ఈ రాష్ట్రంపై గట్టి ఆశలు పెట్టుకున్నారట

కేరళ ఎన్నికలపై కాంగ్రెస్ ఈసారి ఆశలు ఎక్కువగా పెట్టుకుంది. మరో రాష్ట్రం తమ ఖాతాలో వేసుకోవచ్చన్న నమ్మకంతో ఉంది. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. [more]

Update: 2020-09-18 16:30 GMT

కేరళ ఎన్నికలపై కాంగ్రెస్ ఈసారి ఆశలు ఎక్కువగా పెట్టుకుంది. మరో రాష్ట్రం తమ ఖాతాలో వేసుకోవచ్చన్న నమ్మకంతో ఉంది. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు తమకు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తుంది. కేరళలో బీజేపీ పెద్దగా బలంగా లేకపోవడం, ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఆరోపణలు రావడంతో విజయం తమదేనన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సయితం కేరళపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

వచ్చే ఏడాది ఎన్నికలు….

కేరళ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గత ఎన్నికల్లో ఎల్.డి.ఎఫ్ విజయకేతనం ఎగురవేసింది. కేరళలో రెండే కూటములు బలంగా ఉన్నాయి. ఒకటి ఎల్.డి.ఎఫ‌్. మరొకటి యూడీఎఫ్. ఈ రెండు విడతల వారీగా అధికారాన్ని చేపడుతున్నాయి. సంప్రదాయం, సెంటిమెంట్ ప్రకారం చూసినా ఈ సారి కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.

విజయన్ పై మచ్చ…..

ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై గోల్డ్ స్కాం విషయంలో మచ్చ పడింది. ఆయనపై నేరుగా ఆరోపణలు లేకపోయినా, సీఎంవో ప్రమేయం ఉందని తేలడంతో ఆయన బాధ్యత వహించక తప్పింది కాదు. వరదలు, కరోనా కట్టడి వంటి విపత్తు సమయాలను పినరయి విజయన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ఆయనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే ఇక్కడ కాంగ్రెస్ గట్టి నమ్మకం పెట్టుకుంది.

బీజేపీ సోదిలో కూడా ఉండదట…

మరోవైపు విపత్తు సమయాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో నిర్లిప్త ధోరణిని చూపిందని కేరళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా వరదల సమయంలో అరకొర సాయం చేసిన బీజేపీ పై ప్రజలు మండి పడుతున్నారు. దీంతో ఇక్కడ బీజేపీకి ఈసారి కనీస స్థానాలు కూడా దక్కే అవకాశాలు లేవు. ఎల్.డిఎఫ్. కూడా బలహీనపడటంతో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఫ్ కు అవకాశాలున్నాయన్న అంచనాలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద కేరళ మీద కాంగ్రెస్ గట్టి ఆశలే పెట్టుకుంది.

Tags:    

Similar News