ప్లాన్ ‘బి’ ఏంటి…?

పండగకు ఊరెళ్దామనుకుంటున్న ప్రయాణికులకు టెన్షన్ పట్టుకుంది. ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె కు పిలుపునివ్వడంతో తాము స్వగ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక తలలు [more]

Update: 2019-10-02 12:17 GMT

పండగకు ఊరెళ్దామనుకుంటున్న ప్రయాణికులకు టెన్షన్ పట్టుకుంది. ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె కు పిలుపునివ్వడంతో తాము స్వగ్రామాలకు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే మంగళవారం మంత్రి వర్గ సమావేశంలో రెండు గంటలపాటు ఆర్టీసీపై చర్చించిన సీఎం కేసీఆర్, మంత్రివర్గం ఎట్టకేలకు ఓ కమిటీని వేశారు. దీంతో కొంత ఉపశమనం పొందారు ప్రయాణికులు.

ఫలించని చర్చలు

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది ప్రభుత్వం. సమ్మె నేపథ్యంలో ఇవ్వాళ ఈ కమిటీ ఆర్టీసీ కార్మిక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 25 సమస్యల జాబితాను కమిటీ ముందు పెట్టారు. వీటిపై చర్చించిన కమిటీ కార్మికులకు మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని కమిటీ పేర్కొంది.

కమిటీల వల్ల ఫలితం లేదు…

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయడాన్ని ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది. అయితే ఇప్పటికే ఇలా ఎన్నో కమిటీలు వేసి కాలయాపన చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీల వల్ల కార్మికులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని పేర్కొంది. గతంలోనూ ఆర్టీసీ సమస్యలపై కమిటీ వేసినా ఎన్నికల సమయంలో ఆ కమిటీ ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త కమిటీ వచ్చిందని మండిపడుతున్నారు. దీంతో ఈ నెల 5వ తేదీన తలపెట్టిన సమ్మెయధావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. కార్మికులు ఎవరి మాటలు వినవద్దని తమ సంకల్ప బలం గట్టిగా ఉండాలని జేఏసీ మరోమారు పిలుపు నిచ్చింది. ఇవ్వాళ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో గాంధీ విగ్రహం ముందు కార్మికులు, జేఏసీ నేతలు మౌనదీక్ష చేశారు.

ఏం జరుగుతుంది…?

ఓ వైపు పండగ సీజన్…… మరో వైపు కమిటీ చర్చలు….. ఇంకోవైపు ఆర్టీసీ కార్మికుల చర్చలతో ఎవరికీ ఏమి అర్థంకాని పరిస్థితి తలెత్తింది. కమిటీ ఇవ్వాల కార్మికులతో చర్చించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అంతుచిక్కడం లేదు. అధికారులు మాత్రం ప్లాన్ బి ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఈ ప్లాన్ బిలో ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశ మైంది. ప్లాన్ బీలో ఎస్మా ప్రయోగిస్తారనే చర్చ కూడా సాగుతుంది. మరి అధికారులు ప్లాన్ బిలో ఏం చేస్తారో వేచిచూడాలి. మరో వైపు సీఎం హస్తిన వెళ్తుండడంతో కార్మికులు సమస్యల పరిష్కారాలపై డౌట్…. డౌట్ గా ఉన్నారు.

 

Tags:    

Similar News