మంత్రి పోస్ట్ పిలుస్తోంది ఆలీ ?

అమాత్య కిరీటం అంటేనే అదొక అందం, అధికారం కంటే అద్భుతమైన బహుమతి వేరొకటి లేదు. అందలాన్ని మించిన స్వర్గ సుఖం కూడా అసలు లేదు. అందుకే ఎంతటి [more]

Update: 2021-03-26 03:30 GMT

అమాత్య కిరీటం అంటేనే అదొక అందం, అధికారం కంటే అద్భుతమైన బహుమతి వేరొకటి లేదు. అందలాన్ని మించిన స్వర్గ సుఖం కూడా అసలు లేదు. అందుకే ఎంతటి వయోవృద్ధులైనా అధికారం కోసం చివరాఖరు వరకూ అలా అర్రులు చాస్తారు. అన్ని రంగాలకూ కేంద్ర బిందువు రాజకీయం. అందుకే తళుకుబెళుకులు ఎన్నో ఉన్నా కూడా సినీ ప్రముఖులు ఏదో ఒక సమయంలో రాజకీయాల వైపు తొంగి చూస్తారు. ఇక ప్రముఖ కమెడియన్ ఆలీ విషయానికి వస్తే ఆయన మొదట్లో టీడీపీకి మద్దతుదారు. అనూహ్యంగా 2019 నాటికి వైసీపీలో తేలారు.

రేసులో ముందుకే….

ఆలీ 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారు. ఆయన మొదట రాజమండ్రీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోరారు. కానీ అప్పటికే దాన్ని వేరొకరికి కేటాయించినందువల్ల జగన్ ఇవ్వలేకపోయారు. అయితే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని చెబుతారు. గత ఏడాది ఏకంగా శాసనమండలికే ఎసరు పెడుతూ జగన్ రద్దు చేశారు. కానీ మారిన రాజకీయ వాతావరణంలో ఇపుడు అదే శాసనమండలి వైసీపీకి కల్పతరువుగా మారుతోంది. దాంతో పాటు ఆశావహులు కూడా ఇపుడు చురుకుగా బయటకు వచ్చి అధినాయకత్వాన్ని కలుస్తున్నారు. వారిలో ఆలీ కూడా ఒకరు.

ఆసక్తికర వ్యాఖ్యలు…

ఈ మధ్యన ఆలీ స్థానిక ఎన్నికల ప్రచారం చేస్తూ మీడియా ముందు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నమ్మిన వారికి న్యాయం చేయడంలో జగన్ ఎపుడూ ముందుంటారని కూడా ఆలీ కితాబు ఇచ్చారు. నామినేటెడ్ పదవులు భర్తీ అవుతున్న వేళ తనకు పదవి రాకపోవడంపైన కూడా ఆయన మాట్లాడుతూ జగన్ వరసగా అందరినీ చూసుకుంటూ వస్తున్నారు. ఆయన తప్పక న్యాయం చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆలీ ఆ మధ్యన జగన్ ని ఆయన చాంబర్ లో కలసి తన విన్నపాలను మరో మారు గుర్తు చేశారని ప్రచారం జరిగింది. దాంతో ఆలీకి తొందరలోనే పెద్దల సభలో ఎమ్మెల్సీ యోగం పట్టడం ఖాయమని అంటున్నారు.

జాక్ పాట్ కొడతారా…?

జూన్ నాటికి ఏపీలో పెద్ద ఎత్తున శాసనమండలిలో సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటిలో ఒకటి కచ్చితంగా ఆలీకి రిజర్వ్ అయిందని ప్రచారం అంటున్నారు. జగన్ కూడా వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సినీ రంగాన్ని ఈసారి గట్టిగానే పట్టించుకోవాలనుకుంటున్నారుట. దాంతో ఆలీకే మొదటి ప్రాధాన్యత అని వినిపిస్తోంది. ఇక చాలా సార్లు మీడియా ముందు ఆలీ తాను రాజకీయాల్లోకి వచ్చేది మంత్రి పదవి కోసమే అని చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేయడానికి మంత్రి పదవి చాలా అవసరం అని కూడా ఆయన భావిస్తున్నారు. మరి ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆలీకి మంత్రి గా కూడా అవకాశం దక్కుతుందని అంటున్నారు. మరి అన్నీ కుదిరితే ఈ కామెడీ స్టార్ రేపటి రోజున బుగ్గ కారుతో దర్జా చేసినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News