మార్పు ఆరంభమయింది రాహుల్…. కొంచెం శ్రమిస్తే?

మోదీ ప్రభుత్వం పై స్పష్టమైన వ్యతిరేకత కన్పిస్తుంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేని వ్యతిరేకత ఇప్పుడు దేశ వ్యాప్తంగా కన్పిస్తుంది. మోదీ అవలంబిస్తున్న విధానాలు, నియంతృత్వ పోకడలతో [more]

Update: 2021-05-10 18:29 GMT

మోదీ ప్రభుత్వం పై స్పష్టమైన వ్యతిరేకత కన్పిస్తుంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేని వ్యతిరేకత ఇప్పుడు దేశ వ్యాప్తంగా కన్పిస్తుంది. మోదీ అవలంబిస్తున్న విధానాలు, నియంతృత్వ పోకడలతో ప్రజలు కూడా విసిగెత్తిపోయారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థించిన ప్రజలు సెకండ్ వేవ్ కరోనా విపత్తుకు ఆయన వైఫల్యమే కారణమని గట్టిగా నమ్ముతున్నారు. రాజకీయాల కోసమే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు క్యాష్ చేసుకుంటుదన్నది చూడాల్సి ఉంది.

మోదీపై అసంతృప్తి….

లోక్ సభ ఎన్నికలకు మరో మూడేళ్ల గడువు ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మోదీపై అసంతృప్తి పెరిగింది. మోదీ మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఎన్నికల సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడం, అవి ముగిసిన వెంటనే పెంచడం ఆనవాయితీగా మారింది. గ్యాస్ ధర పెంపును పేద, మద్యతరగతి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మోదీకి ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మాటలపై విశ్వాసం….

2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారనుకున్నారు. నోట్ల రద్దు సమయంలోనూ ప్రజలు సహనంతో ఆయనకు అండగా నిలిచారు. కానీ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నారన్న ముద్ర మోదీ పై పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

రాహుల్ వైపు…?

తొలినాళ్లలో రాహుల్ గాంధీ విమర్శలను పిల్ల చేష్టలుగా కొట్టిపారేసిన వాళ్లు సయితం ఇప్పుడు ఆయన కామెంట్స్ ను ఆసక్తికరంగా వింటున్నారు. చూస్తున్నారు. దీంతో దేవంలో మార్పు ప్రారంభమయిందనే చెప్పాలి. ఈ మూడేళ్లలో మోదీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మోదీకి ప్రత్యామ్నాయం తామే నని నిరూపించుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అవకాశాలను కొట్టిపారేయలేం.

Tags:    

Similar News