బాబు వ్యూహంతో ప్రమాదంలో పడిందా…?

తెలుగుదేశం పార్టీతో పొత్తుతో తమకు పూర్వవైభవం దక్కుతుందని భావించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల ఆశలు అడియాసలే అయ్యేలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండే అవకాశాలు లేకపోగా [more]

Update: 2019-01-24 11:00 GMT

తెలుగుదేశం పార్టీతో పొత్తుతో తమకు పూర్వవైభవం దక్కుతుందని భావించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల ఆశలు అడియాసలే అయ్యేలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండే అవకాశాలు లేకపోగా పార్టీ మరింత బలహీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీపై పెద్దగా ఆశలు లేకున్నా ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వారు ఉండాలని రాష్ట్ర నేతలు భావించారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఇది సులువవుతుందని అంతా అనుకున్నారు. అనేక ఏళ్లు జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేతలు పొత్తుపై ఆశలు పెట్టుకుని తిరిగి చట్టసభల్లోకి ప్రవేశించాలనుకున్నారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి ఓడిపోవాల్సి వస్తుందని తెలుగుదేశం భావిస్తోంది. అందుకే పొత్తు లేనిదే మంచిదనుకుంటోంది. పొత్తు ఉండాలా లేదో చంద్రబాబు నిర్ణయానికి వదిలేసినట్లుగా, టీడీపీకి మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పినట్లు జరుగుతున్న ప్రచారమే కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఉండదు అనేదానికి ఒక సూచిక అంటున్నారు.

పొత్తు ఉండదని తేలడంతో…

కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టీడీపీని సైతం దెబ్బతీసే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు ఉన్నందున వారందరికీ సీట్లు ఇవ్వాల్సి వస్తోంది. అలా కాంగ్రెస్ పోటీచేసే స్థానాలు ఎక్కువగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. అదే, కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో పాటు జగన్ ఓటుబ్యాంకుకు గండి పడుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీకి పొత్తు ఉండదనేది స్పష్టమవుతోంది. మొన్నటివరకు పొత్తు ఉంటుందని భావించిన కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు పొత్తు ఉండే సూచనలు లేకపోవడంతో తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కాంగ్రెస్ ముఖ్యనేతలు, బలం ఉన్నవారిని టీడీపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఎన్నికల వేళ మరింత డీలా…

ఇప్పటికే మాజీ మంత్రి కొండ్రు మురళిని పార్టీలో చేర్చుకుని రాజాం స్థానాన్ని కేటాయించారు. రేపోమాపో కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అహ్మదుల్లా, డీఎల్ రవీంద్రారెడ్డిలకు కూడా పసుపు కండువా కప్పేయనున్నారు. ఇక కర్నూలులో బలమైన నాయకులుగా ఉన్న కోట్ల కుటుంబాన్ని కూడా టీడీపీ గూటికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఎలాగూ టీడీపీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవడం కష్టమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నా… సీటు విషయంలో స్పష్టమైన హామీ దక్కక ముందడుగు వేయలేకపోతున్నారు. మైదుకూరు వైసీపీ టిక్కెట్ ఆశించిన డీఎల్ రవీంద్రారెడ్డి… అక్కడ ఛాన్స్ లేకపోవడంతో టీడీపీ వైపు చూస్తున్నారు. మొత్తానికి ఇప్పటికే ఐదేళ్లుగా ఉన్నారా లేరా అన్నట్లు ఉన్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ తమ దారి తాము వెత్తుకోవడమే మేలనే ధోరణిలో ఉన్నారు. ఇక, ఇదిలా ఉండగా టీడీపీతో పొత్తు లేకున్నా స్నేహం ఉండటంతో ఇప్పుడు అధికార పార్టీని సైతం విమర్శించలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. కనీసం ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టయినా ఉనికిని కాపాడుకునే అవకాశం కూడా లేదు. మొత్తానికి ఎన్నికల వరకు కాంగ్రెస్ మరింత బలహీనమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News