Bjp : ఇద్దరికీ అనుమానమే… అందుకే విడివిడిగా

భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుంది. రెండు పార్టీలూ విడివిడిగానే తమ కార్యక్రమాలను చేపడుతుండటం దీనికి సంకేతాలని చెప్పాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం [more]

Update: 2021-10-08 00:30 GMT

భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లుంది. రెండు పార్టీలూ విడివిడిగానే తమ కార్యక్రమాలను చేపడుతుండటం దీనికి సంకేతాలని చెప్పాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అయితే ఇప్పుడిప్పుడే బయటపడే అవకాశం లేదు. కానీ సమయం కోసం ఇద్దరూ వెయిట్ చేస్తున్నట్లే కన్పిస్తుంది. పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ఇద్దరూ అభిప్రాయపడుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చూడాలి.

టీడీపీతో పొత్తుతో…

పరిషత్ ఎన్నికల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకే ఈ పొత్తు పెట్టుకున్నామని చెబుతున్నా, అదే జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండానే పొత్తులు కుదిరిపోయాయి. దీనిపై జనసేన అధినాయకత్వం మాత్రం తమతో సంప్రదించకుండానే స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తప్పించుకుంటోంది.

కార్యక్రమాలను కూడా….

ఇక కార్యక్రమాలు కూడా విడివిడిగానే చేస్తున్నాయి. పొత్తు కుదిరిన తొలినాళ్లలో రెండు పార్టీలు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహారం సాగుతుంది. జనసేన ఈ నెల 2వ తేదీన రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. బీజేపీ తో చర్చించకుండానే ఈ కార్యక్రమాన్ని జనసేన ప్రకటించింది. ఇది కూడా బీజేపీలో అసంతృప్తికి ఒక కారణమంటున్నారు.

అనుమానంగా చూస్తూ….

దీంతో బీజేపీ కూడా తక్కువ తినలేదు. తమ కార్యక్రమాలను తాము చేసుకుంటున్నారు. ఈనెల 7వ తేదీన మత్స్య గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా సొంతంగా నిర్వహించుకున్నారు. జనసేనతో కలసి నడిచే కన్నా సొంతంగానే బలపడటం బెటర్ అన్న ధోరణిలో బీజేపీ నాయకత్వం కూడా ఉంది. మొత్తం మీద జనసేనను బీజేపీ అనుమానం గా చూస్తుంది. అదే సమయంలో బీజేపీని జనసేన దూరం పెట్టాలని యోచిస్తుంది. ఇప్పటికిప్పుడు కాకున్నా ఎన్నికలు దగ్గరపడిన సమయంలో రెండు పార్టీల మధ్య కటీఫ్ తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News