ఇద్దరూ ఇద్దరే… ఇక యుద్ధమేనా?

ఇది మూడు దశాబ్దాల క్రితం నాటి మాట. అప్పట్లో అమెరికా – సోవియట్ యూనియన్ (నేటి రష్యా) అగ్రరాజ్యాలుగా ఉండేవి. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేవి. ప్రతి దేశం [more]

Update: 2020-08-10 16:30 GMT

ఇది మూడు దశాబ్దాల క్రితం నాటి మాట. అప్పట్లో అమెరికా – సోవియట్ యూనియన్ (నేటి రష్యా) అగ్రరాజ్యాలుగా ఉండేవి. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేవి. ప్రతి దేశం ఈ రెండింటిలో ఏదో ఒకవైపు మొగ్గు చూపేవి. అప్పట్లో అమెరికా – సోనియట్ యూనియన్ లు సైనిక కూటములు నడిచేవి. అమెరికా నేతృత్వంలో నార్త్ అట్లాంటిక్ ట్రినిటీ ఆర్గనైజేషన్ (నాటో), సోవయిట్ యూనియన్ సారథ్యంలో వార్సా కూటములు ఉండేవి. పోలండ్ రాజధాని వార్సా నగరం సోవియట్ యూనియన్ మిత్రదేశాలు సమావేశం అయి ఒప్పందం కుదుర్చుకోవడంతో దానికి వార్సా ఒప్పందం అనే పేరు వచ్చింది. 1991లో గోర్బచేవ్ హయాంలో సోవియట్ యూనియన్ ముక్క చెక్కలైంది. దీంతో అమెరికాకు ఎదురు లేకుండా పోయింది.

రష్యా స్థానాన్ని చైనా….

గత మూడు దశాబ్దాల కాలంలో రష్యా స్థానాన్ని క్రమంగా చైనా భర్తీ చేస్తూ వచ్చింది. రష్యా మరీ అంత బలహీన పడనప్పటికీ చైనా స్థాయిలో బలంగా లేదు. దీంతో అమెరికాను అడ్డుకోవడంలో, ఎదుర్కొనడంలో చైనా ముందు ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన ప్రభుత్వం ఉండటంతో అమెరికాతో చైనా నేరుగా ఢీకొంటుంది. ఇటీవల కాలంలో చైనా దూకుడు పెంచింది. అగ్రరాజ్యాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇది అమెరికా కు కంటగింపుగా మారింది. 2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రెండు దేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించే క్రమంలో చైనా వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రయత్నాలు వాషింగ్టన్ కు మింగుడు పడటం లేదు. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, టారిఫ్ ల పెంపు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం, తాజాగా కరోనా వైరస్ వ్యాప్తికి బీజింగ్ కారణమంటూ అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

వివాదాలు ముదిరి…..

ఈ వివాదాలు ముదిరి పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా రు దేశాల్లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని, మేధోసంపత్తిని చౌర్యం చేస్తుందని పేర్కొంటూ హూస్టన్ నగరంలోని చైనా కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. ఇందుకు ప్రతిగా చైనా వేగంగా స్పందించింది. తమ దేశంలోని చెంగ్డూ నగరంలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించింది. అమెరికా తమపై చేసిన ఆరోపణలనే ఇప్పుడు చైనా కూడా చేస్తుంది. కాన్సులేట్ జనరల్ కార్యాలయాలకు, రాయబార కార్యాలయాలకు తేడా ఉంది. దేశ రాజధానుల్లో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఉంటాయి. ఇవి దౌత్య వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాయి. ఒక దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉంటాయ. ఇవి పాస్ పోర్టు, వీసా తదితర కార్యకలాపాలు సాగిస్తుంటాయి. హైదరాబాద్ నగరంలో కూడా అమెరికా జనరల్ కాన్సులేట్ కార్యాలయం ఉంది.

కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని….

