 2026 వరకూ ఈ సంఖ్య యథాతథంగా ఉంచాలనేది గతంలో వెలువడిన వాదన. కాంగ్రెసు పార్టీకి బలమైన మెజార్టీ కూడా లేకపోవడంతో పార్లమెంటులో వ్యతిరేకత వ్యక్తమవుతుందనే సందేహంతో పక్కన పెట్టేసింది. బీజేపీ దేశంపై పట్టు బిగించేందుకు సభ్యుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అబిప్రాయపడుతున్నాయి. ఆ పార్టీకి బాగా పట్టు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి చోట్ల బారీగా సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. అందువల్ల కేంద్రంలో స్థిరమైన సంఖ్యలో అధికారానికి వీలవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ పావులు కదుపుతోందంటున్నారు. రాజకీయ లక్ష్యం సాధించడానికి , భవిష్యత్తులో ప్రతిపక్షాలకు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా ఈ ఎత్తుగడ వేస్తోందనేది సందేహం. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనంలో వెయ్యిసీట్లకు రూపకల్పన చేయడమే మొత్తం అనుమానాలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా జనాభా పెరిగేకొద్దీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచాల్సిన అవసరమైతే ఉంది.

జమిలీకి ప్రత్యామ్నాయమా..?

జమిలీ ఎన్నికలతో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని గతంలో కేంద్రం ప్రయత్నించింది. కానీ చాలా వరకూ రాష్ట్రాలు సానుకూలంగా లేకపోవడం, రాజ్యసభలో పూర్తిస్థాయి ఆధిక్యం కరవుకావడంతో సాధ్య పడలేదు. దానికి ప్రత్యామ్నాయమే ప్రస్తుత ప్రతిపాదన అంటున్నారు. చట్ట సభలో విప్లవాత్మక మార్పుగా సభ్యుల సంఖ్య పెంపుదలను ప్రజలముందుకు తీసుకెళ్లాలనేది బీజేపీ యోచనగా చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ దీనితో విభేదిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ తనకు అనుకూలంగా పెంపుదల విధి విధానాలు రూపొందించుకునే ప్రమాదం ఉందని అనుమానిస్తోంది. ఇప్పుడిప్పుడే విపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వస్తున్నాయి. వాటిలో ఐక్యతను చెడగొట్టేందుకు సైతం బీజేపీ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తుందేమోనని హస్తం పార్టీ సందేహం . ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో బారీగా సబ్యుల సంఖ్య పెరగాలని ఆశిస్తున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన దేశాన్ని యూనిట్ గా తీసుకోవడానికి విభేదిస్తున్నాయి. అందుకే ఇప్పట్లో ఏకాభిప్రాయం రాకపోవచ్చు. అయితే సీట్ల సంఖ్య పెంపుదలకు కేంద్రానికి తగిన అవకాశం కనిపిస్తోంది. భారత స్వాతంత్య అమృతోత్సవం వచ్చే ఏడాది జరగబోతోంది.. ఈ సందర్భానికి పెంపు ప్రతిపాదనలు సిద్దం చేయవచ్చనేది ఢిల్లీ వర్గాల సమాచారం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News