జగన్ పెద్ద కామ్రేడ్…ఎర్రన్నలు మెచ్చుకుంటారా ?

వామపక్ష ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం. అలా చేస్తాం అంటూ కమ్యూనిస్టులు చెబుతూంటారు. సమ సమాజం, సమ భావన, బడుగులకు పెద్ద పీట, అవినీతి రహిత పాలన, [more]

Update: 2019-06-28 18:29 GMT

వామపక్ష ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం. అలా చేస్తాం అంటూ కమ్యూనిస్టులు చెబుతూంటారు. సమ సమాజం, సమ భావన, బడుగులకు పెద్ద పీట, అవినీతి రహిత పాలన, అక్రమాలపై ఉక్కు పాదం ఇలాంటివి అన్నీ వారి అజెండా. మరి నెల రోజుల పాలనలో వైఎస్ జగన్ అమలుచేస్తోంది కూడా అదే. అచ్చమైన వామపక్ష విధానాలను పుణికిపుచ్చుకున్నట్లుగా జగన్ పాలన సాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఈ నెలరోజుల్లో తీసుకున్న అనేక నిర్ణయాలు అచ్చంగా వామపక్షాల డిమాండ్లే. అవి ఇవాళా నిన్నా కూడా కాదు, ఏళ్ళ తరబడి ప్లే కార్డులు పట్టుకుని వామపక్షాలు వీధి పోరాటాలు చేస్తున్నావే. వాటిని ఒక్క మాటతో జగన్ తీర్చేశారు. ఓ విధంగా కామ్రేడ్స్ సైతం ఆశ్చర్యపోయే విధంగా వైఎస్ జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అవన్నీ తీర్చేశారుగా :

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు వరాలే కురిపించారు. ఎన్నాళ్ళుగానే ఉన్న సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసేలా కమిటీ వేశారు అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు, హెల్పర్లకు జీతాలు పెంచేశారు. మరో వైపు పారిశుధ్ద్య కార్మికులకు జీతాలు 18 వేలకు పెంచేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భ్రుతిని 27 శాతం పెంచారు. రేషన్ షాపుల్లో నాలుగైదు రకాల సరకులు ఇస్తామని అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా గొప్ప నిర్ణయమే. ఇక అక్రమ కట్టడాల కూల్చివేత కూడా వామపక్షాలు కోరుతున్నవే. మరో వైపు ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని నిండు సభలో జగన్ ప్రకటించడం ద్వారా ఎర్రన్నల మనసు చూరగొన్నారు. దీని మీద సీపీఐ నారాయాణ జగన్ని పొగుడుతూ కేసీయార్ కూడా అదే బాటలో నడవాలని కోరడం విశేషం.

బడుగులకు పదవులు :

అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గం కూర్పు కూడా ఇలా ఉంటుందని ఎవరూ వూహించలేదు. ఆయన మొత్తం మంత్రివర్గంలో అరవై శాతం పైగా బడుగులతో నింపేశారు. ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి అప్పగించారు. అలాగే ఎస్టీ మహిళను ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నాళ్ళుగానో డిమాండ్ గా ఉన్న ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను నిలుపు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవినీతి దోపిడి పాలనపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో వాంపక్షాలు అధికారంలో వచ్చినా కూడా ఇలాగే పాలిస్తాయన్న తీరులోనే వారి అజెండానే ముందుంచుకుని జగన్ పాలించడం విశేషం. దీంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విమర్శలు చేసే వామపక్షాలు జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని హర్షిస్తూ ఇపుడు ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం ద్వారా కూడా జగన్ కామ్రేడ్లకు మరింత దగ్గరయ్యారు

Tags:    

Similar News