సీఎం రమేష్ కు, సీబీఐకి లింకు ఇదేనా...?

Update: 2018-10-25 15:30 GMT

సీఎం రమేష్ ....సానా సతీష్ ..... అలోక్ వర్మ... రాకేష్ ఆస్థానా... మొయిన్ ఖురేషీ.... గత రెండు, మూడు రోజులుగా పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తున్న పేర్లు ఇవి. స్థూలంగా చూస్తే ఈ అయిదుగురిలో ఒకరితో ఒకరికి ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సానా సతీష్ ఢిల్లీ కేంద్ర కార్యాలయంగా నిన్న మొన్నటి వరకూ సీబీఐలో పనిచేసిన అలోక్ వర్మ, ఇదే సంస్థలోని ప్రత్యేక సంచాలకులు రాకేష్ ఆస్థానా, యూపీకి చెందిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ.. వీరిలోఒకరితో ఒకరికి సంబంధం ఉన్నట్లు కనిపించదు. కానీ తరచి చూస్తే ఈ ఐదుగురి మధ్య ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సీబీఐ ప్రత్యేక సంచాలకులు రాకేష్ ఆస్థానా ప్రధాని నరేంద్ర మోదీ మనిషన్న విషయం లోకం కోడై కూస్తోంది. గుజరాత్ క్యాడర్ కు చెందిన ఆస్థానాను మోదీ ఏరి కోరి తెచ్చుకున్నారు. సీబీఐ సంచాలకుడు అలోక్ వర్మను అదుపులో ఉంచేందుకు ఆస్థానాను మోదీ ప్రయోగించారు. వృత్తి రీత్యా ప్రధాని కనుసన్నల్లోనే పనిచేయాల్సిన అలోక్ వర్మ పరోక్షంగా ఆయన్ను థిక్కరిస్తున్నారు.

సంబంధాలు నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందువల్లే వరుస ఐటీ, సీబీఐ దాడులు జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ పెద్దగా ఆందోళన చెందుతున్నట్లు కనపడటం లేదు. మొయిన్ ఖురేషీ యూపీకి చెందిన ప్రముఖ మాంసం వ్యాపారి. ఇక సానా సతీష్ పవర్ బ్రోకర్. లాబీయింగ్ చేయడంలో దిట్ట. తనకు సీబీఐలో ఉన్న పరిచయాలు, పలుకుబడితో ప్రముఖులను కాపాడి లబ్ది పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెబుతుంటారు. ఇక అసలైన కథనాయకుడు కూడా సీఎం రమేష్ వెనుకబడిన తనానికి మారుపేరైన కడప జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఇటీవలే టీడీపీ తరుపున రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రతిష్టాత్మకమైన పీఏసీ కి ఆగస్టు 6న ఎన్నికయ్యారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తున్న, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తనపై ప్రధాని మోదీ కక్ష కట్టి ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అలోక్ వర్మ అండదండలతో తప్పించుకుంటూ వస్తున్నారన్నది గిట్టని వారి ఆరోపణ. సాక్షాత్తూ అలోక్ వర్మతో పాటు సీబీఐ లోని ఉన్నతాధికారులు రమేష్ కు ఎప్పటికప్పుడు "ఉప్పు" అందిస్తుంటారు. బీజేపీ, టీడీపీలకు బద్ధ వైరం ఉన్నప్పటికీ సీబీఐలో టీడీపీకి గట్టి మద్దతుదారులు ఉన్నారన్న ప్రచారం ఉంది. రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో ప్రముఖ మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థను సీఎం రమేష్ నడుపుతున్నారు. ఏపీలోని కాంట్రాక్టులన్నీ ఆయనకే వస్తుండటం విశేషం. దీనిపై విపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆయన కంపెనీ టర్నోవర్ వేల కోట్లలో ఉంది. చంద్రబాబు బినామీగా విమర్శలు విన్పిస్తాయి. చంద్రబాబు వద్ద పనిచేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి సోదరుడు సీబీఐలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. సీబీఐలో టీడీపీ వర్గాలు ఎంత బలంగా ఉన్నాయో అని చెప్పడానికి ఇది నిదర్శనం. తాజాగా ఆయనను వేరే చోటికి మోదీ సర్కార్ బదిలీ చేసింది.

మీసం మెలేసి చెప్పినా......

