ఈ రెండు కులాలేనా? ఏపీలో జరుగుతున్నదిదే?

ఆంధ్ర ప్రదేశ్ లో కులాధిపత్య పోరాటం బహిరంగం అయింది. రెండు ప్రధాన కులాల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతోంది. ఈ పోరాటంలో ఈ రెండు కులాల ప్రతినిధులు [more]

Update: 2020-03-22 11:00 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో కులాధిపత్య పోరాటం బహిరంగం అయింది. రెండు ప్రధాన కులాల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతోంది. ఈ పోరాటంలో ఈ రెండు కులాల ప్రతినిధులు తమవంతు యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర కులాల ప్రమేయం పెద్దగా ఉండదు. రెండు కులాల ఆధిపత్య పోరాటానికి మిగతా కులాలన్నీ ప్రేక్షకులే. కాకపొతే సందర్భానుసారం ఇతర కులాలు ఎదో ఒక కులానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మద్దతు ఎవరు పొందగలుగుతారు అనే దానిపై ప్రస్తుత ఆధిపత్య పోరాట విజయం ఆధారపడి ఉంటుంది.

కొత్తేమీ కాదు….

ఆధిపత్యం కోసం జరిగే ఈ పోరాటం సామాజిక పరిణామ క్రమంలో భాగమే తప్ప కొత్త కాదు, వింత కాదు. ఈ పోరాటం అనారోగ్య కరమే అయినా అది సామాజిక పరిణామ క్రమంలో అనివార్యంగా వస్తుంది. ఇప్పుడూ అలాగే వచ్చింది. ఇలాంటి పోరాటాలు ఘర్షణలు అనేక కులాల మధ్య ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉంటాయి. అంటే సామాజిక సంఘర్షణలో భాగంగానే ఈ పోరాటాలను చూడాల్సి ఉంది.

అనివార్యమైన ఘర్షణ….

శూద్ర కులాల్లో కాపులు తమపైన ఉన్న కమ్మలపై, అలాగే యాదవులు ఒక స్థాయిలో గౌడలపై, పంచమ కులసమూహాల్లో మాదిగలు తమపైన ఉన్న మాలలపై, గిరిజన సమూహాల్లో అత్యధిక లబ్ధిపొందుతున్న బంజారాలపై మిగతా కులాలు ఘర్షణ వైఖరితోనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ ఘర్షణ బయటకు కనిపిస్తుంది. మిగతా సమయాల్లో బయటకు కనిపించకుండా అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇది అనివార్యమైన ఘర్షణ.

బ్రాహ్మణవాద కులాధిపత్యం…..

ఆంధ్ర ప్రదేశ్ లో రాజ్యాలు పరిపాలించిన క్షత్రియులు, అలాగే జమిందారులుగా పనిచేసిన వెలమలు ఆ తర్వాత కాలంలో ఇతర కులాలపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు చేయకుండా ఉండిపోయారు. వ్యాపారాలపై దృష్టిపెట్టిన వైశ్యులు ఆర్ధిక లావాదేవీలకోసం కులాధిపత్యంపై దృష్టి పెట్టలేదు. అయినప్పటికీ అనేక శతాబ్దాల నుండి 1960 దశకం వరకూ బ్రాహ్మణ కులాధిపత్యం కొనసాగింది. ఆ అధిపత్యానికి వ్యతిరేకంగా అనేక కులాలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలో శూద్రకులాల్లోని కమ్మ కులం (1920 దశకం నుండి) నాయకత్వం వహించింది. ఈ ఘర్షణలో బ్రాహ్మణ కులం తన ఆధిపత్యాన్ని వదిలిపెట్టింది. 1970 దశకం నాటికి బ్రాహ్మణ కులాధిపత్యం తగ్గి అది బ్రాహ్మణవాద కులాధిపత్యంగా రూపాంతరం చెందింది.

అప్పటి నుంచే ఆధిపత్యం…..

