అత్త తిట్టినందుకు కాదట… అలా ఉంది పరిస్థితి

కాంగ్రెస్ పార్టీకి ఓటములు కొత్త కాదు. గత ఆరేళ్ల నుంచి వరస ఓటములను చవి చూస్తూనే ఉంది. కాంగ్రెస్ ఖాతాలో విజయం పడి ఏళ్లు గడుస్తుంది. నారాయణఖేడ్ [more]

Update: 2020-10-21 09:30 GMT

కాంగ్రెస్ పార్టీకి ఓటములు కొత్త కాదు. గత ఆరేళ్ల నుంచి వరస ఓటములను చవి చూస్తూనే ఉంది. కాంగ్రెస్ ఖాతాలో విజయం పడి ఏళ్లు గడుస్తుంది. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తమ సిట్టింగ్ సీటును కూడా గతంలో కాంగ్రెస్ నిలుపుకోలేక పోయింది. చివరకూ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నైనా గెలిచి తమ నాయకత్వ ప్రతిభను చూపుదామనుకుంటే అది కూడా సాధ్యం కాలేదు. పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పట్టున్న నియోజకవర్గంలోనే ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చింది.

పెద్దగా ఆశలు లేకున్నా…..

ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్ కు పెద్దగా ఆశలు లేనట్లే కన్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందన్న చిన్న ఆశ తప్ప కాంగ్రెస్ కు పెద్ద ఆశలేమీ లేవు. దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు అంత సులువు కాదు. అయినా గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈసారి మాత్రం ఎన్నికను సీరియస్ గా తీసుకుందనే చెప్పాలి. అందుకే గ్రామాల వారీగా బాధ్యులను నియమించి నిత్యం చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంది.

పరుగులు పెట్టిస్తున్నా…..

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా బాధ్యతలను స్వీకరించిన మాణికం ఠాకూర్ కు ఇది తొలి ఎన్నిక కావడంతో ఆయన కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. రోజువారీ నివేదికలను తెప్పించుకుంటున్నారు. గ్రామాల వారీగా నియమించిన నేతలు గ్రామం వదలి రావడానికి వీల్లేదని మాణికం ఠాకూర్ ఆంక్షలు విధించారు. దీంతో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ప్రచారంలో కాస్త మెరుగ్గానే ఉందని చెప్పాలి.

రెండో స్థానంలోనైనా……

కానీ కాంగ్రెస్ లక్ష్యం గెలుపు కాకపోయినా రెండో స్థానంలో ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. ఒకవైపు బీజేపీ దూసుకుపోతుంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి రెండోస్థానంలోకి చేరింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గెలవడం సంగతి పక్కనపెట్టి రెండోస్థానం దక్కించుకుంటే బీజేపీ ప్రచారానికి తెరదించవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ ముందుకు వెళుతుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. మరి కాంగ్రెస్ ఆశనెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News