మే 29 వరకూ తెలంగాణలో లాక్ డౌన్… అక్కడ మరింత కఠినం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఏడు గంటల పాటు సాగింది. మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా తెలంగాణను వదలడం లేదు. 1096 మందికి రాష్ట్రంలో కరోనా [more]

Update: 2020-05-05 17:03 GMT

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఏడు గంటల పాటు సాగింది. మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా తెలంగాణను వదలడం లేదు. 1096 మందికి రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిందదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈరోజు కొత్తగా 11 మందికి తెలంగాణలో కరోనా సోకిందన్నారు. 680 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. 439 మందికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ముందునుంచి పకడ్బందీ వ్యూహంతోనే తెలంగాణ వ్యవహరించిందని చెప్పారు. అందుకు ఉదాహరణ కరీంనగర్ అని చెప్పారు. దేశానికి కంటెయిన్ మెంట్ అనే పదం తెలియనప్పడే కరీంనగర్ లో కంటెయిన్ మెంట్ జోన్ ను ఏర్పాటు చేశామన్నారు. మరణాల రేటు కూడా దేశంతో పోల్చుకుంటే తెలంగాణలో తక్కువగా ఉందన్నారు. కరోనా వైరస్ కు ఆగస్గు, సెప్టెంబరులో వ్యాక్సిన్ వచ్చే అవకాశముందన్నారు.

స్వీయ నియంత్రణ పాటిస్తూనే…..

ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. తెలంగాణలో తక్కువ నష్టంతో ఉన్నామన్నారు. దీనిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని, భౌతిక దూరం పాటించాలన్నారు. పంటిబిగువున కొంత ముందుకు పోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారెవరూ బయటకు రావద్దని కేసీఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు జిల్లాలు రెడ్ జోన్ లలో ఉన్నాయని చెప్పారు. 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయన్నారు. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 35 కంటెయిన్ మెంట్ జోన్ లో ఉన్నాయన్నారు.

ఈ మూడు జిల్లాల్లో మాత్రం…..

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక్కడ మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఉండవన్నారు. 66 శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. ఈ మూడు జిల్లాల్లోనే అత్యంత జనసాంద్రత ఎక్కువ అని చెప్పారు. ఇక్కడ కమ్యునిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశముందన్నారు. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ప్రజాభిప్రాయం కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలనేనని కేసీఆర్ చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకూ లాక్ డౌన్ ను తెలంగాణలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇంకా కొన్ని రోజులు ప్రజలు సహకరించాలని కోరారు.

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా…

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు అమలు చేస్తామన్నారు. రెడ్ జోన్ లో ఒక్క షాపు కూడా ఓపెన్ చేయమని చెప్పారు. వ్యవసాయ సంబంధ దుకాణాలన్నీ తెరచి ఉంచాయి. హైదరాబాద్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇచ్చేది లేదన్నారు. మే 15వ తేదీ తర్వాత జరిగే మంత్రి వర్గ సమావేశంలో రెడ్ జోన్ లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 27 జిల్లాల్లో అన్ని దుకాణాలు నడుస్తాయన్నారు. మండల కేంద్రాల్లో అన్ని షాపులు తెరుస్తాయన్నారు. మున్సిపాలిటీల్లో మాత్రం యాభై శాతం షాపులు మాత్రమే తెరుచుకుంటాయి. సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయకుంటే వెంటనే వాటిని మూసివేయిస్తామని చెప్పారు. ఉదయం పదిగంటల నుంచి ఆరు గంటల వరకూ షాపులు తెరచి ఉంటాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పూర్తిగా పనిచేస్తుందన్నారు. ఇసుక మైనింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుందన్నారు. పదో తరగతి పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. మే నెలలో నే పదో తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని, ఇందుకు హైకోర్టు అనుమతి కోరతామని చెప్పారు. వలస కూలీలను కూడా వారి రాష్ట్రాలకు పంపుతున్నామన్నారు.

Tags:    

Similar News