వేరు కుంపటితో ఎవరికి లాభం?

ఉప ఎన్నికలొస్తే పరిస్థితి ఏంటి..? కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పొత్తుతో పోరులో దిగుతుందా? లేక ఒంటరిగానే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానాలు లభిస్తున్నాయి. [more]

Update: 2019-08-08 18:29 GMT

ఉప ఎన్నికలొస్తే పరిస్థితి ఏంటి..? కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ పొత్తుతో పోరులో దిగుతుందా? లేక ఒంటరిగానే పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానాలు లభిస్తున్నాయి. కర్ణాటకలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో ఉప ఎన్నికలు అనివార్యంగా కన్పిస్తున్నాయి. 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఉంది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఉప ఎన్నికలు జరిగితే త్రిముఖ పోటీ ఖాయమన్న సంకేతాలు విన్పిస్తున్నాయి.

కుమారపై గుర్రుగా…..

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కుమారస్వామి వ్యవహారశైలి అంటూ రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ధర్మాన్ని పాటించకుండా కుమారస్వామి కుటుంబం ఏకపక్ష ధోరణిని తట్టుకోలేకనే తాము రాజీనామా చేసినట్లు వారు బహిరంగంగానే తెలిపారు. దీంతో కుమారస్వామి పట్ల కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సయితం ఆగ్రహంతో ఉన్నారు.

అన్ని స్థానాల్లోనూ….

అందుకోసమే ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అభ్యర్థులను పోటీకి దింపాలని నిర్ణయించారు. నిజానికి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల్లో 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పదిహేడు స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసే పనిలో ఉంది. ఈ మేరకు ఇటీవల జరిగిన పార్టీ నేతల కార్యకర్తల సమావేశంలోనూ సిద్ధరామయ్య ప్రకటించారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమంటూ జేడీఎస్ చేసిన విమర్శలను ఆయన పెద్దగా పట్టించుకోకుండానే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు.

ఒంటరిగానే అన్న సంకేతాలు….

ఇక కుమారస్వామి సయితం కుండబద్దలు కొట్టేశారు. ఇటీవల తాను రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పిన కుమారస్వామి మనసు మార్చుకున్నారు. తాను తండ్రి దేవెగౌడ కలసి 17 నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. కాంగ్రెస్ తనను ముఖ్యమంత్రిగా చేసినా 14 నెలల పాటు నరకం చూశానని చెప్పారు. కుమారస్వామి మాటలు చూస్తే జేడీఎస్ కూడా ఒంటరిగానే ఉప ఎన్నికల్లో బరిలో దిగే యోచనలో ఉంది. దీంతో త్రిముఖ పోటీ బీజేపీకే లాభిస్తుందా? అన్నది చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News