బ్రాహ్మణ కులాధిపత్యాన్ని సమాజం సవాలు చేసిన ఘర్షణకు నాయకత్వం వహించిన శూద్ర కులం – కమ్మ – 1980 దశకం నాటికి రాజకీయ అధిపత్యంలోకి వచ్చింది. అప్పటికే రెడ్డి కులం రాజకీయ ఆధిపత్యంలో కొనసాగుతున్నప్పటికీ అప్పుడే కొత్తగా శూద్ర ముద్ర తొలగించుకొని రాజకీయ ఆధిపత్యం చేపట్టిన కమ్మ కులం అన్ని రంగాల్లోకి విస్తరించి తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు చేసింది. రాజకీయ ఆధిపత్యం అండగా పెట్టుకుని ఇతర కులాలపై సామాజిక పెత్తనం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కారంచేడు మారణహోమం. ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో కమ్మ కులం తన సమఉజ్జిలుగా ఉన్న కులాలను వదిలేసి ఒక పంచమ కులాన్ని టార్గెట్ చేయడం ఒక తప్పిదం.

ఇతర కులాలపై ఆధారపడుతూ….

అప్పటికే మొదట పాలకులుగా కొనసాగి తర్వాత ప్రజాస్వామ్యంలో పాలక కులంగా స్థిరపడిన రెడ్డి కులం కారంచేడు తప్పిదాన్ని, దానివల్ల ఇతర కులాల్లో చిగురించిన కొద్దిపాటి వ్యతిరేకతను అవకాశంగా తీసుకుని తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో కులాధిపత్యం కూడా చెలాయించే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో రెడ్డి కులం కూడా కమ్మ కులం లాగే ఇతర కులాలపై ఆధిపత్య దాడిని మార్గంగా ఎంచుకుంది. దాని ఫలితం చుండూరు మారణహోమం. అయితే ఆధిపత్యం కోసం ఘర్షణ వైఖరిలోకి దిగిన ఈ రెండు కులాలు ఒకేరకం తప్పులు చేశాయి – ఒక కులం కారంచేడులో, ఇంకో కులం చుండూరులో. ఈ తప్పిదాలనుండి రెండు కులాలు చాలా వేగంగానే గుణపాఠం నేర్చుకున్నాయి. ఆధిపత్యం సాధించాలంటే చిన్న కులాలపై దాడులు చేసి భయోత్పాతం, మారణహోమం సృష్టిస్తే కుదరదని, అందుకు రాజకీయమే వేదికగా పోరాటం చేయాలనీ తెలుసుకున్నాయి.

ఆధిపత్యం సాధించాలంటే…..

సామాజిక ఆధిపత్యం సాధించాలంటే కులాలపై భౌతిక దాడి సరికాదని గ్రహించిన ఈ రెండు శూద్రకులాలు (కమ్మ – రెడ్డి) రాజకీయ అధిపత్యంపై దృష్టిపెట్టాయి. రాజకీయ ఆధిపత్యం పటిష్టం చేసుకోవడం ద్వారానే సామాజిక ఆధిపత్యం కూడా సాధించగలమని అర్ధం చేసుకున్నాయి. ఆ పోరాటం ఓ దాశాబ్దకాలం నడిచింది. రాజకీయ ఆధిపత్యంలో ఉన్న కమ్మ కులంపై ఆధిపత్యం కోసం రెడ్డి కులం రాజకీయ ఘర్షణను ఉధృతం చేసింది.

రాజశేఖర్ రెడ్డి రాకతో….

చివరికి 2000 దశకంలో రెడ్డి కులానికి, కులాధిపత్య ఘర్షణకు రాజశేఖర్ రెడ్డి నాయకత్వం వహించారు. ఆయన కమ్మ కులాధిపత్యంపై పోరాటానికి ముందే ఇతర కులాలతో సానుకూల సంబంధాలు పటిష్టంగా ఏర్పాటుచేసుకున్నారు. కులాధిపత్య ధోరణిలో లేని క్షత్రియ, బ్రాహ్మణ కులాల మద్దతుతో పాటు కులాధిపత్యమే అవసరం లేదనుకున్న వైశ్య కుల మద్దతు కూడా కూడగట్టుకున్నారు. ఆ తర్వాత మొదలుపెట్టిన ఆధిపత్య పోరాటంలో వరుసగా రెండుసార్లు తమ కులాన్ని అధికారంలో కూర్చోబెట్టి అప్పటివరకు అధికారంలో ఉన్న కమ్మ కులాన్ని ఒక మెట్టు కిందికి దించేశారు.

