తాళలేక పోతున్నాం తాళం తీయండి

లాక్ డౌన్ దెబ్బకి వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలు అయిపోయాయి. దాంతో నెలరోజులకు పైగా ఓపిక పట్టిన ఈ వర్గాలు ఇప్పుడు తమ వ్యాపారసంస్థలకు తాళం తీయకపోతే [more]

Update: 2020-05-03 09:30 GMT

లాక్ డౌన్ దెబ్బకి వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలు అయిపోయాయి. దాంతో నెలరోజులకు పైగా ఓపిక పట్టిన ఈ వర్గాలు ఇప్పుడు తమ వ్యాపారసంస్థలకు తాళం తీయకపోతే ఇక కష్టమే అనేస్తున్నారు. వీరి ఆందోళన ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలను తాకింది. దీనితో కేంద్రం కొన్ని మార్గదర్శకత్వాలు జారీ చేసేసింది. నెమ్మది నెమ్మదిగా ఒక్కో రంగాన్ని గాడిన పెట్టేందుకు దశలవారీ కార్యాచరణ మొదలు పెట్టేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్స్ కి ఆంక్షలు చాలా సడలించింది. అయితే రెడ్ జోన్స్ పరిధిలో ఉన్న పట్టణాలు, నగరాల వ్యాపారులు ఇప్పుడు ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉండటంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు.

కంటోన్మెంట్ జోన్స్ లో లేనివి …

రెడ్ జోన్స్ పరిధిలో ఉండే ప్రాంతాలను 500 ల మీటర్ల పరిధిలో ముళ్లకంచెలతో, ఐరన్ గ్రిల్స్ తో పూర్తిగా మూసి పహారా కాస్తున్నారు పోలీసులు. అయితే ఈ కంటోన్మెంట్ పరిధిలో లేని ప్రాంతాల్లో వ్యాపార వర్గాలకు వెసులుబాటు కల్పించాలన్నది వ్యాపార వర్గాల వాదన గా కనిపిస్తుంది. ఏపీ లో జగన్ సర్కార్ అధికారాలను కిందిస్థాయికి బదిలీ చేసింది. ఏ ప్రాంతంలో ఎలాంటి నిబంధనలు పెట్టాలన్నది అధికారుల నిర్ణయం మేరకే ఉంటుంది. దీంట్లో సర్కార్ జోక్యం ఏమి ఉండదు. దాంతో సంకట పరిస్థితి ఉన్నతాధికారులు ఎదుర్కొంటున్నారు.

తేడా వస్తే ఉద్యోగాలకే ఎసరు …

ఆంక్షలు సడలిస్తే వైరస్ వ్యాప్తి చెందితే తమపై ప్రభుత్వం చర్యలు చేపడుతుందేమో అన్నది ఆందోళన. కీడెంచి మేలు ఎంచాలన్న రీతిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయడమే రెడ్ జోన్స్ లో ఉండే నగరాలు పట్టణాల్లో మంచిదన్నది అధికారగణం ఆలోచనగా ఉంది. ఇదిలా ఉంటే పని చేసినా చేయకపోయినా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉన్న కార్మికులకు జీతాలు చెల్లించాలిసిందే అని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో తమ సంస్థలు తాళాలు తీయకుండా అలా చేయడం కష్టమే అన్నది వర్తకలోకం మాట. ఇప్పటికే ఒక నెల భరించామని అది మరోనేలా కంటిన్యూ చేయడం తమ వల్ల కాదన్నది వర్తకుల ఆవేదన.

ఆదాయం లేకుండా ఖర్చు ఎలా …?

షాపుల్లోని కార్మికులను, అద్దెలను, బ్యాంక్ రుణాలను చెల్లించడం తమ వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నారు. సంపాదన లేకుండా ఖర్చు ఎలా చేయగలమన్నది వారి ప్రశ్న. దీనికి అధికారగణం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క దేవుడు కరుణించినా పూజారి కరుణ లేదన్నట్లు పోలీసులు ఉదయం 9 గంటలనుంచి షాపులను మూయించడంతో బాటు కేసులు పెడుతూ ఉండటంతో, కలెక్టర్ లు, సబ్ కలెక్టర్ లు ఇచ్చే ఆదేశాలు కి పోలీసులకు సంబంధమే ఉండటం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ, పోలీసు శాఖ ల నడుమ సమన్వయం లోపించడం కూడా వ్యాపారుల పాలిట శాపంగానే మారింది.

Tags:    

Similar News