ఇక పెద్దాయనను రంగంలోకి దింపినట్లేనా..?

Update: 2018-08-07 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలో తార స్థాయిలో ఉన్నాయి. గ్రూపులు కట్టిన నాయకులు ఒకరిపై ఒకరు తరచూ అదిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థులకైతే కొదవే లేదు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిననే అంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ కేంద్ర మంత్రి సూదిని జైసాల్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు కనపడుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే ఆయననే ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో జరుగుతోంది.

ఉత్తమ్ కు వ్యతిరేకంగా గ్రూపు కట్టి మరీ...

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీలోని కొందరు సీనియర్ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. స్వంత జిల్లా నల్గొండలోనే సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ పేరు చెబితేనే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నా ఇప్పుడు కొంత సఖ్యత చూపిస్తున్నారు. గత నెలలో ఏకంగా సుమారు ఇరవై మంది సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ ఉత్తమ్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే ఈసారి కూడా ఓటమి తప్పదని నిర్మోహమాటంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఉత్తమ్ ను మార్చే ప్రసక్తే లేదని రాష్ట్ర పార్టీ ఇంఛార్జి కుంతియా పదేపదే చెప్పాల్సి వస్తోంది.

జైపాల్ రెడ్డి అయితేనే సెట్ అవుతారని..!

ఈ నేపథ్యంలో ఉత్తమ్ ను పీసీసీ నాయకుడిగా కొనసాగిస్తూనే జైపాల్ రెడ్డికి ప్రాధాన్యం కల్పించాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డికి గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఐదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలుపొంది తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ గా ముద్ర వేయించుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ పలుమార్లు ముఖ్యమంత్రి రేస్ లో ఆయన ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సీఎం రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా అవకాశం దక్కలేదు. అయితే, ఇప్పుడు తెలంగాణ పార్టీని గాడిలోకి తీసుకురావాలంటే జైపాల్ రెడ్డి మాత్రమే సరైన వ్యక్తి అని పార్టీ భావిస్తోంది.

అధికారికంగా ప్రకటించకున్నా.. విషయం మాత్రం అదే..!

పార్టీలో ఉత్తమ్ వ్యతిరేక వర్గం మొత్తం జైపాల్ రెడ్డిని అంగీకరిస్తుందనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. కేవలం డీకే అరుణ వంటి ఒకరిద్దరు తప్ప జైపాల్ రెడ్డిని వ్యతిరేకించే వారు ఎవరూ పెద్దగా లేరు. దీంతో ఇప్పటి నుంచే పార్టీ గెలిస్తే జైపాల్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారనే విషయం ఇతర కాంగ్రెస్ నేతలకు తెలిస్తే గ్రూపు తగాదాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ అధికారంలోకి వచ్చాక కూడా జైపాల్ రెడ్డి అయితేనే ఇతర నేతల నుంచి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నారు. ఆయన తప్ప ఏ నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నా ఇతర సీనియర్లు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందే ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేకున్నా, గెలిస్తే జైపాల్ రెడ్డే సీఎం అనే ఒక భావన మాత్రం పార్టీ శ్రేణుల్లో తీసుకురావాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Similar News