బాబు చుట్టూ ఉన్న వాళ్లు…..

అధికార ఆధిపత్యం కోల్పోయిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఇది మొత్తం రాజకీయ పోరాటం అనుకున్నారు తప్ప కులాధిపత్య పోరాటం అనుకోలేదు. అయితే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ఈ మొత్తం పరిణామాన్ని కులకోణంలోనుండే చూశారు, చూస్తున్నారు. ఇతర కులాలు కూడా రాజశేఖర్ రెడ్డి విజయాన్ని, చంద్రబాబు అపజయాన్ని కులకోణం నుండే చూస్తున్నారు. అవునన్నా, కాదన్నా ఇది కుల సమాజం. పోరాటాలు, ఘర్షణలు కుల ప్రాతిపాదికగానే ఉంటాయి.

జగన్ పార్టీ వచ్చిన తర్వాత…..

రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రెడ్డి కులం బలహీనపడింది. మరోవైపు చంద్రబాబు నాయకత్వంలో పార్టీ, ఆయన చుట్టూ ఉన్నవారి వల్ల కమ్మ కులం బలం పుంజుకుని 2014లో మళ్ళీ ఆధిపత్యంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చేపట్టిన పదేళ్ళకు ఆధిపత్య ఘర్షణ పతాక స్థాయికి చేరింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి కూడా రాజశేఖర్ రెడ్డి నాయకత్వానికి వచ్చిన మద్దతే ఇతర కులాల నుండి లభించింది. అందుకే 2019 ఆధిపత్యపోరు (ప్రజాస్వామ్య పరిభాషలో ఎన్నికలు) రెడ్డి కులానికి తిరుగులేని ఆధిక్యతను సమకూర్చింది.

ఎన్ని పేర్లు పెట్టుకున్నా…..

ఇప్పుడు ఆధిపత్య పోరు, అస్తిత్వ పోరు కమ్మ కులం చేపట్టాల్సి వచ్చింది. ప్రస్తుత సామాజిక ఘర్షణ ఇదే. ఎంత నాజూకుగా పిలుచుకున్నా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా కమ్యూనిజం మాటున వర్గ పోరు అనుకున్నా, ప్రజాస్వామ్య పరిభాషలో రాజకీయ పోరు అనుకున్నా వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నది కులాధిపత్య పోరాటమే. ఈ పోరాటం అనైతికం కాదు, అసహజం కాదు. ఇది సామాజిక అస్తిత్వ ఘర్షణ. ఈ ఘర్షణలో ఇతర కులాలకు చోటు ఇచ్చే కులం చేతిలో ఆధిపత్యం ఉంటుంది. ఇతర కులాలను కూడా తమతో పాటు తీసుకెళ్ళగల సౌలభ్యాన్ని కలిగిఉన్న కులం మాత్రమే విజయం సాధిస్తుంది. ఇతర కులాలను సౌహార్ధ (solidarity)తో అకామడేట్ (accommodate) చేయగలిగిన కులమే రాజకీయ, సామాజిక ఆధిపత్యాన్ని తన సొంతం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మొదలయిన ఈ ఘర్షణ ఏ కులాన్ని ఆధిపత్య స్థానంలో కూర్చో బెడుతుందో అన్నది రెండుకులాల్లో ఏ కులానికి ఇతర కులాలను అకామడేట్ చేయగలిగే నేచర్ ఉందో, ఏ కులాన్ని ఇతర కులాలు అంగీకరించగలుగుతాయో అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News