తనపై జరుగుతున్న ఐటీ దాడులను ధీటుగా ఎదుర్కొంటానని మీసం మెలేసి చెబుతున్న సీఎం రమేష్ పులుకడిగిన ముత్యమేమీ కాదు. రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కోట్లాది రూపాయల బిల్లులను "ఎడ్కో" ఇండియా ప్రయివేటు లిమిటెడ్ అనే సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించినట్లు చెబుతోంది. అసలు ఈ కంపెనీయే లేదని ఆర్వోసీ స్పష్టం చేస్తోంది. ఈ కంపెనీకి తాడు బొంగరం లేదు. కనీసం కార్యాలయం కూడా లేదు. కానీ కంపెనీ పేరుతో ముద్రలు, సీళ్లు తయారు చేసి కథ నడిస్తున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెంట్ సాయిబాబా దగ్గర ఇవి దొరకడం గమనార్హం. కేంద్రమాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కేసు సందర్భంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సెల్టింగ్ ప్రయివేటు లిమిటెడ్ డైరెక్టర్, చిత్తూరు జిల్లాకు చెందిన చిన్న బాలనాగిరెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీబీఐలో ఉన్న అధికారులతో సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఎంపీ రమేష్ కాగా, ఉన్నతాధికారి అలోక్ వర్మ అన్న ఆరోపణ ఉంది. అప్పట్లో బాలనాగిరెడ్డిని అరెస్ట్ చేశారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆగిపోయింది. ఇందుకు కారణం తెరవెనక లాబీయింగ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టీడీపీీకి సీబీఐతో పాటు సెంట్రల్ విజిలెన్స్ లోనూ పట్టుంది. ఆ సంస్థ సారథి కె.వీరయ్య చౌదరి అధికార పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.

సానా సతీష్ ప్రస్థానమిదే.....

విద్యుత్తు శాఖలో చిరుద్యోగిగా ప్రస్థానం ప్రారంభించిన సానా సతీష్ ఇప్పుడు ఢిల్లీలో ప్రముఖ పవర్ బ్రోకర్. ఓ కేసులో రాకేష్ ఆస్థానా 8. 5 కోట్లు అడిగారంటూ వచ్చిన ఆరోపణలు సీబీఐని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో సానా సతీష్ కీలక పాత్రధారి అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చంద్రబాబుకు సన్నిహితుడైన టీడీపీ ఎంపీతో ఆయనకు సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతుంటారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నివసిస్తున్న సతీష్ కోట్లకు పడగలెత్తారు. రాసామా ఎస్టేట్స్, గోల్డ్ కోస్ట్స్ ప్రాజెక్ట్స్, మ్యాట్రిన్ నేచురల్ రీసోర్సెస్ తూర్పు గోదావరి బ్రేవరేజ్ కంపెనీల్లో ఆయన డైరెక్టర్.

సీఎం రమేష్ పై ఆరోపణలు ఎందుకంటే.....?

ఇక సీఎం రమేష్ విషయానికొస్తే యూపీ మాంసం వ్యాపారి ఖురేషీని కేసు నుంచి బయటపడేసేందుకు సానా సతీష్ సీబీఐ డైరెక్టర్ ని కలిశారని చెబుతున్నారు. ఈ కేసు గురించి రమేష్ తో మాట్టాడానని, సీబీఐ డైరెక్టర్ తో మాట్లాడతానని ఆయన భరోసా ఇచ్చారు. తర్వాత రమేష్ ను కలిసినప్పడు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇకపై సీబీఐ నుంచి ఎలాంటి ఇబ్బందులుండవని చెప్పారు. అలాగే జరిగింది. దీంతో కేసు ముగిసినట్లు సానా సతీష్ గత నెల 26న వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. అరెస్టయిన సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్ ఈ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీంతో రమేష్, అలోక్ వర్మ సంబంధాలు బట్టబయలయ్యాయని చెబుతున్నారు. బీజేపీ తో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సీబీఐని ప్రభావితం చేయగల శక్తి గల ఏపీ అధికార పార్టీ పెద్దలు సత్యహరిశ్చంద్రులని చెప్పలేం. పులుకడిగిన ముత్యాలు కానే కాదు. ఇప్పటిదాకా సుద్దులు వల్లించిన నేతలు తమ నిజాయితీని రుజువు చేసుకోవాలి. సీఎం రమేష్ వంటి వారిపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News