ఆ జిల్లా వైసీపీలో టికెట్ల కోసం ఫైటింగ్‌..

Update: 2018-07-19 11:00 GMT

నెల్లూరు జిల్లా వైసీపీలో టికెట్ల ఫైటింగ్ హోరాహోరీగా కొన‌సాగుతోంది. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ టీడీపీ బ‌లంగా లేదు. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న సోమిరెడ్డి లాంటి వాళ్లే ఇక్క‌డ నాలుగుసార్లు వ‌రుస‌గా ఓడారు. 2004 త‌ర్వాత ఇక్క‌డ టీడీపీ పునాదులు క‌దిలిపోయాయి. కాంగ్రెస్ ఆ త‌ర్వాత వైసీపీ ఇక్క‌డ సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 10 అసెంబ్లీ సీట్ల‌కు టీడీపీ కేవ‌లం మూడు మాత్ర‌మే చాలా త‌క్కువ మెజార్టీతో గెలిచింది. నెల్లూరు ఎంపీ సీటుతో పాటు నెల్లూరు జ‌డ్పీచైర్మ‌న్ పీఠం, మేయ‌ర్ పీఠం అన్ని వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి.

గెలిచే అవకాశం ఉండటంతోనే...

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఛాన్సులు ఎక్కువ ఉంటాయ‌న్న వాతావ‌ర‌ణం ఉండ‌డంతో ఆ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ నువ్వా.. నేనా.. అన్న‌ట్లు న‌డుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. కావ‌లి, వెంక‌ట‌గిరి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేతలు టికెట్ల కోసం ఫైటింగ్ చేస్తున్నారు. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మూడు గ్రూపులుగా పార్టీ చీలిపోవ‌డంతో ముందుముందు ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. కావలిలో టీడీపీ, వైసీపీలు రెండూ బ‌లంగానే ఉన్నాయి..2014 ఎన్నికల్లో వైసీపీ త‌రుపున బ‌రిలోకి దిగిన ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డి 4969 ఓట్లతో టీడీపీ అభ్య‌ర్థి బీద మ‌స్తాన్‌రావుపై విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులంద‌రూ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌డం వ‌ల్ల కొద్దిపాటి తేడాతో ఆయ‌న గెలుపొందారు.

కావాలి టిక్కెట్ కి ముగ్గరి పోటీ

కావ‌లి వైసీపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈసారి వైసీపీ టికెట్ రేసులో మ‌రో ఇద్ద‌రు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డిలు టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రతాప్‌రెడ్డికి వ్యతిరేకంగా విష్ణువర్ధనరెడ్డి గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నారు. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఒకవేళ తనకు టికెట్‌ రాకున్నా, ప్రతాప్‌రెడ్డికి మాత్రం రావొద్ద‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి పావులు క‌దుపుతుండ‌డం గ‌మ‌నార్హం. వీరిలో ఒక‌రికి టిక్కెట్ వ‌స్తే మ‌రొక‌రు వ్య‌తిరేకంగా చేసేందుకు రెడీగా కాచుకుని ఉన్నారు.

ఆనం వస్తే ఆయనకే ఖాయమా..

ఇక టీడీపీ ఎమ్మెల్యే ఉన్న వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డి నుంచి టికెట్ కోసం ఇద్ద‌రు నేత‌లు ప్ర‌ధాన రేసులో ఉన్నారు. జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల త‌ర్వాత‌ వెంకటగిరి ఇన్‌చార్జిగా బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్రెడ్డి కొన‌సాగుతున్నారు. ఎంపీ మేక‌పాటి మ‌ద్ద‌తుతో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వ‌హిస్తూ త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. అయితే అనూహ్యంగా మ‌రొకరి నుంచి పోటీ ఎదుర‌వుతోంది. ఈ ప‌రిస్థితులు బొమ్మిరెడ్డికి చికాకు తెప్పిస్తున్నాయట‌. ఇదే నియోజకవర్గానికి చెందిన కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి వేరుగా పార్టీ కార్య‌క్ర‌మాలు చేయ‌డ‌మే ఇందుకు కార‌ణమ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఒంగోలు నేత‌ వైవీ సుబ్బారెడ్డి మ‌ద్ద‌తుతో ఈయ‌న‌ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో స్పీడు పెంచారు. ఇక్క‌డే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంటోంది. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతుండ‌డంతో వెంకటగిరి టికెట్ ఆయ‌న‌కేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆత్మకూరు కోసం రెండు కుటుంబాల పోటీ

ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం మ‌రింత వేడిపుట్టిస్తోంది. వెంక‌ట‌గిరి టికెట్ ఆశిస్తున్న‌ ఆనం రామనారాయణరెడ్డి ఆత్మ‌కూరుపై కూడా దృష్టి పెట్టార‌నే టాక్ వినిపిస్తోంది. ఆత్మ‌కూరులో ఆనం బ‌లం అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌రిణామాలతో ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి కుటుంబం గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆనం చ‌ర్య‌ల‌ను మేకపాటి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆనం, మేక‌పాటి రాజ‌కీయాల‌తో వైసీపీ క్యాడ‌ర్ గంద‌ర‌గోళానికి గుర‌వుతోంది. ఇక్క‌డి నుంచి ప్ర‌ధానంగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. ఆత్మ‌కూరులో త‌న రాజ‌కీయ‌ పూర్వ‌వైభ‌వం కోసం ఆనం వైసీపీ గూటికి చేరుతున్నారు. ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ సంపాదించి గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆనం ఉన్నారు. దీనిని తిప్పికొట్టేందుకు మేక‌పాటి కుటుంబం కూడా అదేస్థాయిలో పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎవ‌రిని టికెట్ వ‌రిస్తుందో చూడాలి మ‌రి.

Similar News