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో చైనా రాయబార కార్యాలయం ఉంది. అదే సమయంలో న్యూయార్క్, హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, లాస్ ఏంజిల్స్ లో చైనా కాన్సులేట్ కార్యాలయాలున్నాయి. ఇప్పడు వీటిలో హ్యూస్టన్ కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. టెక్సాస్ రాజధాని అయిన హ్యూస్టన్ లో 1979లో చైనా కాన్సులేట్ కార్యాలయం ప్రారంభమైంది. అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో హ్యూస్టన్ ఒకటి. టెక్సాస్ రాష్ట్రం మెక్సికో సరిహద్దుల్లో ఉంటుంది. చైనా గూఢచర్యం, మేధోసంపత్తి సమాచారం తస్కరణకు సంబంధించి ప్రజాస్వామ్య దేశాలు ఏకం కావాలని అమెరికా విదేశాంగ మంత్రి మైకా పాంపియో పిలుపునిచ్చారు. హ్యూస్టన్ కార్యాలయంలో కొన్ని పత్రాలు దగ్దమవ్వడం, అనూహ్యంగా మంటలు చెలరేగడంతో కార్యాలయం మూసివేతకు అమెరికా ఆదేశించింది. అమెరికా చర్యకు ప్రతిగా తమ దేశంలోని చెంగ్డూ నగరంలో గల అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయాలని చైనా ఆదేశించింది. నైరుతి చైనాలోని సిబువాన్ ప్రావిన్స్ లో చెంగ్డూ నగరం ఉంది. ఈ కార్యాలయానికి చాలా ప్రాధాన్యం ఉంది. సున్నితమైన టిబెట్ దీనికి సమీపంలోనే ఉంది. టిబెట్ తో పాటు పలు ప్రావిన్స్ లు దీని పరిధిలోకే వస్తాయి. టిబెట్ కు సంబంధించిన సమాచారాన్ని ఈ కార్యాలయం రహస్యంగా సేకరించి అమెరికాకు పంపిస్తుందన్నది చైనా అనుమానం. టిబెన్ ను ఏదో ఒక పేరుతో వివాదాస్పదం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుందన్నది చైనా ఆరోపణ. తమ దేశంలో భాగమైన టిబెట్ స్వయంప్రతిపత్తిగల ప్రాంతమని, అయినా అమెరికా అనుమానంగా చూస్తుందన్నది చైనా అభియోగం.

మరో నాలుగు చోట్ల…..

చెంగ్డూతో పాటు చైనాలో మరో నాలుగు అమెరికా కాన్సులేట్ కార్యాలయాలున్నాయి. 1979 ఆగస్టు 31న గ్యూయాంజ్ నగరంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం ప్రారంభమైంది. దాని పరిధిలో నాలుగు ప్రావిన్స్ లు, 44 నగరాలున్నాయి. చైనాలో రేవు నగరంగా ప్రసిద్ధి చెందిన షాంఘైలో మరో కాన్సులేట్ ఉంది. తూర్పు చైనాలోని ఈ కార్యాలయం పరిధిలో నాలుగు ప్రావిన్స్ లు ఉన్నాయి. షాంఘై దేశంలో అతి పెద్ద నగరం. షెన్యాన్ నగరంలో మరో కాన్సులేట్ ఉంది. దేశ ఈశాన్య ప్రాంతంలోని ఈ కార్యాలయం పరిధిలో మూడు ప్రావిన్స్ లు ఉన్నాయి. కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువైన వూహాన్ నగరంలో 2008లో అయిదో కాన్సులేట్ కార్యాలయాన్ని అమెరికా ప్రారంభించింది. ిది దేశంలోని కీలక నగరం. అంతర్జాతీయ సమావేశాలు ఇక్కడే జరుగుతుంటాయి. గతంలో ఈ నగరంలో బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశం జరిగింది. రెండు పెద్ద దేశాల మధ్య వైరుధ్యాలు పెరగడం మంచిది కాదు. దీని ప్రభావం ఇతర దేశాలపైనా, ముఖ్యంగా వాటి మిత్ర దేశలపైనా ఉంటుంది. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, దౌత్య పద్ధతుల్లో సమస్యను పరిష్కరించు కోవాలి తప్ప మొండిగా వ్యవహరించడం ఉభయ దేశాలకు మంచిది కాదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News