ఢిల్లీలో వారే కీలకమట

ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ మతాలు, కులాల వారీగా తమ వైపు నకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ [more]

Update: 2020-01-09 17:30 GMT

ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ మతాలు, కులాల వారీగా తమ వైపు నకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. బూత్ ల వారీగా, కులాల వారీగా గణాంకాలు సేకరించి వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఢిల్లీని కైవసం చేసుకునేందుకు ఈసారి అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రత్యేకమైన స్ట్రాటజీతో….

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే వీరిలో కొన్ని వర్గాలు దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాసనసభ స్థానాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. అందుకే ఈ వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కోసం అన్ని పార్టీలు ఇతర రాష్ట్రాల నుంచి నేతలను ప్రచారంలోకి దించాలని భావిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలు ఈరకమైన స్ట్రాటజీతో ఎన్నికలకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్థానికంగానే పరిమితమవ్వడంతో అది లోకల్ నేతలపైనే ఆధారపడి ఉంది.

25 స్థానాల్లో ప్రభావం….

ముఖ్యంగా ఢిల్లీలో పూర్వాంచలి వర్గంవారు ఎక్కువగా ఉన్నారు. అందుతున్న గణాంకాల ప్రకారం 25 నుంచి 30 శాతం వరకూ పూర్వాంచలీలు ఉన్నారు. వీరు దాదాపు ఇరవై నుంచి ఇరవై అయిదు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించనున్నారు. వీరు గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నిలిచారు. కొన్నేళ్ల నుంచి వీరు కాంగ్రెస్ వైపే ఉన్నారు. వీరు గత ఎన్నికల్లో మాత్రమే ఆప్ వైపు మొగ్గు చూపారు. ఈసారి వీరిపై కాంగ్రెస్ కన్నేసింది.

ఆ వర్గాల నేతలనే…..

ఇక సిక్కులు కూడా ఢిల్లీలో అధికంగా ఉన్నారు. వీరు ఇరవై శాతం వరకూ ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో మాత్రం ఓట్లు చీలిపోయాయి. పంజాబీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ను రంగంలోకి దించనుంది. వీరు 30 సీట్లలో ప్రభావం చూపించనున్నారు. ఇక ముస్లిం ఓటర్లు కూడా కీలకంగా మారనున్నారు. వీరంతా కూడా ఆప్ వైపు గత ఎన్నికల్లో ఉన్నారు. వీరు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. సీఏఏ ప్రభావం వీరిపై చూపి కాంగ్రెస్ వైపే నిలుస్తారన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. బీజేపీ కూడా ఆ వర్గాలకు చెందిన ఇతర రాష్ట్రాల నేతలు ఢిల్లీ ప్రచారంలో చోటు కల్పించనుంది. మొత్తం మీద వర్గాల వారీగా లెక్కలు వేసుకుని మరీ బరిలోకి దిగుతున్నారు.

Tags:    

Similar News